English | Telugu

'వరల్డ్ ఫేమస్ లవర్' అయినా 'అర్జున్‌రెడ్డి' లుక్కేనా?

on Sep 21, 2019

 

లాంగ్ హెయిర్.. ఫుల్ బియర్డ్.. నోటిలో సిగరెట్.. నిర్లక్ష్యపు సూపు. ఇదిప్పుడు విజయ్ దేవరకొండ సిగ్నేచర్ లుక్ అయిపోయిందా?.. చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. తొలిసారి ఇలాంటి లుక్‌తో అతను 'అర్జున్‌రెడ్డి' మూవీలో కనిపించాడు. ఆ సినిమా సెన్సేషనల్ హిట్టయి, రాత్రికి రాత్రే విజయ్‌ని స్టార్‌గా మార్చేసింది. ఆ సినిమాలో కథానుసారం జుట్టు, గడ్డం పెరిగిపోయి, మందుతో పాటు సిగరెట్ మీద సిగరెట్ తాగుతూ ఒక పిచ్చివాడి తరహాలో కనిపిస్తాడు విజయ్. చాలా సన్నివేశాలు ఆ లుక్‌తోనే నడుస్తాయి. నిజానికైతే అలాంటి లుక్‌ను ఇష్టపడేవాళ్లు తక్కువ. కానీ సర్‌ప్రైజింగ్‌గా ఆ లుక్‌లో యూత్ బాగా లైక్ చేశారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో విజయ్ ఫుల్ బియర్డ్ లుక్ వైరల్ అయిన తీరే దీనికి నిదర్శనం.

ఆ సినిమా తర్వాత అతడు 'గీత గోవిందం', 'నోటా', 'టాక్సీవాలా', 'డియర్ కామ్రేడ్' సినిమాలు చేశాడు. 'డియర్ కామ్రేడ్'ను మినహాయిస్తే మిగతా మూడు సినిమాల్లో అతడు షార్ట్ హెయిర్ లేదా నార్మల్ హెయిర్‌తో కనిపించాడు. అయితే బియర్డ్ లుక్ మాత్రం కామన్. 'డియర్ కామ్రేడ్'లో కాలేజీ స్టూడెంట్‌గా నార్మల్ లుక్‌తో కనిపించిన విజయ్. తనకు హీరోయిన్ దూరమయ్యాక, 'అర్జున్‌రెడ్డి' తరహా లాంగ్ హెయిర్, ఫుల్ బియర్డ్, సిగరెట్ లుక్‌లోకి రావడం మనం చూశాం. ఆ లుక్ బయటకు వచ్చినప్పుడు.. విజయ్ 'అర్జున్‌రెడ్డి'ని మరిచిపోలేకపోతున్నాడనే కామెంట్లు కూడా వినిపించాయి. ఈ విషయంలో విజయ్‌తో పాటు ఆ మూవీ డైరెక్టర్ భరత్ కమ్మ.. విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. సినిమా కూడా కమర్షియల్‌గా అంతంత మాత్రంగానే ఆడింది.

కొద్ది రోజులు గడిచాయి. క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా షూటింగ్‌లో మునిగిపొయ్యాడు విజయ్. ఆ సినిమాకు 'బ్రేకప్' అనే టైటిల్ పెట్టబోతున్నట్లు మొదట్లో వినిపించింది. కారణం.. ఆ సినిమాలో ఏకంగా నలుగురు హీరోయిన్లు ఉండటం. ఆ నలుగురు.. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరిన్ ట్రెసా, ఇజాబెల్లే లీతే. ఒకరి తర్వాత ఒకరికి ప్రేమిస్తూ, వాళ్లకు బ్రేకప్ చెబుతూ వస్తాడనీ, అందుకే ఆ టైటిల్ పెట్టే అవకాశాలున్నాయనీ ప్రచారం జరిగింది. ఇప్పుడది గతం. సినిమాకు ఇటీవలే 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే టైటిల్ ఫిక్స్ చేసి ఆ సినిమా మేకర్స్ అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఒక తెలుగు సినిమాకు 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే టైటిల్ పెట్టడానికి చాలా గట్స్ కావాలి. విజయ్ కేరెక్టర్ లేదా ఈ సినిమా స్టోరీకి యూనివర్సల్ అప్పీల్ ఉందనుకున్నా, ఒక రీజియనల్ సినిమాకు ఆ టైటిల్ పెట్టడం సాహసం కిందే లెక్క. స్టోరీపరంగా ఆ టైటిల్ యాప్ట్ అని డైరెక్టర్ క్రాంతి మాధవ్ నమ్మకంగా చెబుతున్నాడు.

సరే.. ఈ సినిమాలో విజయ్ కేరెక్టర్ ఒక లవర్ అనేది స్పష్టం కాబట్టి.. అతడి లుక్ అల్ట్రా మోడరన్‌గా కనిపిస్తుందని ఊహించడం నేచురల్. లేదా.. ఏ రాక్‌స్టార్ తరహాలోనో కనిపిస్తాడని అనుకున్న వాళ్లూ ఉన్నారు. వాళ్లందర్నీ షాక్‌కు గురి చేస్తూ.. ఆ సినిమాలో తన లుక్‌ను రివీల్ చేశాడు విజయ్. అది.. అచ్చం 'అర్జున్‌రెడ్డి' తరహాలోనే ఉంది. లాంగ్ హెయిర్, ఫుల్ బియర్డ్‌తో కనిపిస్తూ, తాగుతున్న సిగరెట్‌ను బొటన వేలు, మధ్యవేలుతో పట్టుకొని ఎదుటి వ్యక్తి మీదకు కోపంగా విసిరేస్తున్నట్లుగా ఉన్నాడు విజయ్. నోట్లోంచి బయటకు వస్తున్న సిగరెట్ పొగ.. ముఖంపై గాయాలయినట్లు నెత్తుటి మరకలు.. ఒక యాక్షన్ సీక్వెన్స్ సందర్భంగానో, లేక ఒక ఇంటెన్స్ సీన్ సందర్భంగానో ఆ లుక్‌లో విజయ్ కనిపిస్తాడని ఊహించవచ్చు.

అది ఏ సీన్ అయినా కానివ్వండి.. మళ్లీ మునుపటి 'అర్జున్‌రెడ్డి', 'డియర్ కామ్రేడ్' లుక్‌లోనే విజయ్ కనిపిస్తుండటంతో.. అది విజయ్ సిగ్నేచర్ లుక్ అయిపోయిందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ లుక్‌పై జనరల్ ఆడియెన్స్ నుంచి మిక్సుడ్ రెస్పాన్స్ వస్తోంది. విజయ్ ఇంకా 'అర్జున్‌రెడ్డి' హ్యాంగోవర్ నుంచి బయటకు వస్తున్నట్లు లేదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్‌లో అత్యధికులు మాత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్' లుక్‌ను స్వాగతిస్తున్నారు. మరి.. సినిమాలో ఈ లుక్ ప్రాధాన్యం ఏమిటి? ఈ లుక్‌లో అతను ఎంతసేపు, ఏ సందర్భంలో కనిపిస్తాడనేది తెలియాలంటే కొంత కాలం వేచి చూడాలి.


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here