English | Telugu

చిరు విషయంలో బాలయ్య మనసు మార్చుకున్నారా?

on Apr 22, 2016

నందమూరి వంశం, కొణిదెల వంశం..తెలుగు చిత్ర పరిశ్రమను శాసించే రెండు కుటుంబాలు. అప్పట్లో ఎన్టీఆర్ తన నటనతో నెంబర్‌వన్‌గా ఎదిగారు. ఆయన తర్వాత చిరంజీవి అంతటి స్టార్ అయ్యారు. అయితే బాలయ్య కూడా చిరంజీవి నుంచి నెంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చాలా సార్లు ప్రయత్నించారు. ఫ్యాన్స్ సంగతి సరే సరే సినిమాల విడుదల సందర్భంగా రెచ్చగొట్టే పోస్టర్లు, కటౌట్లతో వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చడంతో పాటు అప్పుడప్పుడు ఘర్షణలకు కూడా దిగేవారు. ఈ ఆధిపత్య పోరు చిరంజీవి రాజకీయరంగ ప్రవేశం తర్వాత సద్దుమణిగిపోయింది. ఒకరి ఇంట్లో ఫంక్షన్స్‌కి ఒకరు వెళ్లడంతో పాటు ఎక్కడ కనబడితే అక్కడ ఆలింగనాలు చేసుకుంటూ తెగ ప్రేమ ఒలకబోశారు.

 

ఇలాంటి పరిస్థితుల్లో లేపాక్షి ఉత్సవాలు రెండు కుటుంబాల మధ్య మళ్లీ చిచ్చురగిల్చాయి. లేపాక్షి ఉత్సవాలను తన భుజస్కంధాలపై వేసుకున్న బాలకృష్ణ ఆ వేడుకలకు అందరిని ఆహ్వానించే వేళ చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మీడియా సమావేశంలో విలేకరి లేపాక్షి ఉత్సవాలకు మీ ఫ్రెండ్, మెగాస్టార్ చిరంజీవిని పిలిచారా? అని ప్రశ్నించాడు. అందుకు స్పందించిన బాలయ్య చిరంజీవిని పిలవలేదని..అయినా నేను ఎవరినీ నెత్తిన ఎక్కించుకోనని, నా నెత్తిన ఎక్కే వారిని పిలవాల్సిన అవసరం లేదన్నారు. నా పక్కన గ్లామర్ ఉన్న వారే ఉన్నారని, వాళ్లతో కలిసి ప్రయాణం చేస్తానన్నారు. ఎవరిని పిలవాలో, ఎవరిని పిలవకూడదో తనకు తెలుసన్నారు. ఉత్సవాలకు రకరకాల వ్యక్తులు వస్తుంటారని, నేను నా పద్దతిలోనే వెళ్తానన్నారు, డిక్టేటర్ పద్ధతిలోనే వెళ్తానంటూ వ్యాఖ్యానించారు.

 

గ్లామర్ ఉన్నవాళ్లతోనే ప్రయాణం చేస్తానంటే బాలయ్య దృష్టిలో చిరంజీవి గ్లామర్ లేనివాడనే కదా అర్థం..!.అప్పటికి చిరంజీవి గ్లామర్ పూర్తిగా తగ్గిపోయింది. ఒకప్పుడు ఆయన వస్తున్నాడంటేనే అభిమానులు తరలివచ్చేవారు. కాని ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది చిరు పర్యటనలకు ప్రజాస్పందన కరువైపోయింది. ఎక్కడ చూసినా ఖాళీ కూర్చిలే దర్శనమిస్తున్నాయి. మరో కారణమేంటంటే లేపాక్షి ఉత్సవాలను మొత్తం ఆయన పర్యవేక్షిస్తుండటంతో క్రెడిట్ అంతా తనకే దక్కాలని బాలయ్య ఉద్దేశ్యం. అందుకే ఇండస్ట్రీ నుంచి ఎవరిని ఆహ్వానించలేదు. గ్లామర్ ఉన్న స్టార్లు వేడుకలకు వస్తే ఫోకస్ అంతా వారిపైనే ఉంటుంది కాని తనపై ఉండదని బాలయ్య భయపడినట్టున్నారు.

 

అలాంటి బాలయ్య తన 100వ సినిమా పూజా కార్యక్రమానికి రావాల్సిందిగా చిరంజీవిని స్వయంగా ఆహ్వానించారు. చిరంజీవి కూడా పెద్ద మనసుతో కార్యక్రమానికి వచ్చారు. దాంతో పాటు ఈ సినిమా బాలయ్య తప్ప వేరేవరూ చేయలేరని..ఇలాంటి పాత్రలు బాలకృష్ణ అవలీలగా చేస్తారని కొనియాడారు. అయితే నెల రోజల క్రితం గ్లామర్ లేని వాళ్లతో నేను ప్రయాణించను అన్న బాలయ్య ఇప్పుడు చిరంజీవిని ప్రతిష్టాత్మక కార్యక్రమానికి పిలవడం వెనుక కారణమేమై ఉంటుందా అందరూ ఆశ్చర్యపోతున్నారు. నటుడికి 100వ చిత్రం ఒక మైలురాయి. అలాంటి ఒక క్రతువు మొదలు పెడుతున్పపుడు అల్రెడీ 100 సినిమాలు చేసిన వ్యక్తి సూచనలు, సలహాలు చాలా అవసరమని బాలయ్య భావించి ఉండవచ్చు. లేదంటే తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని ప్రజలకు తెలియజేప్పడానికి బాలయ్య చిరంజీవిని ఆహ్వానించినట్లున్నారు. ఏది ఏమైనా దశాబ్ధాలుగా అన్నదమ్ముల్లా మెలిగిన ఇద్దరు గొప్పనటులు ఎప్పటికీ అలాగే ఉండాలని సగటు తెలుగు సినీ అభిమాని కోరిక.
 


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here