English | Telugu

అవి చైతన్య రధ చక్రాలుకావు... జగన్నాథ రథ చక్రాలు

on Jan 17, 2018


మూడున్నర దశాబ్దాల క్రితం... మాట.

ఆ రోజుల్లో తెలుగు ప్రజలు బాధాసర్పద్రష్టులు...

ఆ రోజుల్లో తెలుగు ప్రజలు ఎండమావులకై ఎదురు చూస్తున్న వ్యధావశిష్టలు.

ఆరు కోట్ల మంది బిడ్డలున్నా... ఆగని తెలుగు తల్లి కన్నీటి జ్ఞాపకాలు ఆ రోజులు.

తెలుగోడి ఆత్మగౌరవం ఢిల్లీ పుర వీధుల్లో తాకట్టుకు గురవుతున్న చీకటి రోజులవి.

అప్పుడు బిగుసుకుంది ఓ పిడికిలి... అప్పుడు ఎరుపెక్కాయి రెండు కళ్లు.. అప్పుడు నినదించింది ఓ కంఠం..

ఆ ధ్వని... ప్రతిధ్వనించి.. భారతావని దిక్కులు పిక్కటిల్లేలా చేసింది.

ఆ నాదం... తెలుగోడి ఆత్మగౌరవ నినాదంగా మారి..  ప్రపంచ యవనికపై తెలుగోడి సత్తా చాటి చెప్పింది.

తెలుగు పుడమి పులకించింది...

తెలుగు తల్లి విజయ దరహాసం ఒలికించింది... ‘అడిగోరా నా బిడ్డా.. ’అంటూ హర్షాతిరేఖాలు వెలిబుచ్చింది.

ఆ తెలుగొడి చైతన్యరధ ఛక్రాల క్రింద తెలుగుజాతి నమ్మక ద్రోహులందరూ నామరూపాలు లేకుండా నలిగి పిసరు పిసరయ్యారు.

ఆయనే... తెలుగోడి ‘ఆత్మాభిమాన ప్రతీక’ నందమూరి తారక రామారావు.

22 ఏళ్ల క్రితం... సరిగ్గా ఇదే రోజు  ఆ మహానుభావుడు మహాభినిష్క్రమణం చెందాడు. తెలుగోడి గుండెల్లో పుట్టెడు విషాదాన్ని మిగిల్చి మరలిరాని లోకాలకు పయనమయ్యాడు. తెలుగుజాతి జెండా... అన్న నందమూరి వర్ధంతి సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకోవడం మన  ధర్మం.

ప్రస్తుతం పాదయాత్రల టైమ్ నడుస్తోంది. అందుకే... ట్రెండ్ కి నాంది పలికిన అన్న చైతన్య రధ య ాత్ర గురించి మనం గుర్తు చేసుకుందాం.

‘పవర్ కోసం పాద యాత్ర చేయాలి. అధికారం వస్తే అవినీతి చేయాలి...’అనే రీతిలో నాయకులు తయారైన నేటి తరుణంలో... అసలు ఎన్టీయార్ ‘చైతన్య రథ యాత్ర’ఎందుకు చేశారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాల్సిన బాధ్యత తెలుగువారిగా మనందరిపై ఉంది.  

ఎన్టీయార్ ఇమేజ్ కోసం చైతన్యరధం ఎక్కరా? అప్పటికే ఆయన ప్రజల గుండెల్లో ఉన్నారు. పదవి కోసం ఎన్టీయార్ చేసిన ప్రయత్నమా ఈ ‘చైతన్యరథ యాత్ర’..? అప్పటికే ఎన్నో ఇళ్లలోని పూజా మందిరాల్లో రామునిగా, కృష్ణునిగా, వేంకటేశ్వరునిగా, శ్రీమహావిష్ణువుగా ‘అన్న’రూపే పూజలందుకుంటోంది.

ఏనాడైతే.. ఆయన ‘ఇక ప్రజా జీవితమే నా జీవితం’ అని ప్రకటించారో... ఏ నాడైతే ఆయన ‘సమాజమే దేవాలయం... ప్రజలే నా దేవుళ్లు’ అని నినదించారో... ఆ నాడే మానసికంగా ఆయన్ను ప్రజలు ‘ముఖ్యమంత్రి’ని చేసేశారు. ఈ చైతన్య రథ యాత్ర చేయకపోయినా.. ఆయనే ముఖ్యమంత్రి. ఇది జనమెరిగిన సత్యం.

మరెందుకు ఈ ‘చైతన్య రథ యాత్ర’?

ప్రజలకు ఏం కావాలి?  ప్రజలకు నేనేం చేయాలి? ఈ రెండు ప్రశ్నలే.. ఆయన్ను చైతన్య రథయాత్రకు పురిగొల్పాయి.

రెండు రూపాయలకే కిలోబియ్యం... చైతన్య రధయాత్రలో పుట్టిన ఆలోచనే..
పేదలకు జనతా వస్త్రాలు ... చైతన్య రధయాత్రలో పుట్టిన ఆలోచనే..
పేదలకు పక్కా ఇళ్లు... చైతన్య రధ యాత్రలో పుట్టిన ఆలోచనే...
మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ... చైతన్య రథ యాత్రలో మొలకెత్తిన ఆలోచనే...
తెలంగాణలో పటేల్ వ్యవస్థ రద్దు...  చైతన్య రధ యాత్రలో వికసించిన ఆలోచనే...
ఇలా.. భవిష్యత్ ప్రణాళికలకు, తెలుగు నేల సంస్కరణలకు ‘చైతన్య రథ యాత్ర’ఓ ఆలంబనగా నిలిచింది.

అప్పటి వరకూ నాయకులంటే... దివిలో ఉండే దేవతలు(అని వారు అనుకునేవారు). ఎన్నికలొస్తే చాలు... ఉన్నట్టుండి పురవేదికలపై ప్రత్యక్షమయ్యేవారు.  కానీ ‘అన్న’ ప్రజలే నాదేవుళ్లు అంటూ జనక్షేత్రంలోకి చైతన్య రధారూఢుడై వచ్చాడు. ప్రజల్ని కలుసుకుంటూ... ఊళ్లకి ఊళ్లను కలుపుకుంటూ... ఓ ప్రవాహంలా, ఓ ప్రభంజనంలా.. ఓ ఝంఝామారుతంలా  ‘అన్న’ చైతన్య రథ యాత్ర సాగింది. నాయకుడు అనేవాడు జనాల్లోనుంచే పుడతాడు అనడనికి ప్రత్యక్ష్య సాక్ష్యం ఈ చైతన్య రథ యాత్ర. ‘అమ్మలకూ... అమ్మమ్మలకూ... నా చిన్నారి చిట్టి చెల్లెళ్లకూ...’అని అన్న పలకరిస్తుంటే... తెలుగు నేల పులకించింది. అవి చైతన్య  రథ చక్రాలు కావు... బాధ సర్పద్రష్టులైన తెలుగుజాతిని ఉద్దరించడానికి వస్తున్న ‘జగన్నథ రథ చక్రాలు’అంటూ... ప్రతి తెలుగోడూ ప్రణమిల్లాడు. ‘అన్నా నీకు వదనాలు’అంటూ ఆనందభాష్ప పర్యంతమయ్యాడు. ‘ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకూ.... ఎన్నెలు దిగి వచ్చే మా కళ్లకూ’ అంటూ... బారులు తీరి అన్నకు మంగళ హారతులు పట్టారు జనం.

నేటి నాయకుల ప్రచార రధాలు... స్టార్ హోటల్ రూములకు ఏ మాత్రం తీసిపోవు. గతుకులు కూడా తెలియని సుఖమైన ప్రయాణం.. సౌండ్ ప్రూఫ్ ఎక్వీప్మెంట్.. లోపల ఏసీ మామూలే. ముందు జాగ్రత్తలు, ‘మందు’జాగ్రత్తలు షరా మామూలే. ప్రోటీన్ ఫుడ్, మినరల్ వాటర్ బాటిల్స్ ఎలాగూ ఉంటాయి.

మొన్నామధ్య ఓ నాయకుడు ప్రచారం భాగంగా చిన్న పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడి, ఫొటోలకు పోజులిచ్చాడు. తర్వాత తన ప్రచార రధం ఎక్కి చేతులను మినరల్ వాటర్ బాటిల్ తో కడుక్కున్నాడు.  మీడియా సాక్షిగా ఆ భాగోతం అంతా జనాలు చూశారు. ఆయన పేరు అప్రస్తుతం.

మరో నాయకుడికి ప్రచారంలో తలనొప్పి వస్తే... మధ్యలోనే ప్రచరం ఆపి, హైదరాబాద్ వెళ్లి ఖరీదైన ఆస్పత్రిలో తల స్కానింగులు చేయించుకున్నాడు... ఆయన  పేరు కూడా ఇక్కడ అనవసరం.

