'బాహుబలి' లేకపోతే 'సైరా' లేదు
on Sep 22, 2019
రాజమౌళి 'బాహుబలి'ని తీసుండకపోతే, తాము 'సైరా.. నరసింహారెడ్డి' సినిమాని తీసుండేవాళ్లం కాదనీ, 'సైరా' రావడానికి పరోక్షంగా రాజమౌళి దోహదం చేశారనీ అన్నారు చిరంజీవి. 'సైరా' ప్రి రిలీజ్ ఈవెంట్లో ఆయన రాజమౌళిని ఘనంగా కీర్తించారు.
"నా 151వ సినిమాగా ఇది చేస్తే ఎలా ఉంటుంది అన్న మా ఆలోచనకు శ్రీకారం చుట్టిందీ, పరోక్షంగా సపోర్ట్ చేసిందీ దర్శకుడు రాజమౌళి. ఆయన గనుక 'బాహుబలి'ని తీసుండకపోతే, ఈ రోజు 'సైరా.. నరసింహారెడ్డి' వచ్చి ఉండేది కాదు. ఆయన మన తెలుగు సినిమాకి భారతదేశ వ్యాప్తంగా దారి వేశారు. శెభాష్. వందల కోట్లు పెట్టి తీసినా, అంతకు అంతా రాబట్టుకోవచ్చు, నిర్మాతకు నష్టం ఉండదు.. అని భరోసా ఇచ్చిన వ్యక్తి రాజమౌళి. హ్యాట్సాఫ్ టు రాజమౌళి. ఎంతోమందికి ధైర్యాన్నిచ్చాడు. తెలుగువాళ్లు గర్వపడేలా 'బాహుబలి' తీసి, 'సైరా' రావడానికి దోహదం చేసిన రాజమౌళికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ సినిమా నిర్మించడానికి రాంచరణ్ ముందుకొచ్చాడు. కాంప్రమైజ్ కాకుండా మనమే చేద్దామంటే, 'సై' అన్నాను. ఈ సినిమాకి డైరెక్టర్‌గా ఎవరు న్యాయం చేకూరుస్తారనుకుంటే, "మీరే డైరెక్ట్ చేయ్యండి" అని మొదట్నుంచీ నామీద నమ్మకమున్న పరుచూరి వెంకటేశ్వరరావు చెప్పారు. నేను "వద్దండీ. డైరెక్షన్ అనేది ఫుల్‌ప్లెడ్జెడ్ జాబ్. ఒక వైపు యాక్టింగ్ చేస్తూ, దర్శకత్వానికి న్యాయం చెయ్యలేం. నేను చెయ్యలేక కాదు. దేన్నో ఒకటి వదిలెయ్యాలి. దేన్ని వదిలెయ్యమంటారు?" అన్నాను. 'అబ్బబ్బే.. డైరెక్షన్‌ను ఎవరికైనా అప్పగించండి కానీ ఆ కేరెక్టర్ మీరే చెయ్యాలి. ఆ కేరెక్టర్లో తెరపై మీరే కనిపించాలి' అన్నారు" అని చిరంజీవి చెప్పారు.
Also Read