చిరంజీవి కోసం కొరటాల కొత్త కథ!
on Jan 21, 2019
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ప్రారంభమైందీ సినిమా. ప్రస్తుతం సెట్స్ మీదున్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రీకరణ పూర్తి చేశాక... వేసవిలో కొరటాల సినిమాను పట్టాలు ఎక్కించాలని చిరంజీవి ఆలోచిస్తున్నారట. వేసవిలో సినిమా సెట్స్ మీదకు వెళ్లాలంటే చిన్న మెలిక ఒకటుంది. అదేంటంటే... వేసవిలోపు కొరటాల కథ రెడీ చేయాలట. ఆల్రెడీ మూడు నెలలు కష్టపడి ఓ కథ రాశారు. అది చిరంజీవికి అంతగా నచ్చకపోవడంతో మరో కొత్త కథ కావాలని అడిగారట. దాంతో ఆయనకు మరో లైన్ చెప్పి, స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశారట.
సందేశాత్మక కథలకు కమర్షియల్ హంగులు అద్ది ప్రేక్షకులు మెచ్చే సినిమాలు తీయడం కొరటాల శివ ప్రత్యేకత. 'మిర్చి', 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'భరత్ అనే నేను' సినిమాల్లో ఏ కథ తీసుకున్నా కొత్తగా ఉండదు. కానీ, ఆయన సినిమాలను తెరకెక్కించిన విధానం బావుంటుంది. అయితే చిరంజీవి పూర్తిగా కొత్త కథను ఆశిస్తున్నారట. ఆయన ఇమేజ్, స్టార్డమ్ దృష్టిలో పెట్టుకుని కొరటాల శివ కథపై కసరత్తులు చేయడం ప్రారంభించారని సమాచారం.