త్రివిక్రమ్ కు పవన్ కండిషన్..
on Oct 20, 2017
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. అంతేకాదు ఈ సినిమాకి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించి పవన్ త్రివిక్రమ్ కు ఓ కండీషన్ పెట్టాడట. ఇంతకీ పవన్ పెట్టిన ఆ కండిషన్ ఏంటనుకుంటున్నారా..? అదేంటంటే.. వచ్చే ఎన్నికల్లో పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాలని ఇప్పటినుండే ప్లాన్ వేస్తున్నారు. అప్పటి లోగా తాను తీయబోయే సినిమాలన్నింటిని త్వరగా పూర్తి చేసి.. రాజకీయాలపై దృష్టి పెట్టాలనుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా షూటింగ్ ను నవంబర్ 25 నాటికి పూర్తి చేయమని త్రివిక్రమ్ కి చెప్పాడట. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలావరకూ పూర్తయింది. తాజాగా కేరళలో ఒక షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఇక పవన్ చెప్పిన కండిషన్ ను సీరియస్ గా తీసుకున్నత్రివిక్రమ్.. పనులను వేగవంతం చేస్తున్నట్టు సమాచారం. ఈ నెల 21వ తేదీ నుంచి వచ్చేనెల 15వ తేదీ వరకూ యూరప్ లో చివరి షెడ్యూల్ ను పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వచ్చేనెల 25 నాటికి పూర్తయ్యేలా చూస్తున్నాడట. మరి చూద్దాం ఏం జరుగుతుందో...