లక్ష్మీపార్వతి పాత్రలో శ్రీరెడ్డి.!!!
on Oct 23, 2018
బాలకృష్ణ కథానాయకుడిగా, నిర్మాతగా క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకి పోటీ అన్నట్టుగా వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. నిజానికి వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'ని బాలకృష్ణ 'ఎన్టీఆర్ బయోపిక్' అనౌన్స్ చేసిన సమయంలోనే అనౌన్స్ చేసారు. తరువాత సైలెంట్ అయ్యారు. మళ్ళీ ఏమైందో ఏంటో ఉన్నట్టుండి తిరుపతిలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పూజా కార్యక్రమాలు చేసారు. అంతేకాదు నా చేసే సినిమాలు నిజాలు చెప్తా.. ఎన్టీఆర్ ఆశీస్సులు కూడా తన సినిమా మీదే ఉంటాయని వర్మ అన్నారు. అంతేనా 'ఎన్టీఆర్ బయోపిక్' విడుదల సమయంలోనే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదల అంటూ డేట్ అనౌన్స్ చేసారు. అంటే ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీ అనమాట. అయితే ఈ ఎపిసోడ్ మొత్తంలో మరో యాంగిల్ కూడా ఉంది. వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' కి పోటీగా ‘లక్ష్మీస్ వీరగ్రంథం' వస్తుంది. వర్మ సినిమా చేస్తే ఈ సినిమా చేస్తారు. వర్మ సినిమా ఆపేస్తే ఈ సినిమా కూడా ఆపేస్తారు.
అయితే ఇప్పుడు ‘లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో లక్ష్మీపార్వతి పాత్రలో శ్రీరెడ్డి నటించబోతుందట. తాజాగా ఈ సినిమా నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ‘లక్ష్మీస్ వీరగ్రంథం’లో శ్రీరెడ్డిని ప్రధాన పాత్రలో తీసుకోవడానికి ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశానికి ముందు జరిగిన అంశాలతో తాను ‘లక్ష్మీస్ ‘వీరగ్రంథం’ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు కేతిరెడ్డి ప్రకటించారు. అయితే రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం నిలిపేస్తే తానూ ‘లక్ష్మీస్ ‘వీరగ్రంథం’ నిలిపేస్తానని, ఆయన విడుదల చేస్తే తానూ విడుదల చేస్తానని కూడా కేతిరెడ్డి గతంలోనే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల తిరుపతిలో వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ షూటింగ్ ప్రారంభించడంతో.. కేతిరెడ్డి బృందం కూడా రంగంలోకి దిగింది. అతి త్వరలో ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత కేతిరెడ్డి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.