ఇద్దరు మామలూ కలిసి కమర్షియల్ బ్లాక్‌బస్టర్ ఎలా ఉంటుందో నాకు నేర్పించారు!
on Dec 17, 2019
"ఫ్యామిలీ ఆడియెన్స్, విమెన్ ఆడియెన్స్ బాగా ప్రశంసిస్తున్నారు. మొత్తానికి ఇద్దరు మామలూ కలిసి ఒక కమర్షియల్ బ్లాక్‌బస్టర్ ఎలా ఉంటుందో నాకు నేర్పించారు. ఇది తాతగారి డ్రీమ్. ఇది ఆయన (రామానాయుడు) సక్సెస్" అని చెప్పాడు నాగచైతన్య. మేనమామ వెంకటేశ్‌తో కలిసి అతను నటించిన 'వెంకీమామ' మూవీ డిసెంబర్ 13న విడుదలై, వీకెండ్లో మంచి వసూళ్లను సాధించింది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్లో ఏర్పాటుచేసిన థాంక్యూ మీట్లో నాగచైతన్య మాట్లాడాడు.
"డిసెంబర్ 3న 'వెంకీమామ' రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసినప్పుడు నా మైండ్ బ్లాంక్‌గా ఉంది. ఏం జరగబోతుందో, ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారోనని అనుకున్నా. శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిందంటే, వాళ్ల రెస్పాన్స్ ఎలా ఉన్నా యాక్సెప్ట్ చెయ్యాల్సిందే. మిగతా ఇండస్ట్రీల్లో ఒక ప్రోడక్ట్ బయటకు వచ్చి, అది బాగాలేదంటే, తర్వాత దాన్ని సరిచేసి మరో వెర్షన్‌ను బయటకు తీసుకు రావచ్చు. సినిమాకు ఆ వెసులుబాటు లేదు. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. అందరూ సినిమాని సొంతం చేసుకొని బాగుందంటున్నారు. అప్పుడప్పుడు కొంతమంది డైరెక్టర్స్ నా కెరీర్లోకి వచ్చి నాకో కొత్తదారి చూపిస్తారు. ఈ సినిమాతో బాబీ నాకో కొత్తదారి చూపించాడు. 'తడాఖా' ముందు నాగచైతన్య యాక్షన్ చేస్తాడంటే ఎవరూ నమ్మేవారు కాదు. ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ ఆ సినిమాతో నాకో కొత్తదారి చూపించారు. ఈ సినిమాలో ప్రతి అనుబంధాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. నాకూ-రాశీకి, నాకూ-పాయల్‌కు, వెంకీమామ-రాశీకి ఉన్న ట్రాక్స్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. 'వింటేజ్ వెంకీమామ ఈజ్ బ్యాక్' అంటున్నారు. ఇది ఆయనకు వింటేజ్ కాదు, ఒక ఫ్రెష్ ఇన్నింగ్స్. 'ఎఫ్2'తో ఈ ఏడాది హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు. ఇప్పుడు మళ్లీ 'వెంకీమామ'తో హ్యాపీ క్రిస్మన్స్, హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు" అని చెప్పాడు చైతన్య.