అంతా మేకప్ మహిమే!
on Oct 23, 2018
నయనతార, ఆర్య, నజ్రియా నటించిన 'రాజా రాణీ' సినిమా గుర్తుందా? అందులో ఒక సన్నివేశం వుంది. అమ్మాయి వెంటపడిన స్నేహితుడిని కొట్టిన వ్యక్తి దగ్గర వెళ్లిన ఆర్య 'ఎప్పుడు ఫిగర్ కోసం మనం కొట్టుకోకూడదు బ్రదర్' అని, 'ఫిగర్ అంటే ఏంటో చెప్పారా?' అని స్నేహితుడు (సంతానం)కు చెబుతాడు. ఓ అందమైన అమ్మాయిని చూపించిన సంతానం 'ఆదివారం 8 నుంచి 9 గంటల మధ్య నైటీలో ఎలా వుంటుందో ఊహించుకో?' అంటాడు. ఊహలో అదే అందమైన అమ్మాయి చిరాగ్గా కనపడుతుంది. అప్పుడు సంతానం 'పూలు అమ్మే పిల్ల కూడా ఐబ్రోస్ ట్రిమ్ చేసుకుని తిరుగుతుంది. ఒక నెల అన్ని బ్యూటీపార్లర్స్ మూసేస్తే ఒరిజినల్ ముఖాలన్నీ గతుకుల రోడ్డులా బయటపడతాయి. అంతా మేకప్పే' అని భారీ డైలాగ్ కొడతాడు. అందులో అంతా మేకప్పే అనేది మేల్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యింది.
ఇప్పుడీ సీన్ మళ్ళీ గుర్తు చేయడం ఎందుకంటే? 'హలో గురు ప్రేమ కోసమే' సక్సెస్‌మీట్‌లో దర్శకుడు త్రినాథరావు నక్కిన సరదా సరదాగా మాట్లాడుతూ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ గురించి మాట్లాడిన మాటలు ఆ సన్నివేశాన్ని గుర్తు చేయడం గ్యారెంటీ. ఆయన సరదాగా అన్నారో.. నిజంగా అన్నారో తెలియదు గానీ, అనుపమను మేకప్ లేకపోతే గుర్తు పట్టడం కష్టమని అన్నారు. ఒక రోజు లోకేషన్‌కి వచ్చిన అనుపమ కారులోంచి దిగి నేరుగా ఆయన వద్దకు వెళితే త్రినాధరావు గుర్తు పట్టలేదట. మేకప్ వేసుకున్నాక.. ఆమెను గుర్తు పట్టాననీ చెప్పారు. అనుపమ అందం అంతా మేకప్ మహిమే, ఆమె అందమంతా మేకప్పే అన్నట్టు మాట్లాడారు. పాపం... ప్రేక్షకుల ముందు అనుపమా పరమేశ్వరన్ గాలి తీసేశారు.