‘దిల్ బేచారా’ ట్రైలర్ రివ్యూ: నవ్వులు... కన్నీళ్లూ!
on Jul 6, 2020
దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి సినిమా ‘దిల్ బేచారా’. ప్రముఖ నవల ‘ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ బేస్ చేసుకుని తీసిన ఈ సినిమా జూలై 24న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో రిలీజ్ కానుంది. సోమవారం ట్రైలర్ రిలీజ్ చేశారు. సుమారు మూడు నిమిషాల ట్రైలర్ ప్రేక్షకులను నవ్వించింది. మధ్య మధ్యలో కంటతడి పెట్టిస్తుంది కూడా! ఆల్రెడీ నవలను కొంతమంది చదివి ఉంటారు కనుక... ట్రైలర్లో కథను దాచే ప్రయత్నం చేయలేదు. హీరో హీరోయిన్స్ ఇద్దరికీ క్యాన్సర్ అనే విషయాన్ని చెప్పేశారు. కథ కంటే కథను ఎంత అందంగా తెరకెక్కించామనేది ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేశారు. స్టోరీలో ఎమోషన్స్‌ని స్ర్కీన్ మీదకు ఎలా తీసుకొచ్చామనేది చెప్పే ప్రయత్నమే ఎక్కువ కనిపించింది.
ఓ రాజు, ఓ రాణి... ఇద్దరూ మరణించడంతో కథ ముగుస్తుందనే డైలాగులతో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. సుశాంత్ మరణించిన తరవాత రిలీజ్ అవుతున్న సినిమా కథ కావడంతో ఈ డైలాగ్ అభిమానుల కంటతడి పెట్టిస్తోంది. ‘నేనెప్పుడూ సెక్స్ చేయలేదు’ అని సుశాంత్ అంటే... అతడి ఫ్రెండ్ ‘నేను చేశా’ అని అనడం నవ్విస్తుంది. ‘సీరియల్ కిల్లర్... సీరియల్ కిస్సర్. భలే జోడీ’ వంటి డైలాగులు ఆకట్టుకుంటాయి. హీరో హీరోయిన్ మధ్య ఎమోషన్స్ ఏడిపిస్తుంది. అన్నిటికంటే మించి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటన ప్రేక్షకులను కట్టిపడేశాలా ఉంది.