'గారు'.. బన్నీ 'గారు'... బహు బాగుందండీ!
on Dec 18, 2018
ప్రతి సినిమా ఫంక్షన్‌కీ సరికొత్త ఎజెండాతో వస్తున్నాడు అల్లు అర్జున్. ఫంక్షన్ ఫంక్షన్‌కీ అతడి మాటల్లో ఎంతో పరిణితి కనిపిస్తుంది. గతంలో ఒకసారి అల్లు అర్జున్ స్పీచ్ వివాదాస్పదమైంది. తరవాత కొన్ని రోజులు సోషల్ మీడియాలో కొందరు అతణ్ణి టార్గెట్ చేశారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అదే సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌ని అందరూ ప్రశంసిస్తున్నారు. తన సినిమా ఫంక్షన్లో మాట్లాడినా... ఇతర హీరోల సినిమా ఫంక్షన్స్‌కి అతిథిగా వచ్చి మాట్లాడినా... ఓ మంచి విషయాన్ని అల్లు అర్జున్ చెబుతున్నాడు. 'టాక్సీవాలా' ఫంక్షన్లో రచయితలకు గౌరవం ఇవ్వాలని చెప్పాడు. అంతకు ముందు తన సినిమా ఫంక్షన్లలో కొందరు రచయితలను గౌరవించాడు. లేటెస్టుగా 'పడి పడి లేచి మనసు' ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రముఖులందరికీ గౌరవం ఇవ్వాలని చెప్పాడు. ప్రతి ఒక్కరినీ 'గారు' అని పిలవాలని కోరాడు. దీనికి కారణం టీవీల్లో, సోషల్ మీడియాలో ప్రముఖుల్ని కొందరు వ్యక్తులు ఏక వచనంతో పిలవడం తనకు నచ్చలేదని అల్లు అర్జున్ అన్నాడు.
"టీవీల్లో.. సమాజంలో... సినిమా సెలబ్రిటీలను, రాజకీయ నాయకులను ఏక వచనంతో పిలుస్తున్నారు. ముఖ్యమంత్రులను కూడా. ఏ కేసీఆర్, ఏ చంద్రబాబునాయుడు.. అంటున్నారు. అరేయ్.. ఒరేయ్.. ఏంటిది? విమర్శించవచ్చు... తప్పు లేదు. కానీ, గౌరవించాలి. చంద్రబాబునాయుడు గారు.. కేసీఆర్ గారు.. అనాలి. 'గారు' అన్నాక... విమర్శించండి" అని అల్లు అర్జున్ అన్నాడు.
ఇంకా స్టయిలిష్ స్టార్ మాట్లాడుతూ "మొన్న ఓసారి టీవీ చూస్తుంటే ఎవడో ఒకడు 'ఏయ్... చిరంజీవిని పిలువ్' అంటున్నాడు. చిరంజీవి అనడం ఏంట్రా? చిరంజీవిగారు. అందరూ నేర్చుకోండి.. పవన్ కల్యాణ్ గారు. రాజకీయ నాయకులు అయినంత మాత్రానా వాళ్లకు గౌరవం ఇవ్వకూడదని ఎవరూ హక్కు ఇవ్వలేదు. సమాజంలో ఎవరికైనా గౌరవం ఇవ్వడంలో తప్పే లేదు. ఇష్టం వున్నా.. లేకున్నా... ఎదుటివ్యక్తిని గౌరవించాలి. వినడానికి ఆర్టిఫీషియల్ గా ఉన్నా.. మంచి విషయం కాబట్టి అలవాటు చేసుకోండి" అన్నాడు.
ఇటీవల చిరంజీవిని, పవన్ కల్యాణ్‌ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా కొందరు రాజకీయ విమర్శలకు దిగుతున్నారు. ఏక వచనంతో సంభోదిస్తూ మాట్లాడుతున్నారు. అటువంటి వీడియోలకు బన్నీ కౌంటర్ ఇచ్చాడని ఇండస్ట్రీ గుసగుస. రాజకీయ నాయకులు అయినంత మాత్రానా వాళ్లకు గౌరవం ఇవ్వకూడదని ఎవరూ హక్కు ఇవ్వలేదని మాట్లాడటం వెనుక అర్థం అదే అంటున్నారు. అదండీ సంగతి.