ప్రతిచోటా ఒకటే మాట వింటున్నా.. పవర్-ప్యాక్డ్ బ్లాక్‌బస్టర్!
on Apr 10, 2021
బాబాయ్ పవన్ కల్యాణ్ సినిమా 'వకీల్ సాబ్' అబ్బాయ్ రామ్‌చరణ్‌కు తెగ నచ్చేసింది. ఏప్రిల్ 9న విడుదలైన ఈ మూవీని అదే రోజు సాయంత్రం వీక్షించాడు చరణ్. బాబాయ్ కెరీర్లో 'వకీల్ సాబ్' మరో ల్యాండ్‌మార్క్ ఫిల్మ్‌గా అతను అభివర్ణించాడు. ఆ సినిమాపై తన ఆలోచనలను ట్విట్టర్ వేదికగా అతను పంచుకున్నాడు. ఎక్కడ విన్నా ఒకటే మాట వినిపిస్తోందనీ, అది పవర్-ప్యాక్ట్ బ్లాక్‌బస్టర్ అనే మాట అనీ అతను రాసుకొచ్చాడు. 'వకీల్ సాబ్' టీమ్ మొత్తాన్ని అభినందించాడు.
"ప్రతిచోటా ఒకే ఒక మాట వింటున్నా.. అది పవర్-ప్యాక్ట్ బ్లాక్‌బస్టర్! పవన్ కల్యాణ్ గారికి ఇది మరో ల్యాండ్‌మార్క్ ఫిల్మ్. డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు, నిర్మాతలు రాజు గారు, శిరీష్ గారు, మొత్తం నటీనటులు, సాంకేతిక బృందానికి అభినందనలు. అన్నివిధాలా అర్హమైంది." అని ట్వీట్ చేశాడు చరణ్.
టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలన్నీ 'వకీల్ సాబ్'పై ప్రశంసల జల్లు కురపిస్తుండగా, తొలిరోజు కలెక్షన్ల విషయంలో టాలీవుడ్ టాప్ 5 గ్రాసర్‌గా అది నిలిచింది. ఈ ఏడాది 'వకీల్ సాబ్'దే తొలిరోజు రికార్డ్. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఫస్ట్ డే అది రూ. 32 కోట్లకు పైగా షేర్ సాధించింది.