'గద్దలకొండ గణేష్' బాక్సాఫీస్: 2 రోజులు.. 9 కోట్లు!
on Sep 22, 2019
వరుణ్ తేజ్ టైటిల్ రోల్ చేయగా హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన 'గద్దలకొండ గణేష్' (వాల్మీకి) మూవీ రెండో రోజు కూడా చెప్పుకోదగ్గ రీతిలో కలెక్షన్లను రాబట్టింది. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.5 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు రూ. 3.50 కోట్లను వసూలు చేసింది. వెరసి 'గద్దలకొండ గణేష్' రెండు రోజుల షేర్ రూ. 9 కోట్లు దాటింది. శుక్రవారంతో పోలిస్తే శనివారం థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య 25 శాతం తగ్గింది. అయినప్పటికీ ఇవి చెప్పుకోదగ్గ వసూళ్లేనని విశ్లేషకులు అంటున్నారు. ఆదివారం ఎంత తక్కువ అంచనా వేసుకున్నా రూ. 3 కోట్లు రావడం గ్యారంటీ అని, దాంతో తొలి వారాంతం ఈ సినిమా కలెక్షను రూ. 12 కోట్ల మార్కును దాటుతుందని ఊహిస్తున్నారు. నైజాం, ఆంధ్రా, రాయలసీమ ఏరియాల ప్రి రిలీజ్ బిజినెస్ విలువ రూ. 20 కోట్లని విశ్లేషకుల అంచనా. అంటే మూడు రోజులకు 60 శాతం పైగా రికవరీ అయినట్లే.
నైజాంలో తొలి రోజు రూ. 1.6 కోట్లు వసూలవగా, రెండు రోజులకు అది రూ. 3 కోట్ల మార్కును దాటింది. ఇక్కడ బయ్యర్ సేఫ్ అవ్వాలంటే ఇంకో రూ. 4.4 కోట్ల షేర్ రావాలి. రాయలసీమలో రూ. 3.35 కోట్ల ప్రి బిజినెస్ జరగ్గా, రెండు రోజుల్లో అక్కడ రూ. 1.4 కోట్ల షేర్ వచ్చింది. ఇక ఆంధ్రా ఏరియా మొత్తం కలిపి రూ. 9.25 కోట్ల ప్రి బిజినెస్ జరిగింది. రెండు రోజుల్లో ఈ ప్రాంతంలో రూ. 4.6 కోట్ల షేర్ వసూలయ్యింది. 'గద్దలకొండ గణేష్'కు అసలు పరీక్ష సోమవారం నుంచి ఎదురవనున్నది.