పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టాలని!
on Oct 18, 2018
విజయదశమి సందర్భంగా 'పడి పడి లేచె మనసు' మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఆల్రెడీ రిలీజైన టీజర్ చూశారు కదా! అందులో సన్నివేశాలు చిత్రీకరించిన సందర్భంలో చోటు చేసుకున్న సరదా దృశ్యాలను మేకింగ్ వీడియోలో చూపించారు. శర్వానంద్, సాయిపల్లవి షూటింగులో బాగా ఎంజాయ్ చేశారని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఈ వీడియో విడుదల వెనుక ఉద్దేశం కూడా కెమెరా వెనుక శర్వా, సాయిపల్లవి సఖ్యతగా వున్నారని చెప్పడమే అని సమాచారం. యమహానగరి... కలకత్తా పురిలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. అప్పట్లో శర్వానంద్, సాయిపల్లవి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగాయని.. శర్వానంద్ సరైన సమయానికి షూటింగుకు రాకపోవడం వలన సాయిపల్లవి దర్శకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిందని పుకార్లు వచ్చాయి. హైదరాబాద్ వచ్చిన తరవాత కూడా శర్వానంద్ తీరు మారలేదని, సమయానికి షూటింగుకు వచ్చేవాడు కాదని ఫిలింనగర్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపించాయి. వీటన్నిటికీ ఫుల్స్టాప్ పెట్టడానికి ఈ మేకింగ్ వీడియో విడుదల చేసినట్టు టాక్. 'అందాల రాక్షసి'తో దర్శకుడు హను రాఘవపూడికి అభిమానులు ఏర్పడ్డారు. 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'తో విజయాన్నీ అందుకున్నాడు. కానీ, 'లై' సినిమా ప్లాప్ కావడంతో హను రాఘవపూడి ప్రతిభపై సందేహాలు వచ్చాయి. 'పడి పడి లేచె మనసు' టీజర్, మేకింగ్ వీడియో చూస్తుంటే సందేహాలు అవసరం లేదని చెప్పేట్టు కనిపిస్తున్నాడు. ప్రేక్షకుల్లో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. డిసెంబర్ 21న ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.