English | Telugu

కానరాని లోకాలకు ఏగిన కలం యోధుడు..!

on Oct 9, 2017

మీడియా భావదారిద్ర్యంలో కొట్టుకుపోతోంది అనడానికి నేడు జరిగిన ఓ సంఘటన ఉదాహరణ. సోమవారం ఉదయం మహారచయిత ఎంవీఎస్ హరనాథరావుగారు కాలం చేశారు. తెలుగు తెరపై అద్భుతాలు సృష్టించిన రచయిత ఆయన. చీమ చిటుక్కుమంటే... టీవీల్లో ఓ కార్యక్రమంగా మారుతున్న నేటి రోజుల్లో... ఓ మహా రచయిత మహాభినిష్క్రమణం చెందితే... మద్యాహ్నం దాకా వార్త రాలేదు. దానికి కారణం ఏంటి? అని విశ్లేషించుకుంటే... ఇప్పుడున్న మీడియావారిలో ఎంవీఎస్ హరనాథరావు గురించి తెలిసినవారు లేకపోవడమే.

హరనాథరావుగారిపై అవగాహన లేదంటే అర్థం ఏంటి? వీళ్లకు సినిమాలపై కూడా అవగాహన లేదనే. నేనిక్కడ ఎవర్నీ తప్పుపడ్డటంలేదు. జరిగిన వాస్తవం చెబుతున్నాను. మరో బాధాకరమైన విషయం... ఈ రోజే బుల్లితెర నటి మల్లిక కూడా కాలం చేశారు. ఆమె గురించి చాలా న్యూస్ ఛానల్స్ లో చెప్పారు. కానీ.. ఆమెతో పాటే ఓ లెజెండ్ చనిపోతే.. ఆయన్ను విస్మరించారు. దీన్ని మనం ఎలా తీసుకోవాలి. 

ఇక ఎమ్వీఎస్ హరనాథరావుగారి విషయానికొస్తే... ఆయన ప్రజానాట్యమండలి కళాకారుడు. పుట్టింది గుంటూరులో. చదువు, ఉద్యమాలు అన్నీ ప్రకాశం జిల్లా ఒంగోలులో సాగాయ్. కొన్ని వందల నాటకాలను ఆయన రాశారు. రంగస్థల కళారునిగా హరనాథరావుది గొప్ప ప్రస్థానం. ఆయన నాటక రచయితే కాదు. దర్శకుడు, నటుడు, గాయకుడు కూడా. ఆ ప్రతిభే ఆయన్ను సినిమా రంగం వైపు నడిపించింది. 

హరనాథరావుకి దర్శకుడు టి.కృష్ణ ఆప్తమిత్రుడు. ఆయన ద్వారానే సినీరంగంలో హరనాథరావుకి రచయితగా గుర్తింపు లభించింది. నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు. ప్రతిఘటన, వందేమాతరం, రేపటి చిత్రాలకు హరనాథరావే రచయిత. అదే భావజాలంతో ముత్యాల సుబ్బయ్య తీసిన నవభారతం, భారతనారి, అరుణకిరణం ఈ చిత్రాల్లో కూడా అద్భుతమైన సంభాషణలు అందించారు ఎమ్వీయస్.  నిద్రపోతున్న నవసమాజాన్ని మేల్కొలిపేలా ఉంటాయ్ ఆయన సంభాషణలు. కె.విశ్వనాథ్ గారి ‘సూత్రధారులు’ చిత్రానికి హరనాథరావే రచయిత. టి.కృష్ణ శైలిలోనే కాదు... కె.విశ్వనాథ్ శైలిలో కూడా అద్భుతంగా డైలాగులు రాసిన దిట్ట ఎమ్వీయస్. అంతేకాదు.. రాక్షసుడు, మంచిదొంగ, యుద్ధభూమి, ఇన్ స్పెక్టర్ ప్రతాప్, ధర్మఛక్రం... లాంటి ఊర మాస్ సినిమాలక్కూడా సంభాషణలు రాశారాయన. అంతేకాదు... వీటన్నింటికీ భిన్నంగా...  ఎంఎస్ రెడ్డి తీసిన పౌరాణిక చిత్రం ‘రామాయణం’కి కూడా మాటలు రాశారు. ఆ విధంగా హరనాథరావు కత్తికి అన్ని వైపులా పదునే. 
అలాగే... హరనాథరావు పలు చిత్రాల్లో నటునిగా కూడా రాణించారు. రేపటిపౌరులు, రాక్షసుడు, స్వయంకృషి, దేవాలయం ఇలా చాలా చిత్రాల్లో చక్కని నటన ప్రదర్శించారు. 

హరనాథరావుగారికి ఒంగోలు అంటే చాలా ఇష్టం. ఆయన స్టార్ రైటర్ అయ్యాక కూడా ఒంగోలు వదల్లేదు. ఆఖరుకు సినిమాకు మాటలు రాయాలన్నా ఒంగోలు లోనే రాసేవారు. చివరకు చనిపోవడం కూడా ఒంగోలులోనే కానిచ్చేశారు.  ఎందరికో ఆయన గురువు. నేటి రచయితల్లో చాలామంది ఆయన ఏకలవ్య శిష్యులే. రాశి కన్నా... వాసిని నమ్మిన రచయిత ఎమ్వీఎస్ హరనాథరావు. ఆ మహా రచయిత మృతికి నివాళులర్పిస్తోంది ‘తెలుగువన్’. 


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here