సామాన్యుడికి అందని బాహుబలి!
on Apr 24, 2017
ఈ నెల 28న బాహుబలి 2 విడుదల అవుతోంది. ఎన్నో కోట్ల హృదయాల నిరీక్షణకు ఆ రోజు తెర పడబోతోంది. బాహుబలి ని ఎట్టిపరిస్థితుల్లోనూ చూడాల్సిన సినిమా అన్నట్టుగా మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఎవరిని కదిపినా.. బాహుబలి ఊసే. అందుకే ఈ చిత్రరాజాన్ని ఎప్పుడెప్పుడు చూసేద్దామా అంటూ సగటు ప్రేక్షకుడు ఎదురు చూపుల్లో పడిపోయాడు. అంతా బాగానే ఉంది. అయితే.. ఈ సినిమా సామాన్య ప్రేక్షకుడికి చేరువలో ఉందా? లేదా? అనేదే ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న. బాహుబలి రికార్డుల కోసమైతే నేమీ, ఈ సినిమాకి ఉన్న డిమాండ్ వల్ల అయితేనేమి తొలి వారం రోజుల్లో టికెట్ దొరికే పరిస్థితి లేదు. ఫ్యాన్స్ షోలతో బాహుబలి హంగామా మొదలవుతుంది. ఆ షో కి ఇంకా పర్మిషన్లు రాకపోయినా ఒక్కో టికెట్ దాదాపుగా 2 వేల రూపాయలు ఉంటుందన్నది ఓ అంచనా.
తొలి రోజు టికెట్ రేట్లను పెంచుకోవడానికి ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి అటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతులు సంపాదించుకోవడానికి నిర్మాతలు ప్రయత్నాలు ప్రారంభించేశారు. తొలి మూడు రోజుల్లో తమకు ఇష్టం వచ్చిన రేటుకి సినిమా టికెట్ అమ్ముకోవొచ్చన్న మాట. అదే జరిగితే.. ఒక్కో టికెట్ కనీసం రెండొందలైనా ఉంటుంది. ఇప్పటికే ఏపీ లోని కొన్ని థియేటర్లలో తొలి వారం ఒక్కో టికెట్నీ రూ.200 నుంచి రూ.500 వరకూ అమ్ముకోవడానికి థియేటర్ యాజమాన్యం సిద్ధమైపోయిందని తెలుస్తోంది.
అంటే... థియేటర్ యాజమాన్యమే బ్లాక్లో అమ్ముకోబోతోందన్నమాట. ఇక అనుమతులు మంజూరైతే ఈ టికెట్ రేట్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇదంతా రికార్డుల కోసమే అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి 1 లానే బాహుబలి 2 కూడా రికార్డుల్ని బద్దలు కొట్టడం ఖాయం. అందుకోసం సామాన్య ప్రేక్షకుడికి బాహుబలిని దూరం చేయడం మాత్రం అన్యాయం. కనీసం నేల, బెంచి టికెట్లయినా, అసలు రేట్లకు అమ్మేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. మరి వాళ్లేం చేస్తారో చూడాలి.