English | Telugu

'సైరా' సీన్లు.. 'ఒమర్ ముఖ్తార్' సీన్లు ఒక్కలాగే ఉన్నాయా?

on Sep 19, 2019

 

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేసిన 'సైరా.. నరసింహారెడ్డి' క్లైమాక్స్ ఏమిటనేది ట్రైలర్ రిలీజ్ తర్వాత అందరికీ తెలిసిపోయింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని అభిమానించే, ఆయనని తమ దేవుడిగా ఆరాధించే ప్రజల మధ్యే బ్రిటిష్ పాలకులు ఉరి తీస్తారు. చరిత్ర ప్రకారం నరసింహారెడ్డి తలను ఖండించి, 30 సంవత్సరాల పాటు ఆయన తలను కోట గుమ్మానికి వేలాడదీశారు. ఉరి శిక్ష అమలు చేసేప్పుడు నరసింహారెడ్డి రవ్వంతైనా ఆందోళన చెందలేదు. నిబ్బరంగా ఆ శిక్షను అనుభవించాడు. కానీ ఆ శిక్షను ప్రత్యక్షంగా చూస్తున్న జనం మాత్రం శోకసంద్రంలో మునిగిపోయారు. తనను ఉరి తీసే సమయంలో "భారతమాతకీ" అని నినదించాడు నరసింహారెడ్డి. జనం "జై" అని గొంతు కలిపారు. నరసింహారెడ్డిని ఉరి తీసేశారు. జనం పెద్ద పెట్టున రోదిస్తూ కేకలు వేశారు. వాళ్లల్లో చిన్నా, పెద్దా అంతా ఉన్నారు.

సీన్ కట్ చేస్తే..
'ఒమర్ ముఖ్తార్' సినిమా క్లైమాక్స్ సీన్..
మైదాన ప్రాంతం.. చుట్టూ సామాన్య జనం. వాళ్లల్లో పసి పాపల నుంచి పండు ముసలివాళ్ల వరకు ఉన్నారు. వాళ్ల మధ్య కాస్తంత ఎత్తులో ఏర్పాటు చేసిన ఉరికంబం. ఉరి శిక్షకు సిద్ధమయ్యాడు ఒమర్ ముఖ్తార్. లిబియా స్వాతంత్ర్యం కోసం 73 సంవత్సరాల పండు ముసలితనంలో తుపాకీ చేతపట్టి, గుర్రంపై స్వారీ చేస్తూ ఇటలీ నియంత ముస్సోలినీకి ముచ్చెమటలు పట్టించిన తిరుగుబాటుదారుడు ఒమర్ ముఖ్తార్. ఉరితాడు తన మెడకు తగిలించినా, ఎలాంటి తొట్రుపాటు లేకుండా, మహా నిబ్బరంగా అ ఎదుట ఉన్న తనవాళ్లను చూస్తూ అమరుడయ్యాడు. దుఃఖితులైన ఆ జనం నోటితో శబ్దాలు చేస్తూ, అతడికి అంజలి ఘటించారు.

ముస్తఫా అక్కడ్ డైరెక్ట్ చేయగా 1981లో వచ్చిన 'ఒమర్ ముఖ్తార్' మూవీ కల్ట్ క్లాసిక్‌గా వరల్డ్ సినిమా హిస్టరీలో నిలిచింది. సుప్రసిద్ధ నటుడు ఆంథోనీ క్విన్ మహాద్భుతంగా టైటిల్ రోల్ పోషించి సినీ ప్రియుల హృదయాల్లో శాశ్వత స్థానం దక్కించుకున్నాడు. నిజానికి నరసింహారెడ్డికి ఒమర్ సమకాలీనుడు కాదు, ఆయన తర్వాతి తరం వాడు. 1858లో జన్మించాడు. 1931 సెప్టెంబర్ 16న ఆయనను ఇటలీ పాలకులు ఉరితీశారు.

'సైరా' ట్రైలర్‌లో నరసింహారెడ్డిని ఉరితీసే సీన్ చూస్తుంటే, చప్పున 'ఒమర్ ముఖ్తార్' క్లైమాక్స్ గుర్తుకు రావడం మన తప్పు కాదు. చూస్తుంటే ఆ మూవీ క్లైమాక్స్ స్ఫూర్తితోనే 'సైరా' క్లైమాక్స్‌ను చిత్రీకరించారేమోననే అభిప్రాయం కలుగుతుంది. నరసింహారెడ్డి "భారతమాతకీ" అనే నినాదం మినహాయిస్తే, దాదాపు రెండు క్లైమాక్స్ సీన్లూ ఒకే విధంగా ఉన్నట్లు అనిపిస్తున్నాయి.

ఈ సీన్ ఒక్కటే కాదు.. ఉరి శిక్ష అమలు చేయక ముందు నరసింహారెడ్డిని బ్రిటిష్ న్యాయస్థానంలో విచారించే సన్నివేశం ఉంది. అక్కడే బ్రిటిష్ జడ్జి ఆయనకు ఉరిశిక్ష విధిస్తాడు. అప్పుడే జడ్జి "నీ ఆఖరి కోరిక ఏమిటి?" అనడిగితే, "గెటౌట్ ఫ్రం మై మదర్‌ల్యాండ్" అని సింహనాదం చేసినట్లు ట్రైలర్‌లో మనం చూశాం.

సరిగ్గా 'ఒమర్ ముఖ్తార్'లోనూ అలాంటి కోర్టు సీనే ఉంటుంది. ఇటలీ పాలకులు ఏర్పాటు చేసే న్యాయస్థానం ఒమర్ ముఖ్తార్‌కు ఉరిశిక్ష విధిస్తుంది. అయితే నరసింహారెడ్డి గర్జించినట్లు ఒమర్ గర్జించడు. నింపాదిగా మాట్లాడతాడు.

ఈ తేడాలు మినహాయిస్తే 'సైరా'లోని పలు సన్నివేశాలకు 'ఒమర్ ముఖ్తార్' ప్రేరణగా నిలిచిందనే అభిప్రాయం కలుగుతుంది. డైరెక్టర్ ముస్తఫా అక్కడ్ రియలిస్టిక్ అప్రోచ్‌తోటే 'ఒమర్ ముఖ్తార్'ను రూపొందించాడు. అందువల్లే ఆ సినిమా సీన్లు గ్రాండియర్‌గా కాకుండా, వాస్తవికంగా కనిపిస్తాయి. ఇటలీ సైన్యంపై ఒమర్ ముఖ్తార్ చేసే పోరాట సన్నివేశాలు సైతం అలాగే ఉంటాయి.

'సైరా'లో అందుకు భిన్నంగా గ్రాండియర్‌గా యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించారు. మిగతా సన్నివేశాల్లోనూ రిచ్‌నెస్ కనిపిస్తుంది. ఈ విషయంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి రియలిస్టిక్ అప్రోచ్‌ని పక్కనపెట్టేశాడని చెప్పడానికి సంశయించాల్సిన పనిలేదు. సినిమాటిక్ లిబర్టీని తీసుకొని 'సైరా'ను భారీతనంతో నింపేశాడు.

'సైరా' ఏ మేరకు 'ఒమర్ ముఖ్తార్' బాటలో, ఆ పోలికలతో ఉంటుందనే విషయం అక్టోబర్ 2న స్పష్టం కానున్నది.


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here