మణికర్ణికను ఏం చేస్తారో..?
on Feb 8, 2018
ఎంతో కష్టపడి తీసిన పద్మావత్‌ను థియేటర్లలోకి రప్పించడానికి సంజయ్‌లీలా భన్సాలీ ఎన్ని తిప్పలు పడ్డాడో ప్రపంచం మొత్తం చూసింది. అల్లావుద్దీన్ ఖిల్జీకి పద్మావతికి డ్యూయెట్ పెట్టారంటూ.. రాజ్‌పుత్ కర్ణీసేన ధుమ్.. ధామ్ చేసింది. విడుదల జరిగితే భన్సాలీ తలను తెగనరుకుతామని రాజ్‌పుత్ కార్యకర్తలు రచ్చ రచ్చ చేయడం.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సినిమాను నిషేధించారు. ఆ తర్వాత నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం.. సెక్యూరిటీ పెట్టయినా సినిమాను రిలీజ్ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇంత కథ నడిస్తే కానీ.. పద్మావత్ కథ ప్రేక్షకుల దాకా రాలేదు.
ఇప్పుడు తాజాగా మరో సినిమాను వివాదం చుట్టుముట్టింది. క్వీన్ కంగనా రనౌత్ లీడ్ రోల్లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మణికర్ణిక సినిమాపై ఇప్పుడు వివాదం చెలరేగింది. ఝాన్సీ లక్ష్మీ బాయ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీ షూటింగ్‌ని వెంటనే నిలిపివేయాల్సిందిగా సర్వ బ్రాహ్మిణ్ మహాసభ డిమాండ్ చేస్తోంది. ఈస్టిండియా కంపెనీకి చెందిన బ్రిటిష్ అధికారితో లక్ష్మీబాయ్‌కు లవ్ సాంగ్ చిత్రీకరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. సినిమాలో వివాదాస్పద అంశాలు ఉండవని దర్శకనిర్మాతలు హామీ ఇచ్చాకే మణికర్ణిక షూటింగ్‌కు అనుమతి ఇవ్వాలని వారు కోరుతున్నారు. పద్మావత్లా దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగకముందే ఈ సినిమాపై స్పందించాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.