నా డబ్బు నాకు కావాలి!
on Jul 25, 2017
ఇది దాదాపు 60 ఏళ్ల నాటి ముచ్చట. ఎన్టీయార్ ‘శభాష్ రాముడు’సినిమా షూటింగ్ జరుగుతోంది. సీఎస్ రావు దర్శకత్వంలో సుందర్ లాల్ నెహతా, డూండీ కలిసి ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాంతారావుది ఇందులో ముఖ్య భూమిక. ఆయన అప్పుడప్పుడే ఎదుగుతున్న రోజులవి.
షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సరిగ్గా అప్పుడే కాంతారావుకి ఓ టెలిగ్రామ్ వచ్చింది. ‘నాయనమ్మకి సీరియస్. చివరి చూపు కోసం రావాలి’.. ఇది దాని సాంరాశం. లొకేషన్లోనే కాంతారావు కన్నీటి పర్యంతం అయ్యారు.
ఇమ్మీడియట్ గా ఊరెళ్లాలి. ఏదన్నా జరగకూడనిది జరిగితే... అక్కడ కార్యక్రమం జరపడానికి కూడా తగిన సొమ్ము అప్పుడు కాంతారావు దగ్గర లేదు. పైగా సినిమాకు సంబంధించిన పారితోషికం అప్పటికే మూడొంతులు తీసేసుకొని ఉన్నారాయన. దాంతో ఏం చేయాలో పాలుబోలేదు. ఇక చేసేది లేక... సరాసరి నిర్మాతల దగ్గరకే వెళ్లారు. విషయం చెప్పి డబ్బు అడిగారు. అయితే... ఆ నిర్మాతలు మాత్రం చాలా కఠినంగా మాట్లాడారు. సినిమా పూర్తి చేస్తే కానీ... మిగిలిన సొమ్ము ఇవ్వమని కరాఖండిగా చెప్పేశారు.
‘మా ఊరు వాడు సినిమాల్లోకెళ్లాడు... గొప్ప వాడవుతున్నాడు’అని ఊరంతా ఓ వైపు గర్వంగా చెప్పుకుంటుంటే.. ఇలా ఉట్టి చేతులతో ఊరెళ్లడం నిజంగా ఆత్మహత్యాసదృశ్యం. ఇక ఏం చేయాలి? కాంతారావు మస్తిష్కంలో ఎన్నో ప్రశ్నలు.
అయితే... జరుగుతున్న తతంగం మొత్తం ఓ వ్యక్తి గ్రీన్ రూమ్ నుంచి గమనిస్తున్నట్లు కాంతారావుకు తెలీదు. ఆయనే... ‘ఎన్టీయార్’. ఆ రోజు షూటింగ్ ముగించుకొని మేకప్ తుడుచుకునే పనిలో ఉండి.. బయట జరుగుతున్న వ్యవహారం మొత్తం కిటికీ నుంచి చూశారు ఎన్టీయార్. తన అసిస్టెంట్ తో కాంతారావుకు కబురు పంపారు.
కాంతారావు వచ్చారు. ఎన్టీయార్ కారెక్కుతూ... ‘మీరు కూడా ఎక్కండి’ అన్నట్లు సైగ చేశారు. కాంతారావు కారెక్కి కూర్చున్నారు. సరాసరి మద్రాసు లోని తన ఇంటికే తీసుకెళ్లారు ఎన్టీయార్. హాల్లో కూర్చోమని చెప్పి లోనకెళ్లారు. ఓ అయిదువేల రూపాయలు(అప్పట్లో అయిదు వేలంటే.. చాలా పెద్ద మొత్తం) తీసుకొచ్చి కాంతారావు చేతులో పెట్టారు. ‘మీరెళ్లి ప్రశాంతంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రండి. ప్రొడ్యూసర్లతో నేను మాట్లాడతాను. అయితే.. రాగానే... రెండు మూడు నెలల్లో నా డబ్బులు నాకిచ్చేయాలి’ అని నిర్మొహమాటంగా చెప్పారు ఎన్టీయార్.
అప్పటి పరిస్థితిలో ఎన్టీయార్ చేసిన సాయం నిజంగా అద్భుతం అంటారు కాంతారావు. ఆ డబ్బుతో ఊరెళ్లిన కాంతాతారావు... నాయనమ్మగారి కార్యక్రమాలన్నీ పూర్తి చేసి గర్వంగా మద్రాసు చేరుకున్నారట. మాట ప్రకారం మరో సినిమా చేసి ఎన్టీయార్ బాకీ తీర్చేశారట. డబ్బు విషయంలో ఎన్టీయార్ చాలా గట్టి మనిషి. అలాగే... అపాత్రదానం చేయరు. పెద్ద మనసు కూడా.
ఈ విషయాలన్నీ చనిపోయేముందు ఆయన రాసుకున్నస్వీయ చరిత్ర ‘అనగనగా ఓ రాజకుమారుడు’ పుస్తకంలో చక్కగా విశదపరిచారు కాంతారావు.
-నరసింహ బుర్రా