లక్ష్మీపార్వతిగా రోజా.. ఎన్టీయార్ గా విజయచందర్?
on Oct 11, 2017
రామ్ గోపాల్ వర్మ తీరు చూస్తుంటే... యుద్ధానికే ‘సై’ అంటున్నట్లుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వర్మ ప్రకటన.. సెగలు పుట్టిస్తోంది. ఇప్పటికే ఎన్టీయార్ చివరి రోజుల ఆధారంగా ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ సినిమాను ప్రకటించేశాడు. ఇప్పుడు ఈ సినిమాలో రోజా కూడా భాగం కానుండంతో... సినిమా ఎలా ఉండబోతోందో... జనాలకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. పలమనేరులో జరిగిన విలేకరుల సమావేశంలో పాత్రధారుల ప్రసక్తి వచ్చినప్పుడు... ‘రోజా ఉండే అవకాశం ఉంది’ అని చెప్పేశాడు వర్మ. రోజా స్థాయి నటి ఈ సినిమాలో నటిస్తే... కచ్చితంగా అది ‘లక్ష్మీపార్వతి’ పాత్రే అయ్యుంటదని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. రోజా కూడా ఈ సినిమాలో నటించేందుకు మాం...చి ఉత్సాహంగా ఉందని తెలుస్తోంది. పైగా ఎన్టీయార్ అంటే రోజాకి అలవిమాలిన అభిమానం.
వైసీపీ నేత నిర్మాత అయినప్పుడు.. వైసీపీ ప్రముఖ నాయకురాలైన రోజా ప్రధానపాత్రధారి అయినప్పుడు.. సినిమా ఎలా ఉంటుందో చెప్పేదేముంది. మరి ఎన్టీయార్ పాత్రను ఎవరితో చేయిస్తారు? అనంటే... బయోపిక్ ల స్పెషలిస్ట్ వైసీపీలోనే ఉన్నాడు కదా! అనే సమాధానం వినిపిస్తోంది. ఆయన ఎవరో కాదు ‘విజయచందర్’. ఇప్పటికే జీసెస్ బయోపిక్, వేమన బయోపిక్, షిర్డీసాయిబాబా బయోపిక్, టంగుటూరి ప్రకాశం పంతులు బయోపిక్ లలో నటించిన విజయ్ చందర్ కి ‘ఎన్టీయార్ బయోపిక్’ లో నటించడం విషయం కాదు కదా! చివరకు అదే జరుగుతుందేమో! చూద్దాం.
మొత్తానికి వైసీపీ ఓ వ్యూహం ప్రకారం ముందుకెళ్తున్నట్లు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. నవంబర్ నుంచి మే వరకూ ఆరు నెలల పాటు జగన్ పాద యాత్ర. ఆ వేడి చల్లారక ముందే... అక్టోబర్ లో ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ సినిమా విడుదల. ఆ వేడి చల్లారక ముందే.. ఎన్నికలు. ఓ వైపు పాద యాత్ర సింపతీతో... మరో వైపు ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ ప్రభావంతో... జగన్ సీఎం అవుదామని గట్టి ప్లానే వేశాడు. ఎన్నికల సమయంలో ఈ సినిమా క్లిప్పింగులను కూడా ఓ రేంజ్ లో వాడుకుంటారని ప్రత్యేకించి చెప్పాలా?