English | Telugu

మిడిల్ క్లాస్ సూపర్ స్టార్.. 11 యియర్స్ గ్లోరియస్ కెరీర్!

on Sep 5, 2019

 

డైరెక్టర్ అవుదామని వచ్చిన ఆ యువకుడు యాక్సిడెంటల్‌గా హీరో అయ్యాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలాంటి గాడ్‌ఫాదర్లూ లేకపోయినా తన టాలెంట్‌నీ, స్వయంకృషినీ నమ్ముకొని ఇవాళ మీడియం బడ్జెట్ సినిమాల నిర్మాతలకు బంగారు బాతుగా మారాడు. ఆ యువకుడు నవీన్ అలియాస్ నాని. హీరోగా సెప్టెంబర్ 5తో 11 యియర్స్ పూర్తి చేసుకుంటున్న నాని కెరీర్‌ను ఒకసారి అనలైజ్ చేస్తే.. మరకల కంటే మెరుపులే ఎక్కువగా కనిపిస్తాయి.

మణిరత్నం సినిమాలంటే పిచ్చిగా ఇష్టపడే నాని, తాను కూడా ఆయనలా డైరెక్టర్ అవ్వాలనే తపనతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, మొదటిసారే గ్రేట్ డైరెక్టర్ బాపు రూపొందించిన 'రాధా గోపాలం'కు పనిచేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఆ సినిమాకి బాపు డైరెక్టర్‌గా యాక్షన్ చెబితే, నాని 'క్లాప్ బోర్డ్' పట్టుకొనేవాడు. ఆ తర్వాత రాఘవేంద్రరావు, శ్రీను వైట్ల వంటి డైరెక్టర్ల దగ్గర కూడా పనిచేశాడు నాని. అంతే కాదు, రేడియో జాకీగా 'నాన్-స్టాప్ నాని' అనే ప్రోగ్రాం కూడా ఒన్ యియర్ చేశాడు.

ఆ టైంలో డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ దృష్టిలో పడ్డాడు నాని. "హీరోగా చేస్తావా?" అని ఆయన అడిగితే మొదట అయోమయంగా, తర్వాత నమ్మలేనట్లు చూసి, అప్రయత్నంగా తల ఊపేశాడు. అదిగో.. అట్లా.. 'అష్టా చమ్మా' మూవీతో చటుక్కున హీరో అయిపోయాడు నాని. ఆ సినిమా 2008 సెప్టెంబర్ 5న ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా రిలీజైంది. నాని జోడీగా 'కలర్స్' స్వాతి నటించిన ఆ సినిమా ఇన్‌స్టంట్ హిట్టయింది. ఇక అతను వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు.

మరో యంగ్ హీరో తనీశ్‌తో కలిసి నాని చేసిన 'రైడ్' కూడా హిట్టు. మూడో సినిమా 'స్నేహితుడా' ఫ్లాపవగా, నాలుగో మూవీ 'భీమిలీ కబడి జట్టు' ఫ్లాపైనా, యాక్టర్‌గా నానికి మంచి పేరు తెచ్చింది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా తను పనిచేసినప్పుడు ఫ్రెండ్ అయిన నందినీరెడ్డి డైరెక్టర్‌గా మారి తీసిన ఫస్ట్ మూవీ 'అలా.. మొదలైంది'లో హీరోగా నటించాడు. నిత్యా మీనన్‌ను తెలుగు తెరకు నాయికగా పరిచయం చేసిన ఆ సినిమా చెప్పుకోదగ్గ హిట్టవడమే కాకుండా నాని ఫ్యాన్ బేస్‌ను పెంచింది.

ఆ వెంటనే అశోక్ డైరెక్షన్‌లో నాని చేసిన 'పిల్ల జమీందార్' సినిమా కూడా హిట్. అప్పుడు వచ్చిన టాలీవుడ్ టాప్ డైరెక్టర్ యస్.యస్. రాజమౌళి డైరెక్షన్‌లో చేసే ఛాన్స్. నిజానికి అది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. కొద్దిసేపు మాత్రమే కనిపించే కేరెక్టర్. అయినా సరే.. సరేనన్నాడు. చిన్న కేరెక్టర్ అయితేనేం.. 'నాని' అనే పేరు సినిమా అంతా ఉంటుంది కదా. అలా 'ఈగ' వచ్చింది. సమంత మెయిన్ రోల్ చేసినా, 'ఈగ' రూపంలో 'నాని' పేరు సినిమా చివరి దాకా నానుతూనే ఉంటుంది. బ్లాక్‌బస్టర్ అయిన ఆ సినిమాతో నాని.. మారుమూల ప్రాంతాల ఆడియెన్స్‌కు కూడా రీచ్ అయ్యాడు.

అయితే అనూహ్యంగా ఆ తర్వాత ఒక దాని వెంట ఒకటిగా నాలుగు ఫ్లాపులు రావడంతో నాని కెరీర్ సంక్షోభంలో పడుతుందేమో అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసిన 'ఎటో వెళ్లిపోయింది మనసు', కృష్ణవంశీ రూపొందించిన 'పైసా', యశ్ రాజ్ ఫిలిమ్స్ వంటి సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ తీసిన 'ఆహా కల్యాణం', సముద్ర కని డైరెక్ట్ చేసిన 'జెండాపై కపిరాజు' సినిమాలను ఆడియెన్స్ తిరస్కరించారు. సబ్జెక్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలనే పాఠాన్ని ఆ సినిమాలు నేర్పించాయి.

ఇక ఆ తర్వాత నుంచీ నాని ఎంచుకున్న స్క్రిప్టులు అతడిని మిడిల్ క్లాస్ సూపర్‌స్టార్‌గా మార్చేశాయి. డెబ్యూ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో చేసిన 'ఎవడే సుబ్రమణ్యం'తో మొదలుకొని, 'మిడిల్ క్లాస్ అబ్బాయి' దాకా ఎనిమిది సినిమాల దాకా ఫ్లాప్ అనే మాటే లేదు. మధ్యలో విరించి వర్మ డైరెక్ట్ చేసిన 'మజ్ను' ఒక్కటే ఎబోవ్ యావరేజ్. మారుతి రూపొందించిన 'భలే భలే మగాడివోయ్', డైరెక్టర్ హను రాఘవపూడితో చేసిన 'కృష్ణగాడి వీరప్రేమ గాథ', ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన 'జెంటిల్‌మన్', నక్కిన త్రినాథరావు తీర్చిదిద్దిన 'నేను లోకల్', న్యూ డైరెక్టర్ శివ నిర్వాణ తీసిన 'నిన్ను కోరి', వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమాలతో మినిమం గ్యారంటీ హీరోగా అవతరించాడు నాని.

ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు వ్యక్తిగతంగా నానిని నిరుత్సాహపరిచినా, కెరీర్ పరంగా అతనికేమీ నష్టం కలిగించలేదు. ఆ సినిమాలు.. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేసిన 'కృష్ణార్జున యుద్ధం', నాగార్జునతో కలిసిన నటించిన 'దేవదాస్'. వాటి తర్వాత గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో చేసిన 'జెర్సీ'లో చేసిన క్రికెటర్ అర్జున్ కేరెక్టర్‌లో ఉన్నత స్థాయి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు నాని. బాక్సాఫీస్ దగ్గర కూడా ఆ మూవీ సేఫ్‌గా నిలిచింది.

ఇప్పుడు సెప్టెంబర్ 13న 'నానీస్ గ్యాంగ్‌లీడర్' అంటూ ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు నాని. సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరుపొందిన విక్రమ్ కె. కుమార్ రూపొందించిన ఈ సినిమాలో భిన్న వయసున్న ఫైవ్ లేడీస్ గ్యాంగ్‌కి లీడర్ అయిన 'పెన్సిల్' పార్థసారథిగా, హాలీవుడ్ సినిమాల్ని కాపీచేసి కథలు రాసే రైటర్‌గా నవ్వులు పంచేందుకు ఎదురు చూస్తున్నాడు నాని. 'ఆర్ఎక్స్ 100', 'గుణ 369' సినిమాల హీరో కార్తికేయ విలన్‌గా నటించిన ఈ సినిమాతో నాని.. ప్రేక్షకుల్ని ఎలా అలరిస్తాడో చూడాల్సిందే.


Cinema GalleriesLatest News


Video-Gossips