మధురమైన పాటల నీరాజనం ప్రేమకు నీరాజనం
on Oct 29, 2018
` నీరాజానం` ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేవి ఆ చిత్రంలోని అద్భుతమైన పాటలు. ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం గా నిలిచి సంగీతప్రియుల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నాయి. మరపురాని పాటలు, మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటలు, మనసుని హత్తుకునే పాటలు. సంగీతం, సాహిత్యం, గానం ఒకదానికొకటి పోటీ పడి మన మనసులతో ముడిపడి ఎప్పటికీ విడిపడక ఇప్పటికీ మనచెవుల్లో వినపడుతూనే ఉన్నాయి, ఉంటాయి కూడా. ప్రపంచంలో గొప్ప ప్రేమలన్నీ విషాదంతో నే ముగుస్తాయన్నట్టూ ... ఈ సినిమాలో కూడా కాలం కన్నెర్ర జేసి ప్రేమికులను విడదీసింది. కన్నవారి ని ఎదురించి ప్రేమను గెలుచుకున్నా ...విధి ముందర మాత్రం ఓడిపోయారు. చివరకు ఒరిగిపోయారు. ఈ సినిమా ద్వారా తొలిసారిగా శరణ్య హీరోయిన్ గా తెలుగులోకి పరిచయమయ్యారు. ఆమె ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో మదర్ పాత్రల్లో మెప్పిస్తోంది. శరత్ బాబు, సోమయాజుల పాత్రలు సినిమాకు కీలకం. ఓపి నయ్యర్ అందించిన పాటలు విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. కానీ ఆడియో విడుదలైన చాలా కాలానికి సినిమా రిలీజ్ అవడం, కథా బలం లేకపోవడంతో వల్ల సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.
ఈ చిత్రానికి గానూ 1989లో ఓపినయ్యర్ కి బెస్ట్ మ్యూజిక్ డైరక్టర్ గా నంది అవార్డ్ వచ్చింది. ఆ సమయంలో మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఓ చిత్రం పెద్ద సక్సెస్ గా నిలిచింది. అందరూ ఇళయరాజాకే నంది అవార్డ్ వస్తుందనుకున్నారు కానీ ఓపీనయ్యర్ కి `నీరాజనం` చిత్రానికి వచ్చిదంటే పాటలు ఏ స్తాయిలో శ్రోతలను ఆకట్టుకున్నాయో ఊహించుకోవచ్చు. ముఖ్యంగా నిను చూడక నేనుండలేను పాట ప్రతి ప్రేమికుడిని కదిలించే పాట . ఆత్రేయ సాహిత్యం, ఓపీ నయ్యర్ సంగీతం, బాలు గానామృతం ఈ పాటకు ప్రాణం పోసాయి.