ఇక కొన్నాళ్లుగా తెలుగు నేలపై పాదయాత్రలు రాజ్యమేలుతున్నాయి. ‘మహానేత’లు నడుస్తారు... ఆయనతో పాటు  వేల మంది నాయకులు, కార్యకర్తలు వెంబడిస్తారు. కాళ్లు పిసికేవాళ్లు కొందరు. మీనరల్ వాటర్ బాటిళ్లు మోసేవాళ్లు కొందరు. బూట్లను సరిచేసేవారు కొందరు. వెనకాల ఓ కేరవాన్. దాని వెనకాల ఓ అంబులెన్స్. రాత్రుళ్లు అప్పటికప్పుడు రెడీమేడ్ ఏసీ గదిని నిర్మించేంత సాంకేతిక పరిజ్నానాన్ని నింపుకున్న ఓ మినీ లారీ. ఇది వీరి పాద యాత్ర.
 
కానీ ఎన్టీయార్ చైతన్య రథయాత్ర  ఎలా జరిగిందో తెలుసా?

1938లో తయారైన వింటేజ్ చవ్రోలెట్ వ్యాన్ అది.  సాంకేతికతకు ఆమడ దూరంలో ఉన్న పాత ఇనప రేకు డబ్బా అనొచ్చు.  పైకి ఎక్కడానికి ఓ రంధ్రం. లోపల విశ్రమించడానికి ఓ చిన్న మంచం. ఎన్టీయార్ ప్రసంగం వినిపించడానికి రెండు లౌడ్ స్పీకర్లు. ఎటైనా తిరగడానికి వీలున్న రెండు ప్లడ్ లైట్లు. ఇది అన్న ‘చైతన్య రధం’.

సమస్త భోగాలను అనుభవించిన కుబేరుడు... ప్రజల కోసం కుచేలుడై వచ్చాడు. చెరువు గట్టున కాలకృత్యాలు తీర్చుకుంటూ, అర్థాకలి భోజనాలతో, ఆరు బయట శయనాలతో.. తన బట్టలు తానే ఉతుక్కంటూ, తొమ్మిది నెలలపాటు ఓ యోగిలా బతికారు ఎన్టీయార్. తాను ఎన్ని జిల్లాల్లో అయితే పర్యటించారో... అక్కడి భూగర్భ జలాలనే తాగేవారు. తెలుగు నేలపై ఉన్న అన్ని జిల్లాల భూగర్భజలాలను తాగినే ఏకైక నాయకుడు ఒక్క ఎన్టీయార్ మాత్రమే. ఇది ఎవరూ కాదనలేని సత్యం. తొమ్మిది నెలల ఈ ప్రయాణంలో ఆయన ఎన్నో సార్లు అనారోగ్యపాలయ్యారు. కానీ మడమ తిప్పడం ‘అన్న’నైజం కాదు. అంతెందుకు రధ యాత్రలో తాగడానికి ‘టీ’దొరక్క ఆయన ఇబ్బంది పడ్డ సందర్భాలున్నాయి. 1983 జనవరి 3 వరకూ ఆయన రధ యాత్ర సాగింది.

ఇది స్వార్థ రహిత యాత్ర.  ఉన్నతమైన ఆశయంతో ఓ మహామనిషి చేసిన యాత్ర. తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక ఈ యాత్ర. అందుకే... తెలుగు నేల ఉన్నంత వరకూ ఆచంద్ర తారార్కం నందమూరి ‘చైతన్యరథ యాత్ర ’నిలిచిపోతుందనేది తథ్యం.

తెలుగు కళామతల్లి గర్వం ఎన్టీయార్...

వెండితెరపై ఏనాటికీ వెలిసిపోని వినూత్న వర్ణం ఎన్టీయార్...

గెలుపు మాత్రమే తెలిసిన ఓ యుద్ధం ఎన్టీయార్...

తలదించడం తెలియని ఓ జాతి జెండా ఎన్టీయార్...

కొన్ని కోట్ల మంది నడకలకు ముందడుగు ఎన్టీయార్...  2560

పేదవాడి అన్నం ముద్ద ఎన్టీయార్....

జై.. ఎన్టీయార్... జై జై... ఎన్టీయార్


- నరసింహా బుర్రా


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here