English | Telugu

'సాహో'లో ఏం ఉందబ్బా!

on Aug 23, 2019

 

ప్రభాస్ హీరోగా నటించిన 'సాహో' మూవీ ఆగస్ట్ 30న వరల్డ్‌వైడ్‌గా అత్యధిక థియేటర్లలో రిలీజవుతోంది. తెలుగు ఒరిజినల్‌తో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్లలోనూ ఈ సినిమాని నిర్మాతలు రిలీజ్ చేస్తున్నారు. 'బాహుబలి', 'బాహుబలి 2' వంటి ఇండియన్ హయ్యెస్ట్ గ్రాసర్ మూవీస్ చేశాక ప్రభాస్ ఆల్ ఇండియా స్టార్‌గా మారడం మనం చూశాం. ఇది అతడిపై ఒత్తిడి కలిగించడం సహజం. 'బాహుబలి' రేంజి కేరెక్టర్ చేశాక ప్రభాస్ సాధారణ పాత్రలు చేస్తే అటు ఫ్యాన్స్, ఇటు రెగ్యులర్ ఆడియెన్స్ అసంతృప్తికి గురవుతారు. అందుకే 'సాహో' వంటి హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ చేశాడు ప్రభాస్. దీని కోసం ప్రొడ్యూసర్స్ ఏకంగా 350 కోట్ల రూపాయలు వెచ్చించారని అంచనా.
వాస్తవానికి ఆగస్ట్ 15న 'సాహో'ను రిలీజ్ చెయ్యాలని ప్రొడ్యూసర్స్ భావించారు. అధికారికంగా ఆ డేట్‌ను చాలా కాలం క్రితమే ప్రకటించారు. అది స్వాతంత్ర్య దినోత్సవ తేదీ కాబట్టి ప్రేక్షకుల్లో బాగా రిజిస్టర్ అవుతుందనీ, నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ కలిసొస్తుందనీ అనుకున్నారు. కానీ అనూహ్యంగా రిలీజ్ డేట్‌ను 15 రోజులు పోస్ట్‌పోన్ చేసి ఆగస్ట్ 30న సినిమా వస్తుందని చెప్పారు నిర్మాతలు. విడుదలలో ఆలస్యం జరగడానికి వీఎఫ్ఎక్స్ వర్క్ అనుకున్న టైంకు పూర్తి కాకపోవడమే కారణమని తెలిపారు. మొత్తానికి ప్రభాస్ మునుపటి మూవీ 'బాహుబలి 2' వచ్చిన రెండు సంవత్సరాల నాలుగు నెలలకు 'సాహో' ప్రేక్షకుల ముందుకు వస్తుండటం గమనార్హం.
'సాహో'కు సంబంధించి అందర్నీ ఆశ్చర్యపరచిన విషయం, దాని డైరెక్టర్. ఎస్.ఎస్. రాజమౌళి వంటి ఇండియన్ టాప్ డైరెక్టర్‌తో పనిచేసి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ప్రభాస్, తన తర్వాతి సినిమాకి కేవలం ఒకే ఒక్క సినిమా ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సుజిత్‌ను డైరెక్టర్‌గా ఎంచుకోవడం ఏమిటని ప్రశ్నించిన వాళ్లు చాలామందే ఉన్నారు. సుజిత్ అదివరకు శర్వానంద్‌తో 'రన్ రాజా రన్' అనే రొమాంటిక్ క్రైం థ్రిల్లర్ రూపొందించాడు. అది చెప్పుకోదగ్గ సక్సెస్ సాధించింది. ఆ సినిమాని సుజిత్ తీసిన విధానం నచ్చి, తనకు అతడు చెప్పిన కథ నచ్చి ప్రభాస్ అతనికి ఛాన్సిచ్చేశాడు. 'బాహుబలి 2' రాకముందే 'సాహో' కథను అతను ఓకే చేశాడు.
