మహేష్‌తో సినిమా.. ఇంకేం ఇంకేం కావాలే!?
on Apr 8, 2020
తెలుగులో హాట్ షాట్ మ్యూజిక్ డైరెక్టర్లలో గోపిసుందర్ ఒకడు. 'భలే భలే మగాడివోయ్', 'నిన్ను కోరి', 'గీత గోవిందం'... చెప్పుకొంటూ పోతే అతడి ఖాతాలో హిట్ సినిమాలు చాలా ఉన్నాయి. అయితే... స్టార్ హీరోలతో పెద్ద సినిమాలు చేయలేదు. ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు సినిమాకు పనిచేసే అవకాశం వచ్చిందని ఫిలింనగర్ టాక్. 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సూపర్ స్టార్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఆ చిత్రానికి గోపిసుందర్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేయడం దాదాపు ఖాయమే. 'గీత గోవిందం' విజయంలో మ్యూజిక్ క్రెడిట్ కూడా చాలా ఉంది. సినిమా విడుదలకు ముందు 'ఇంకేం ఇంకేం కావాలే' సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. సినిమాపై అంచనాలు పెంచింది. మిగతా పాటలు కూడా హిట్టే. అందుకని, అతడిని మహేష్ సినిమాకు కూడా సంగీత దర్శకుడిగా తీసుకోవాలని పరశురామ్ ఫిక్స్ అయ్యారు. హీరోకి ఆ విషయం చెప్పి ఒప్పించారట. లాక్ డౌన్ పూర్తయిన తర్వాత మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేస్తారని టాక్. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తే... జూన్ నుండి పుణెలో షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు.