వెంకీతో మల్టీస్టారర్... నేచురల్ స్టార్ కోరిక!
on Apr 16, 2019
తెలుగు లో మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ముందుండే కథానాయకుడు విక్టరీ వెంకటేష్. ఆయనతో ఓ సినిమా చేయాలని ఉందని తన మనసులో కోరికను బయటపెట్టాడు నాని. ఈ నేచురల్ స్టార్ హీరోగా నటించిన జెర్సీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది. వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ "జెర్సీ వంటి సినిమాలు అరుదుగా వస్తాయి. క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి ఇక్కడికి వచ్చాను అని అనుకోవద్దు. ఇటువంటి సినిమాలపై ఇష్టం తో వచ్చాను. ఫస్ట్ లుక్ నన్ను ఇంప్రెస్ చేసింది. మైండ్ బ్లోయింగ్ ట్రైలర్. చాలా నిజాయతీగా తీశారు. జీవితంలో స్ట్రగుల్స్ ఉంటాయి. వాటివల్ల లక్ష్యాన్ని వదలకూడదని.. మళ్లీ వెనక్కి తిరిగి వచ్చి సాధించాలని చెప్పే చిత్రమిది. సినిమా చూశాక.. 'ఇది సినిమా కాదు జీవిత పాఠం' అనిపిస్తుంది. తొలి సినిమా అష్టాచమ్మా నుంచి ఇప్పటివరకు నాని నటుడిగా ఎదిగిన తీరు అద్భుతం. అతనిని చూస్తుంటే గర్వంగా ఉంటుంది" అన్నారు. వెంకీ స్పీచ్ పూర్తయిన తర్వాత నాని మాట్లాడుతూ "వెంకటేష్ గారు ఆవకాయ లాంటి ఆయన. ఆయన నచ్చని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. వ్యక్తిగతంగా కలిసిన తర్వాత నాకు ఇంకా నచ్చిన ఏకైక స్టార్ వెంకటేష్ గారు. ఆయన ఫంక్షన్ కు నేను వెళ్లాలనే కోరిక 'బాబు బంగారం'తో తీరింది. నా ఫంక్షన్ కు ఆయన వస్తే బాగుంటుంది అనే కోరిక ఈ 'జెర్సీ'తో తీరింది. ఆయనతో కలిసి సినిమా చేసి ఒకే స్టేజ్ షేర్ చేసుకోవాలి అనే కోరిక మాత్రం బలంగా ఉంది. 'నువ్వు వెంకటేష్ గారితో మల్టీస్టారర్ చేస్తే బాగుంటుంది' అని నాతో చాలా మంది చెప్పారు. ఆయనతో కలిసి నటించడం ఒక గౌరవం. ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నా" అన్నారు. నాగార్జునతో నాని ఓ మల్టీస్టారర్ 'దేవదాస్' చేశాడు. ఇప్పటికీ వెంకటేష్ చాలా మల్టీస్టారర్స్ చేశారు. వీరిద్దరిని దృష్టిలో పెట్టుకుని రచయితలు, దర్శకులు కథలు రాయడమే ఆలస్యం. ఇద్దరినీ మెప్పిస్తే మల్టీస్టారర్ చేసేయొచ్చు.