English | Telugu

సినిమా చలో అనేసింది!

on Feb 2, 2018

తారాగణం: నాగశౌర్య, రష్మిక, నరేశ్....
దర్శకుడు: వెంకీ కుడుముల
నిర్మాత: ఉషా మూల్పూరి


కథకుడికి ఉండాల్సింది కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. జడ్జిమెంట్ ఉండాలి కానీ... ఏం చేసినా బానేవుంటుందనే అహంభావం ఉండకూడదు. ఉంటే... కథలు కూడా అడ్డగోలు తనంగానే తయారవుతాయ్. ‘కథపై కోట్లు గుమ్మరిస్తారు’ అనే కనీస ఆలోచన  ప్రతి దర్శకునికీ ఉండాలి. రీసెంట్ గా ఓ సినిమా విడుదలైంది. పేరు ‘చలో’. ఆ సినిమా చూశాకపై విషయం క్లుప్తంగా చెప్పాలనిపించింది. ఇక నాగ శౌర్య కథానాయకునిగా నటించిన ‘చలో’ సినిమా... జనానికి నచ్చేలా ఉందా? లేక పేరుకు తగ్గట్టే ‘చలో’ అందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ముందు.. కథేంటో చూద్దాం.

కథ:

హరి.. ఇందులో నాగశౌర్య పేరు హరి లేండి. ఈ హరికి చదువు కంటే గొడవలంటే ఇంట్రస్ట్. చిన్నప్పట్నుంచి తండ్రి చేసిన గారం వల్ల అలా తయారవుతాడనమాట. ఎలా అయినా కొడుకును మార్చాలని తపిస్తున్న హరి తండ్రి.. ఓ రోజు అనుకోకుండా  రజనీకాంత్  ‘అరుణాచలం’ సినిమా చూస్తాడు. అందులో పెద్ద రజనీకాంత్... కొడుకు రజనీకాంత్ తో చుట్టలు మానిపించడానికి చేసిన ట్రిక్ ని తన కొడుకుపై ప్రయోగించాలానుకుంటాడు. చుట్టలు ఎక్కువ తాగితే చుట్టలపై విరక్తి కలిగినప్పుడు... గొడవల్లో ఎక్కువ తిరిగితే గొడవలపై విరక్తి ఎందుకు కలగదు? అనే తలకుమాసిన ఆలోచన చేసి... నిరంతరం గొడవలు జరిగే ఆంధ్ర, తమిళనాడు బోర్డర్లో ఉన్న ‘తిరుప్పురం’ అనే ఊరుకు చదువు నెపంతో  పంపిస్తాడు. అలా వెళ్లిన హరికి అక్కడ ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయ్? అనేది మిగిలిన కథ.

లాజిక్కులతో పనిలేకుడా అడ్డగోలుగా కథ తయారు చేసుకున్నాడు దర్శకుడు. ఈ కథలో జరిగే ఏదీ భూప్రపంచంలో జరగదంటే నమ్ముతారా? నిర్మాత చేతిలో ఉండేసరికి... అతను జారిపోకుండా ఏదో ఒకటి కథగా అనేసుకొని కోట్ల రూపాయలు బూడదలో పోసేయడం సబబేనా? అందుకే... సినిమాలు తీసే నిర్మాతలకు కూడా అభిరుచి అవసరం. 

గొడవల్లో తిరిగితే గొడవలపై విరక్తి కలిగి కొడుకు మారతాడని ప్రపంచంలో ఏ కన్నతండ్రి అయినా ఆలోచిస్తాడా? ఈ ఒక్క పాయింట్ చాలు ఈ కథ ఎంత గొప్పదో చెప్పడానికి? ఇక సెకండాఫ్ లో అయితే... ఏం జరుగబోతోందో ముందే తెలిసిపోతుంటుంది. రెండూళ్ల జనాలూ ఎందుకు కొట్టుకుంటున్నారో అర్థంకాదు. తెలిశాక... ఈ సినిమాను చివరిదాకా చూసినందరకు మనపై మనకే కోపం వస్తుంది. కథలో దేనికీ రీజన్లుండవ్. లాజిక్కులుండవ్. కాలేజీలో జరిగే కామెడీ సీన్లను మాత్రం దర్శకుడు బాగా రాసుకున్నాడు. ఈ సినిమాలో ఏదైనా బావుందీ అంటే... ఆ కాలేజీ సీన్లే.

నాగశౌర్య మంచి అందగాడు. హీరోకి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయ్. కాస్త కథలపై అవగాహన పెంచుకుంటే మంచిది. ఇందులో అతను ప్రత్యేకించి చేయడానికి కూడా ఏమీ లేదు. ఈ సినిమా ఆ కుర్రాడికి ఏ విధంగానూ పనికిరాదని చెప్పక తప్పదు. ఇక హీరోయిన్ రష్మిక మండన్న.. ఆ ఆమ్మాయికి ఎవరో ‘నవ్వితే బావుంటావ్’ అని చెప్పినట్టున్నారు... ఇక కారణం లేకుండా సినిమా అంతా నవ్వుతూనే ఉంది.. పిచ్చినవ్వు.

సాంకేతికంగా కెమెరా గొప్పగా లేదు. సంగీతం అంత వినసొంపుగా లేదు. ఎడిటింగ్ లో పసలేదు.
ఫలితాన్ని ముందుగానే ఊహించే... ఈ సినిమాకు దర్శకుడు ‘చలో’ అని పేరు పెట్టాడేమో!

రేటింగ్ : 2/5


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here