English | Telugu

మూవీ రివ్యూ.. గాయం చేసిన "గాయత్రి"

on Feb 9, 2018

తారాగణం: మోహన్ బాబు, మంచు విష్ణు, శ్రియ, శివప్రసాద్...
దర్శకత్వం: మదన్
నిర్మాత: మోహన్ బాబు

సాంకేతికంగా సినిమా దూసుకుపోతోంది. నడకలో వేగం పుంజుకుంది. స్క్రీన్ ప్లే విధానాల్లో మార్పులొచ్చాయ్. హాలీవుడ్ స్థాయికి భారతీయ సినిమా చేరుకుంటోంది. ప్రేక్షుకుల అభిరుచిలో కూడా మార్పలొచ్చాయ్. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా..  కొత్తదనానికి పట్టాభిషేకం చే్స్తున్నారు. కానీ... కొందరు మాత్రం ఇంకా నిద్రావస్థలోనే ఉన్నారు. అప్టేట్ కారు. కొత్తదనాన్ని వాళ్లు గౌరవించరు.  తద్వారా దెబ్బతినేది నిర్మాతలే. 

ఇక ఈ శుక్రవారం విడుదలైన  ‘గాయత్రి’ సినిమా విషయానికొద్దాం. కొంత విరామం తర్వాత కలక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా నటించిన సినిమా ఇది. నిర్మాత కూడా ఆయనే. మదన్ దర్శకుడు. ముందు ఈ సినిమా కథ గురించి చెప్పుకుందాం...

శివాజీ మంచి నటుడు. ఓ ఆనాథ శరణాలయం నడుపుతుంటాడు. నటుడికి శరణాలయం నడిపేంత స్తోమత ఎక్కడ్నుంచి వచ్చింది? అనే డౌట్ మీకు రావొచ్చు. భుక్తి కోసం నటించే శివాజీ... శరణాలయ నిర్వాహణ కోసం మరో పని కూడా చేస్తుంటాడు. అదే... నిజజీవితంలో నటించడం. చిన్న చిన్న నేరాల వల్ల.. బడా బాబులకు జైలు శిక్ష పడితే... వారి స్థానే.. శివాజీ జైలు శిక్ష అనుభవిస్తుంటాడు. తద్వారా వచ్చే సొమ్ముతో.. తన శరణాలయాన్నే కాదు... పలు శరణాలయాలకు ఆర్థిక సాయం చేస్తుంటాడు. కారణం తన కూతరు. ఏదో ఒక శరణాలయంలో తాను పెరుగుతున్నట్లు శివాజీకి తెలుసు. కానీ.. అది ఏ శరణాలయమో తెలీదు. అందుకే... అన్ని శరణాలయాలకూ డబ్బు పంపుతుంటాడు. ఓ శుభసమయాన కూతురు జాడ శివాజీకి తెలుస్తుంది. రేపు కూతుర్ని కలుస్తాడు.. అనగా.. అతని జీవితంలో ఊహంచని దుస్సంఘటన జరుగుతుంది. అదేంటి? శివాజీ కూతురు ఎక్కడో పెరగడానికి కారణం ఏంటి? అసలు ఆ తండ్రీ కూతుళ్లు ఎలా కలిశారు? అనేది మిగిలిన కథ. 

కథ బావుంది. మోహన్ బాబు కేరక్టరైజేషన్లో కూడా కొత్తదనం ఉంది. అయితే...  స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు.  90ల నాటి టేకింగ్. దాంతో పాత సినిమా చూస్తున్న ఫీలింగ్.  కథలో కీలకం అనుకున్న చాలా సన్నివేశాలు ఫోర్స్ డ్ గా అనిపిస్తాయ్. అర్థం పర్థం లేని అడ్డదిడ్డమైన నడక. 130 మందిని చంపిన ఓ దుర్మార్ఘుడు. ఓ నరహంతకుడు. జైల్లో ఓ చివరి కోరిక కోరితే.. ఆ కోరిక తీర్చాలంటూ... జనాలు ఉద్యమాలు చేయడం ఏంటండీ కామెడీ కాకపోతే.  ఇలాంటి  ఫోర్స్ డ్ డ్రామా ఇందులో చాలానే ఉంది. ఇందులో హీరోగా మనకు మోహన్ బాబు కనిపిస్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో వయసులో ఉన్న మోహన్ బాబుగా విష్ణుబాబు కనిపిస్తాడు. ఈ అరాచకమైన ఆలోచన దర్శకునికి ఎందుకొచ్చిందో.!... 

ఈ సినిమాలో కాస్త ఊరట అంటే.. అది మోహన్ బాబు నటనే. ఓ విధంగా ఆయన నుంచి కూడా సరైన నటన రాబట్టుకోలేకపోయాడు మదన్. కొన్ని సన్నివేశాల్లో మాత్రం పాత మోహన్ బాబు కనిపిస్తాడు. మదన్ రాసుకున్న కొన్ని డైలాగులు... బాగా పేలాయ్. ముఖ్యంగా ఆంధ్ర పాలిటిక్స్ నీ... టీడీపీని టార్గెట్ చేస్తూ చెప్పిన డైలాగులకు విజిల్స్ పడుతున్నాయ్. శ్రియది చిన్న పాత్రే అయినా... ఉన్నంతలో బాగా చేసింది. విష్ణు కూడా ఫర్వాలేదనిపించాడు. 
సాంకేతికంగా చెప్పుకుంటే రెండు పాటల మినహా చెప్పుకుంటానికి ఏమీ లేదు. టోటల్ గా ’గాయత్రి’ ప్రేక్షకులను బాగానే గాయం చేసింది. 

రేటింగ్:  ఇక ఈ సినిమాకు రేటింగ్ ఏం ఇస్తాం? అందుకే.. నమస్కారం. 


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here