English | Telugu

అలాద్దీన్‌ సినిమా రివ్యూ

on May 24, 2019


నటీనటులు: విల్ స్మిత్, మేనా మస్సౌడ్, నవోమీ స్కాట్, మార్వాన్ కెంజారి తదితరులు

నిర్మాణ సంస్థలు: వాల్ డిస్నీ పిక్చర్స్, మార్క్ ప్లాట్ ప్రొడక్షన్స్ 

సినిమాటోగ్రఫీ: అలాన్ స్టీవార్ట్ 

సంగీతం: అల‌న్ మెన్‌కెన్‌

దర్శకత్వం: గై రిచీ 

విడుదల తేదీ: మే 24, 2019

వయసుతో, భాషతో, ప్రాంతంతో, దేశంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను అలరించిన, ఆకట్టుకున్న అరబిక్ జానపద కథ 'అల్లాదీన్ అద్భుతదీపం'. ఈ కథకు, ఈ కథతో రూపొందిన టీవీ సిరీస్‌ల‌కు, యానిమేషన్ సినిమాకు అభిమానులు ఎంతో మంది! ఇప్పుడీ కథ లైవ్ యాక్షన్ సినిమాగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జీనీ పాత్రలో ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ నటించగా, ఆయన పాత్రకు వెంకటేష్ డబ్బింగ్ చెప్పారు. అలాద్దీన్ పాత్రకు వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పారు. వాళ్ళ డబ్బింగ్ ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? ఓసారి చదవండి. 


కథ:
అనగనగా ఓ అరేబియన్ దేశం అగ్రబా. అందులో ఓ వీధి దొంగ అల్లాదీన్ (మేనా మస్సౌడ్). అతడికి ఓ పెంపుడు కోతి అబు. ఒకరోజు వీధిలో పరిచయమైన అమ్మాయితో ప్రేమలో పడతాడు. తరవాత ఆమె రాజకుమారి జాస్మిన్ (నవోమి స్కాట్) అని అతడికి తెలుస్తుంది. అగ్రబా రాజపీఠంపై కన్నేసిన జాఫర్ (మార్వాన్ కెంజారి), రాకుమారి నీ చెంతకు చేరేంత ధనవంతుణ్ణి చేస్తానంటూ అలాద్దీన్ ను ఓ గుహ దగ్గరకు తీసుకువెళ్తాడు. అక్కడ అతడికి ఓ అద్భుతద్వీపం దొరుకుతుంది. ఆ దీపాన్ని రుద్దినప్పుడు అందులోంచి బయటకు వచ్చిన జీనీ (విల్ స్మిత్) సహాయంతో రాకుమారి ప్రేమను సొంతం చేసుకోవడానికి అల్లాదీన్ ఎటువంటి ప్రయత్నాలు చేశాడు? అగ్రబా దేశాన్ని జాఫర్ నుంచి ఎలా రక్షించాడు? అనేది మిగతా సినిమా.


ప్లస్ పాయింట్స్:

వెంకటేష్, వరుణ్ తేజ్ డబ్బింగ్

విజువల్ ఎఫెక్ట్స్ 

విల్ స్మిత్, నవోమీ స్కాట్ నటన


మైనస్ పాయింట్స్:

తెలిసిన కథే

తెలుగు వెర్షన్ పాటలు 

నేపథ్య సంగీతం

దర్శకత్వం


విశ్లేషణ:

అల్లాదీన్ కథ అందరికీ తెలుసు కనుక అదనపు హంగులపై ఎక్కువ దృష్టి పెట్టినట్టున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. లైవ్ యాక్షన్ గ్రాండియర్ గా ఉంది. అయితే... సినిమా నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. ముఖ్యంగా తెలుగు వెర్షన్ పాటలు అసలు బాగోలేదు. కొన్నిటిలో సాహిత్యం అర్థం కాదు కూడా! తెలుగు ప్రేక్షకులకు ఈ కథను మరింత దగ్గర చేసేది మాత్రం వెంకీ, వరుణ్ డబ్బింగే. జీనీ పాత్రకు వెంకీ చెప్పిన డబ్బింగ్ నవ్వులు పూయిస్తుంది. అలాద్దీన్ పాత్రకు వరుణ్ తేజ్ చక్కగా డబ్బింగ్ చెప్పారు. దాదాపుగా చిత్రకథ ప్రేక్షకులకు తెలిసినదే. అయితే... అందులో కొన్ని చిన్న చిన్న మార్పులు చేశారు. కథను అలాద్దీన్ కోణం నుంచి కాకుండా జీనీ కోణం నుంచి వివరించారు. విలన్ జాఫర్ పాత్రను కొంచెం కఠినంగా తీర్చిదిద్దారు. జాస్మిన్ పాత్రనూ కేవలం ఫెమినిస్ట్ గానే కాకుండా, దేశాన్ని పరిపాలించాలనుకునే అమ్మాయిగా చూపించారు. 

 

నటీనటుల పనితీరు:

జీనీగా విల్ స్మిత్ నటన, కామెడీ టైమింగ్, ముఖ్యంగా ఆ టైమింగ్ కి తగ్గట్టు వెంకటేష్ డబ్బింగ్ ప‌ర్‌ఫెక్ట్‌గా కుదిరాయి. జాస్మిన్ పాత్ర కోసం తయారుచేసిన బొమ్మలా తన నటనతో నవోమీ స్కాట్ ఆకట్టుకుంది. అలాద్దీన్ పాత్రకు మేనా మస్సౌడ్ కూడా చక్కగా సరిపోయాడు. మేనా, నవోమీ కెమిస్ట్రీ బాగుంది.

 

తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

నటీనటులు చక్కటి అభినయంతో ఆకట్టుకున్నా... దర్శకుడు కథను ఆకట్టుకునేలా చెప్పడంలో విఫలమయ్యాడు. అయినప్పటికీ సినిమాలో విజువల్స్ ఎఫెక్ట్స్, గ్రాండియర్ ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేస్తాయి. అలాద్దీన్ యానిమేషన్ సినిమా అభిమానులకు, 90లలో పిల్లలకు ఈ సినిమా మంచి అనుభూతి ఇస్తుంది. 

రేటింగ్: 2.5


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here