బాలయ్య మునిమనవడిగా కన్నడ సూపర్‌స్టార్
on Oct 31, 2016
నందమూరి నటసింహం బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి షూటింగ్ క్లైమాక్స్‌కి చేరింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్ ఓ రేంజ్లో ఉండటంతో టాలీవుడ్‌తో పాటు సౌత్‌లోని మిగిలిన ఇండస్ట్రీల చూపు కూడా శాతకర్ణిపై పడింది. ఈ నేపథ్యంలో చాలామంది అగ్రనటులు ఈ సినిమాలో తమకు కూడా ఒక ఛాన్స్ కావాలని బాలయ్యను అడుగుతున్నారట. అయితే ఒకరి కోరికని మన్నించిన బాలయ్య శాతకర్ణిలో అవకాశం కల్పించాడట. ఆయన ఎవరో కాదు..కన్నడ లెజెండ్ రాజ్‌కుమార్ తనయుడు శివరాజ్‌కుమార్. రాజ్‌కుమార్ కుటుంబంతో అన్నగారి కుటుంబానికి ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. వారిద్దరి వారసులు శివరాజ్‌కుమార్, బాలకృష్ణ కూడా మంచి స్నేహితులు.
ఆ చనువుతోనే..చిన్న పాత్ర అయినా ఫర్వాలేదు..మీ సినిమాలో నాక్కూడా నటించాలని ఉందని శివణ్ణ బాలయ్యను అడిగాడట. దీంతో ఆయన కోసం ఓ పాత్ర సృష్టించారు క్రిష్. అది గౌతమిపుత్ర శాతకర్ణి మునిమనవడి పాత్ర. సినిమా ప్రారంభంలోనే శివణ్ణ కనిపిస్తారట..అతనికి ఓ రాజు ఫ్లాష్ బ్యాక్ చెప్పడంతో కథ మొదలవుతుందట..మళ్లీ చివర్లో..శివరాజ్‌కుమార్ కనిపిస్తాడట. బాలయ్య, శివరాజ్‌కుమార్ కాంభినేషన్లోనూ కొన్ని సన్నివేశాలు ఉంటాయట. శివరాజ్‌కుమార్ వల్ల శాతకర్ణికి కర్ణాటకలో అదనపు ఆకర్షణే. ఎలాగూ బాలయ్య సినిమాలకు కన్నడనాట మంచి గిరాకీ ఉంది..ఇప్పుడు శివణ్ణ కూడా జతకలవడంతో అక్కడ శాతకర్ణిపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి.