English | Telugu

'నానీస్ గ్యాంగ్ లీడర్' స్టోరీ ఇదే!

on Sep 7, 2019

 

నాని టైటిల్ రోల్ చేసిన 'గ్యాంగ్ లీడర్' సెప్టెంబర్ 13న రిలీజవుతోంది. తన కెరీర్‌లో '13 బి', 'ఇష్క్', 'మనం', '24', 'హలో' వంటి మూవీస్ డైరెక్ట్ చేసిన విక్రమ్ కుమార్ రూపొందించడంతో 'నానీస్ గ్యాంగ్ లీడర్' మూవీపై అటు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇటు ప్రేక్షక లోకం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ప్రమోషన్‌లో భాగంగా రిలీజ్ చేసిన ట్రైలర్‌తో జనంలో ఈ మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. అదే సమయంలో ఈ సినిమా కథేమిటనే ఊహాగానాలూ ఎక్కువయ్యాయి.

'జెర్సీ' మూవీ సెట్స్‌పైకి వెళ్లే సమయంలో నాని ఆఫీసులోనే విక్రమ్ కుమార్ ఈ కథను నానికి చెప్పాడు. అప్పుడు 'గ్యాంగ్ లీడర్' అనే టైటిల్ అనుకోలేదు. ఆ కథ నానికి బాగా నచ్చేసింది. ఇద్దరూ ఆ కథని చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఇటీవలి కాలంలో నాని చేసిన సినిమాలతో పోల్చుకుంటే చాలా తక్కువ కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ ఇదే అని చెప్పాలి. ఇందులో ట్విస్ట్స్, టర్న్స్ ఉన్నా.. అవి కాంప్లికేటెడ్ కావు. సింపుల్ సినిమా. అదే సమయంలో మోస్ట్ ఎంటర్‌టైనింగ్ స్టోరీ.

ఈ కథలో పార్థసారథి అనే రచయితగా మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు నాని. 'పెన్సిల్' అనేది అతని పెన్ నేమ్. తాను వరల్డ్ ఫేమస్ రైటర్ కాదగ్గవాడినని భావిస్తూ ఉంటాడు. అతను పుస్తకాలు రాస్తుంటాడు కానీ వాటినెవరూ కొనరనే విషయం అతని పబ్లిషర్‌కు తెలుసు. సందర్భవశాత్తూ ఆ పబ్లిషర్ అతని ఫ్రెండే. పెన్సిల్ స్పెషాలిటీ ఏమంటే.. హాలీవుడ్ సినిమాల్ని చూస్తూ.. వాటి స్టోరీల్ని యాజిటీజ్‌గా రాసేయడం. ఇక్కడ పబ్లిషర్ కేరెక్టర్‌ని ప్రియదర్శి చేశాడు.

'రివెంజ్' అనేది మనకొక ఇంటెన్స్ ఎమోషన్. పగ, ప్రతీకారం.. అనే డైలాగ్స్‌తో రివెంజ్ ఎమోషన్ నిండి ఉంటుంది. అలాంటి ఎమోషన్‌ను మనమెప్పుడూ సరదాగా ఏ సినిమాలోనూ చూడలేదు. ఈ సినిమాలో రివెంజ్ అనే ఎలిమెంట్ ఐదుగురు లేడీస్‌కి సంబంధించింది. చిన్న పిల్ల నుంచి పండు ముసలమ్మ వరకూ ఉన్న ఆ ఐదుగురిలో ఎవరూ మరొకరికి బంధువు కారు. ఆ ఐదుగురికీ నిర్దిష్టమైన క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఆ ఐదుగురికీ మిగతా నలుగురి జీవితాల్లో ఏం జరిగిందనే విషయం తెలుసు. వాళ్ల రివెంజ్‌కు బలమైన కారణం ఉంటుంది. వాళ్లందరి జీవితాలూ ఒక వ్యక్తి వల్లే ఎఫెక్ట్ అవుతాయి. అంటే వాళ్లందరికీ ఒక ఉమ్మడి శత్రువు ఉంటాడు. ఆ శత్రువుపై పెన్సిల్ సాయంతో వాళ్లు ఎలా రివెంజ్ తీర్చుకున్నారనేదే ఈ కథ. ఆ రివెంజ్‌లో భాగంగా తాను ఎదుర్కొంటూ వచ్చిన అనుభవాలతో తొలిసారి సొంతంగా కథ రాస్తాడు పెన్సిల్. ట్రైలర్‌లో చూపించినట్లు అది అతనికి 29వ పుస్తకం. ఈ రివెంజ్ ప్రాసెస్ అంతా ఎంటర్‌టైనింగ్‌గా ఉండటమే 'గ్యాంగ్ లీడర్' స్పెషాలిటీ. గ్యాంగ్‌లోని సీనియర్ యాక్టర్లు లక్ష్మి, శరణ్య తమ మాటలతోనే తెగ నవ్విస్తారు.

ఇందులో హీరోయిన్‌గా ఆ ఐదుగురు ఆడవాళ్లలో ఒకరైన ప్రియాంక అరుళ్ మోహన్ కనిపిస్తుంది. ఆమెకు తెలుగులో ఇదే ఫస్ట్ ఫిల్మ్. అయితే 'గ్యాంగ్ లీడర్'లో హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్స్ బాగా తక్కువ. కారణం.. ఇది లవ్ స్టోరీ కాకపోవడం. అయితే నాని, ప్రియాంక మధ్య వచ్చే సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుల్ని అలరించే విధంగా ఉంటాయని నాని చెబ్తున్నాడు. 

ఈ కథకు 'గ్యాంగ్ లీడర్' అనే టైటిల్ ఎలా వచ్చింది? 'జెర్సీ' కోసం క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న నాని.. దూరంగా కుర్చీలో కూర్చున్న విక్రంని గమనించాడు. "ఏంటి ఇలా వచ్చారు?" అని నాని అడిగాడు. "మన కథకు ఒక టైటిల్ అనుకున్నాను. ఎలా ఉందో చెప్పండి" అని విక్రమ్ అడిగాడు. "ఏంటా టైటిల్?" అని నాని అడిగాడు. "గ్యాంగ్ లీడర్" అని చెప్పాడు విక్రమ్. ఎగ్జైట్ అయిపోతూ "సూపర్" అన్నాడు నాని. అలా టైటిల్ కుదిరింది. చిరంజీవి అభిమానిగా, తను చిన్నప్పుడు చూసిన 'గ్యాంగ్ లీడర్' మూవీపై ఉన్న ఇష్టంతోటే ఆ టైటిల్‌కి ఎగ్జైట్ అయ్యాడు నాని.

విక్రమ్ కుమార్ ఇప్పటివరకూ తీసిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే 'గ్యాంగ్ లీడర్' ఒక్కటీ ఒకెత్తు. ఎందుకంటే, అతను 'ఇష్క్' లాంటి లవ్ స్టోరీస్ చేశాడు. '13 బి', '24' లాంటి థ్రిల్లర్స్ తీశాడు. 'మనం' వంటి ఫ్యామిలీ డ్రామా తీశాడు కానీ కామిక్ మూవీ తియ్యలేదు. 'గ్యాంగ్ లీడర్'.. డైరెక్టర్‌గా విక్రమ్ లోని మరో యాంగిల్‌ని చూపించబోతోంది. ఫన్ మూవీ చెయ్యడంలో ఇంత కిక్కు ఉంటుందని అనుకోలేదని విక్రమ్ చెప్పడాన్ని బట్టి ఈ మూవీ ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిందే.


Cinema GalleriesLatest News


Video-Gossips