ఈ సెలబ్రెటీల సీక్రెట్ – యోగా!
on Jun 21, 2018
ఎవరన్నా సెలబ్రెటీని చూస్తే.. ‘అబ్బా! ఈ వయసులో కూడా ఎంత అందంగా, ఆరోగ్యంగా ఉన్నారో!’ అనిపిస్తుంది కదా. వాళ్ల దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, రకరకాల ఆపరేషన్లు చేయించుకుని అలా తయారయ్యారు అనుకుంటాం కదా. కానీ యోగా చేస్తే చాలు ఎలాంటివారికైనా అందం, ఆరోగ్యం సొంతమేనని నిరూపిస్తున్నారు చాలామంది సెలట్రెటీలు. వాళ్లెవరో మీరే చూడండి!
శిల్పాషెట్టి
బాలీవుడ్ హీరోయిన్లు యోగా నేర్చుకోవడం కొత్తేమీ కాదు. కానీ దానికి మొట్టమొదటిసారిగా సెలబ్రెటీ స్టేటస్ తెచ్చింది మాత్రం శిల్పాషెట్టీనే. ఒకసారి ఏదో మెడనొప్పి తగ్గడం కోసం శిల్ప యోగా మొదలుపెట్టారు. అంతే! ఇక దాని మాయలో మైమరచిపోయారు. ఇప్పుడ శిల్పా, యోగాలో ఎంత కష్టమైన ఆసనమైనా చిటికెలో వేసేస్తారు. అంతేకాదు! తను నేర్చుకున్న ఆసనాలను పదిమందికీ నేర్పించేందుకు, డీవీడీలు కూడా రిలీజ్ చేశారు. ఏళ్లు గడిచినా తరగని తన అందానికి కారణం యోగానే అంటారు శిల్ప.
కరీనాకపూర్
బాలీవుడ్లో ఓ ఎవర్గ్రీన్ సెన్సేషన్ కరీనా. ఒకప్పుడు కరీనా సైజ్ జీరోకి కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ఆ క్రెడిట్ అంతా కూడా యోగాదేనట. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా రోజూ ఉదయం కనీసం రెండు గంటలు యోగా చేస్తుందట కరీనా. పండంటి బాబుకి జన్మనిచ్చిన తర్వాత కూడా, తిరిగి తన ఫిజిక్‌ని సొంతం చేసుకోగలిగిందంటే దానికి యోగానే కారణం అంటారు.
మలైకా అరోరా
ఆడవాళ్లు వయసు చెప్పకూడదని అంటారు కానీ, మలైకా వయసు అక్షరాలా 44 ఏళ్లు. ఇంత వయసులోనూ ఆమె అందాన్ని చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతుంటారు. మరి దీనికి కారణం ఈపాటికే ఊహిచేసి ఉంటారుగా. యోగానేనండీ! రోజూ రెండేసి గంటలు పవర్ యోగా చేయడం వల్ల తన వయసు మీద అదుపు సాధించేసింది మలైకా! అందుకే ఇప్పటికీ ఐటం సాంగ్ చేయాలంటే మలైకా తర్వాతే ఎవరైనా.
లారాదత్తా
శిల్పాషెట్టిలాగే లారాదత్తా కూడా యోగాకి మంచి పాపులారటీ తీసుకువచ్చింది. ఒకమాటలో చెప్పాలంటే ఇప్పుడు లారా వృత్తి యోగా నేర్పించడమే! ఇందుకోసం Heal with Lara పేరుతొ ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేశారు. గర్భవతిగా ఉన్నప్పుడు కూడా యోగా ఎలా చేయవచ్చో చూపిస్తూ ఆమె చేసిన Parental Yoga ఒక సెన్సేషన్.
మగవాళ్లు కూడా!
హీరోయిన్స్ సరే! మరి మగవాళ్లకి ఆరోగ్యం అవసరం లేదా? దాని కోసం యోగా చేయక్కర్లేదా? అంటే లేకేం... అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీనే. ఇండియాలాంటి టీమ్‌కి కేప్టెన్‌గా ఉండటం అంటే ఎంత ఒత్తిడితో కూడుకున్న పనో చెప్పేదేముంది. అలాంటి ఒత్తిడిని ఎదుర్కొనేందుకు, కాన్ఫిడెంట్‌గా ఉండేందుకు యోగా చాలా ఉపయోగపడుతుందని చెబుతున్నాడు కోహ్లీ! ఇక అక్షయ్‌కుమార్, అనిల్కపూర్లాంటి హీరోలు కూడా తమ ఆరోగ్యానికీ, ప్రశాంతతకూ యోగానే కారణం అని చెబుతుంటారు.
హాలీవుడ్లో సైతం
యోగా వల్లే తమ శరీరం ఫిట్‌గా ఉందనేవాళ్లు హాలీవుడ్లో కూడా కనిపిస్తారు. 60 ఏళ్లలో కూడా యవ్వనంగానే కనిపించే మడోనా; ప్రపంచంలోని అందగత్తెలలో ఒకరిగా పేరుతెచ్చుకున్న జెన్నిఫర్ అనిస్టెన్లాంటి హాలీవుడ్ తారలు యోగా అంటే మైమరచిపోతారు.
మరెందుకాలస్యం. మనం కూడా ఓ నాలుగు ఆసనాలు నేర్చేసుకుని young and fit గా ఉందామా!!!
- నిర్జర.