'సాహో'ను ఈ రేంజ్ స్కేల్‌లో తియ్యాలని ప్రభాస్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ మొదట అనుకోలేదు. కానీ 'బాహుబలి 2' తర్వాత నేషనల్ లెవల్లో ప్రభాస్‌కు వచ్చిన ఇమేజ్, 'సాహో'పై నేషనల్ మీడియా చూపించిన ఇంట్రెస్ట్‌తో ఈ సినిమాని మామూలుగా తీస్తే సరిపోదని అందరికీ అర్థమైపోయింది. అందుకే కథను ఏ మాత్రం మార్చకుండానే, అందులోని సన్నివేశాల్నీ, యాక్షన్ ఎపిసోడ్స్‌నీ, సాంగ్స్‌నీ చాలా గ్రాండ్ స్కేల్‌లో తీశారు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్‌ను తీసుకొచ్చి యాక్షన్ సీక్వెన్సెస్ తీశారు. దీని కోసం సుజిత్ పడిన కష్టం సామాన్యమైంది కాదు. రెండేళ్ల పాటు 'సాహో' కోసం అతడు పర్సనల్ లైఫ్‌ను కూడా దాదాపు పక్కన పెట్టేశాడని యూనిట్ మెంబర్స్ చెప్పారు. ఆ విషయం అలా ఉంచితే సుజిత్ పనితనాన్ని స్వయంగా రాజమౌళి మెచ్చుకున్నాడు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో అతడు ఒకడవుతాడని ఆయనతో పాటు ప్రభాస్ కూడా గట్టి నమ్మకంతో చెబుతున్నాడు. అనేక సన్నివేశాల్ని, ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్‌కు ముందు వచ్చే లీడ్ సీన్స్‌ని చాలా బాగా డిజైన్ చేశాడనీ, అలాగే ప్రభాస్, శ్రద్ధ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్‌ను బాగా పిక్చరైజ్ చేశాడనీ చెబుతున్నారు.
సినిమా కేస్టింగ్ చూస్తే.. 'సాహో' ఏ రేంజి సినిమానో ఇట్టే అర్థమవుతుంది. ప్రభాస్ జోడీగా మంచి డిమాండ్‌లో ఉన్న బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించగా, నీల్ నితిన్ ముఖేశ్ మెయిన్ విలన్ రోల్‌లో కనిపించనున్నాడు. జాకీ ష్రాఫ్, మహేశ్ మంజ్రేకర్, చుంకీ పాండే, టిన్నూ ఆనంద్, ఎవ్లీన్ శర్మ, మందిరా బేడి, మురళీ శర్మ వంటి బాలీవుడ్ యాక్టర్లు, అరుణ్ విజయ్, లాల్, వెన్నెల కిశోర్, సుప్రీత్ వంటి దక్షిణాదిలో పేరుపొందిన నటులు ఈ సినిమాలో భాగస్వాములయ్యారు. ఇక 'బ్యాడ్ బాయ్' సాంగ్‌లో ప్రభాస్‌తో మరో బాలీవుడ్ క్వీన్ జాక్వలిన్ ఫెర్నాండెజ్ మెరుపులు మెరిపించనున్నది.
ఇంతకీ 'సాహో' కథాంశమేమిటి? 2000 కోట్ల రూపాయల దోపిడీ చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుందనీ, ఆ దోపిడీ వెనకున్న వ్యక్తుల్ని పట్టుకోడానికి అండర్ కవర్ ఏజెంట్‌గా ప్రభాస్ రంగంలోకి దిగుతాడనీ ట్రైలర్ బట్టి మనకు అర్థమైంది. ఈ ఆపరేషన్‌లో క్రైం బ్రాంచ్ ఆఫీసర్ అమృతా నాయర్ రోల్‌లో శ్రద్ధ అతనికి తోడవుతుంది. ఈ క్రమంలో ఆ ఇద్దరూ ప్రేమలో పడి, తర్వాత గొడవపడి, తిరిగి ఒక్కటవుతారని తెలుస్తోంది. సో.. ఇలాంటి ఎన్నో విశేషాలతో ఆగస్ట్ 30న రిలీజవుతోన్న 'సాహో' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో.. లెటజ్ వెయిట్ అండ్ సీ.. 


Cinema GalleriesLatest News


Video-Gossips