సుమంత్ గడ్డం తీసేశాడు.. ఎందుకో తెలుసా?
on Sep 17, 2018
'గడ్డం.. అదే తమకు అందం' అంటుంటారు కొందరు హీరోలు! ఉదాహరణకు... జెడి చక్రవర్తి. తెలుగులో గడ్డానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే కొన్నాళ్లు ప్రేక్షకులు ఆయన పేరే చెప్పారు. హీరోల్లో చాలామంది కథకు అవసరాన్ని బట్టి గడ్డం పెంచుతుంటారు. తీసేస్తుంటారు. కాని కొంతమంది ఎప్పుడూ గడ్డంతో కనిపిస్తుంటారు. అటువంటి హీరోల్లో ఏయన్నార్ మనవడు, అక్కినేని నాగార్జున మేనల్లుడు సుమంత్ ఒకరు. క్లీన్ షేవ్‌లో సుమంత్‌ని చూసి ఎన్నాళ్లు అయ్యిందో ఒక్కసారి గుర్తుచేసుకోండి. వెంటనే చెప్పడం కష్టమే. 'ఏమో గుర్రం ఎగరావచ్చు', 'నరుడా డొనరుడా', 'మళ్లీ రావా' సినిమాల్లో గడ్డంతో కనిపించాడు. ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతోన్న 'ఇదం జగత్', 'సుబ్రమణ్యపురం' సినిమాల్లోనూ గడ్డంతోనే కనిపించనున్నాడు. ఆల్రెడీ విడుదలైన ఫస్ట్ లుక్స్‌లో గడ్డంతో వున్నాడు. వున్నట్టుండి ఈ హీరో గడ్డం తీసేశాడు... ఎందుకు తెలుసా? ఎన్టీఆర్ కోసం. నిజమే.. ఎన్టీఆర్ కోసం సుమంత్ గడ్డం తీసేశాడు.
నందమూరి తారక రామారావు జీవితకథ ఆధారంగా రూపొందుతోన్న సినిమా 'యన్టీఆర్'. బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. 'మహానటి'లో అక్కినేనిగా నాగచైతన్య నటించాడు. 'యన్టీఆర్'లో సుమంత్ నటిస్తున్నాడు. తన తాతయ్య పాత్రలో అతను నటిస్తుండడం ఇదే మొదటిసారి. అక్కినేని ఎప్పుడూ క్లీన్ షేవ్‌తో వుండేవారు. అందుకని, ఆయన పాత్రలో నటిస్తున్న సుమంత్ కూడా క్లీన్ షేవ్‌తో కనిపించడం కోసం గడ్డం తీసేశారు. అదండీ సంగతి!!
Also Read