'టాక్సీవాలా' పిల్లకు ఇంకో ఛాన్స్...
on Aug 24, 2019
అందం, అభినయంతో పాటు హీరోయిన్ ఛాన్సులు రావాలంటే అదృష్టం కలసి రావాలని ఇండస్ట్రీ జనాలు అంటుంటారు. ప్రియాంకా జవాల్కర్ ను చూస్తే నిజమేనేమో అనిపిస్తుంటుంది. 'టాక్సీవాలా'లో విజయ్ దేవరకొండ సరసన నటించిందీ అమ్మాయి. అదే ఆమెకు తొలి సినిమా. అప్పటికి 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' విజయాలతో విజయ్ దేవరకొండ జోరులో ఉన్నాడు. 'నోటా' ప్లాప్ అయినప్పటికీ 'టాక్సీవాలా' విడుదలపై అదేమంత ప్రభావం చూపలేదు. ప్రియాంకా జవాల్కర్ మొదటి సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. అయితే... అవకాశాలు అందుకోవడంలో ఎందుకో ఆ అమ్మాయి వెనుకబడింది. పలు వాయిదాల తరవాత 'టాక్సీవాలా' విడుదలైనట్టు... 'టాక్సీవాలా' విడుదలైన ఆల్మోస్ట్ ఏడాదికి ఆమెకు మరో ఛాన్స్ వచ్చింది. నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా రూపొందనున్న ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ప్రియాంకా జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. సృజన దర్శకురాలిగా పరిచయం కానున్న ఈ సినిమాలో ఆమెది ముస్లిం యువతి పాత్ర. ఈ సినిమాతో అయినా ఆమె కెరీర్ దూసుకు వెళ్లాలని ఆశిద్దాం.