ENGLISH | TELUGU  

అమర్ అక్బర్ ఆంటోని రివ్యూ

on Nov 16, 2018

నటీనటులు: రవితేజ, ఇలియానా, సునీల్, 'వెన్నెల' కిశోర్, సత్య, శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, జయప్రకాశ్ రెడ్డి, షాయాజీ షిండే, అభిమన్యు సింగ్, విక్రమ్ జిత్, తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్ తదితరులు
కెమెరా: వెంకట్ సి. దిలీప్
కథ: వంశీరాజేశ్ కొండవీటి, శ్రీనువైట్ల
సంగీతం: ఎస్.ఎస్. తమన్
నిర్మాత‌లు: నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శ్రీను వైట్ల
విడుదల తేదీ: నవంబర్ 16, 2018

తెలుగు ప్రేక్షకులను 'వెంకీ' సినిమాతో రవితేజ, శ్రీనువైట్ల విపరీతంగా నవ్వించారు. తరవాత 'వెంకీ' స్థాయిలో కానున్నా... 'దుబాయ్ శీను'తోనూ నవ్వించారు. రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా 'నీ కోసం'ను మినహాయిస్తే... మిగతా రెండు చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. వీరిద్దరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన నాలుగో సినిమా 'అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని'. గత కొన్ని సినిమాలుగా సరైన విజయాలు లేని రవితేజ, శ్రీనువైట్ల ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారా? నవ్వించారా? లేదా? రివ్యూ చదవండి.

క‌థ‌:
తన ప్రాణానికి ప్రాణమైన స్నేహితురాలు ఐశ్వర్య (ఇలియానా)ను చంపాడన్న కారణంగా ఒకరిని హత్య చేసి అమర్ (రవితేజ) చిన్నతనంలో జైలుకు వెళతాడు. 14 ఏళ్లు జైలు జీవితం గడిపి వచ్చిన తరవాత తన కుటుంబాన్ని, తన స్నేహితురాలు ఐశ్వర్య (ఇలియానా) తల్లిదండ్రులను చంపిన నలుగురు వ్యక్తులపై పగ తీర్చుకోవాలని ప్రయాణం ప్రారంభిస్తాడు. ఈ ప్రయాణంలో గ్లాస్ పగిలిన శబ్దం విన్నప్పుడు ముస్లిమ్ వ్యక్తి అక్బర్ వలే, మానసిక రోగులను చూసినప్పుడు డాక్టర్ మార్క్ ఆంటోని వలే ప్రవర్తిస్తాడు. బాంబ్ పేలిన శబ్దాలు విన్నప్పుడు అమర్ పాత్రలో వస్తాడు. అమర్ ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? అమర్ మరణించిందనుకున్న ఐశ్వర్య ఎలా బ‌తికింది? పూజాగా పేరు ఎందుకు మార్చుకుంది? అమ‌ర్ త‌న ప‌గ‌ను ఎలా తీర్చుకున్నాడు? చివరికి... అమర్, ఐశ్వర్య ఎలా కలిశారు? అనేది సినిమా!

ప్లస్ పాయింట్స్:

సునీల్, సత్య కామెడీ..
రవితేజ-ఇలియానా, రవితేజ-శ్రీనువైట్ల కాంబినేషన్స్  

మైనస్ పాయింట్స్:

శ్రీనువైట్ల కథ, దర్శకత్వం
తమన్ స్వరపరిచిన బాణీలు
ఏమాత్రం ఆసక్తిగా సాగని కథనం

విశ్లేషణ:

సింపుల్‌గా చెప్పాలంటే... 'అత‌నొక్క‌డే' + 'అపరిచితుడు' = 'అమర్ అక్బర్ ఆంటోని'. నందమూరి క‌ల్యాణ్‌రామ్‌ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'అతనొక్కడే' సినిమా గుర్తుందా? ఒకవేళ అందులో హీరో 'అపరిచితుడు' సినిమాలో విక్రమ్ వలే వింత వింతగా ప్రవర్తిస్తే ఎలా వుంటుందో? అచ్చంగా 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా అలాగే వుంటుంది. బోనస్ ఏంటంటే... ఇలియానా పాత్రకూ మ‌ల్టిపుల్ ప‌ర్స‌నాలిటీ డిజార్డ‌ర్‌ పెట్టారు. అందువల్ల, ప్రేక్షకులకు రెండు సన్నివేశాల్లో నవ్వుకునే భాగ్యం దక్కింది. ప్రేక్షకులకు గుర్తుకు వచ్చేవిధంగా ఏమాత్రం ఆసక్తి లేకుండా సాగిన కథనానికి తోడు అసలు నవ్వించని సన్నివేశాలు సినిమాలో చాలా వున్నాయి. శ్రీనువైట్ల మరోసారి ఫామ్‌లో లేడ‌నే విష‌యాన్ని మ‌రోసారి ఈ సినిమా గుర్తు చేస్తుంది. ఒకవేళ ఆయన ఫామ్‌లో వుండి వుంటే... కథ ఎలా వున్నా కామెడీతో ప్రేక్షకుల్ని నవ్వించేవారు. ఏదో అరకొర సన్నివేశాల్లో తప్ప సినిమాలో విపరీతంగా నవ్వుకునే సన్నివేశాలు లేవు. ఈ కథను నమ్మి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఎంత ఎందుకు ఖర్చుపెట్టిందో? అమెరికా నేపథ్యంలో సినిమాను తీయాల్సిన అవసరం లేదు. ఇండియా అయినా కథలో మార్పు ఏం వుండదు. ఎస్.ఎస్. తమన్ బాణీల్లో ఒక్కటీ గుర్తు పెట్టుకునే విధంగా లేదు. నేపథ్య సంగీతం కూడా అంతంత మాత్రమే. సాంకేతిక పరంగానూ గుర్తుపెట్టుకునే అంశాలేవీ సినిమాలో లేవు.   

నటీనటుల పనితీరు:
అమ‌ర్‌గా రవితేజ నటన ఆకట్టుకుంది. సెటిల్డ్‌గా చేశారు. మిగతా రెండు క్యారెక్ట‌రైజేష‌న్స్‌లో ఓవర్ యాక్టింగ్ చేశారు. ఆంటోని పాత్రలో అతి మంచితనం ఎక్కువ అయితే... అక్బర్ పాత్రలో డైలాగ్ డెలివరీ, వాయిస్ మాడ్యులేషన్ సరిగా నప్పలేదు. ఇలియానా బొద్దుగా కనిపించింది. ఫ‌స్ట్‌టైమ్ ఈ సినిమా కోసం తెలుగులో డ‌బ్బింగ్ చెప్పుకుంది. ఆమె వాయిస్ పర్వాలేదు. హాస్య నటులు సినిమాలో చాలామంది వున్నారు. కానీ, నవ్వించింది మాత్రం ఇద్దరే. కేఏ పాల్ శిష్యుడి పాత్రలో సత్య, అప్పులు చేసి హాబీ వున్న వ్యక్తిగా సునీల్. అక్కడక్కడా 'వెన్నెల' కిశోర్ పర్వాలేదనిపించాడు. అభిమన్యు సింగ్ నటనకు, ఆ పాత్రకు చెప్పిన డ‌బ్బింగ్‌కు ఎక్క‌డా సంబంధం వుండ‌దు. విలన్స్ అందరూ రొటీన్ యాక్టింగ్ చేశారు. ఒకప్పటి హీరోయిన్ లయ అసలు ప్రాధాన్యత లేని అతిథి పాత్రలో సందడి చేశారు. హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో లయ కుమార్తె చక్కగా నటించారు.

చివరగా:

డాక్టర్ ఆంటోని పాత్రలో రవితేజ 'ఐ స్ట్రాంగ్. యు స్ట్రాంగ్. వుయ్ ఆల్ స్ట్రాంగ్. రిలాక్స్' అని సిగ్నేచర్ డైలాగ్ చెబుతుంటాడు. ఎదుటివ్యక్తి ఎంత ఆందోళనలో వున్నప్పటికీ అదే డైలాగ్ చెబుతాడు. తెరపై వచ్చే సన్నివేశాలు ఎంత ఆందోళనలకు గురి చేస్తున్నా... ప్రేక్షకులు అదే విధంగా 'రిలాక్స్.. రిలాక్స్' అంటుకుంటా వుండాలి. థియేట‌ర్ల‌లో స్ట్రాంగ్‌గా కూర్చోగ‌ల‌గాలి. లేదంటే క‌ష్టం!!

రేటింగ్: 1.5/5


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.