ముమైత్ తొలి పారితోషికం ఎంతో తెలిస్తే షాకే!
on Feb 26, 2021
`పోకిరి` చిత్రంతో కుర్రకారుతో పాటు టాలీవుడ్ వర్గాలని మెస్మరైజ్ చేసింది ముమైత్‌ఖాన్. అయితే డ్యాన్సర్‌గా ఆమె ప్రయాణం వెనక పెద్ద కథే వుంది. ఈటీవీలో ప్రముఖ హాస్య నటుడు అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న `ఆలీతో సరదాగా` కార్యక్రమంలో పాల్గొన్న ముమైత్‌ఖాన్ డ్యాన్సర్‌గా తన ప్రస్థానం ఎలా మొదలైంది? ఈ ప్రయాణంలో ఎలాంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది.. వంటి పలు ఆసక్తికర వివషయాల్ని పంచుకుంది.
13 ఏళ్ల వయసులోనే బ్రాగ్రౌండ్ డ్యాన్సన్గా తన కెరీర్ ప్రారంభమైందని తెలిపింది. అయితే ఆ స్థాయి నుంచి ఇంత దూరం ప్రయాణిస్తానని తాను ఎప్పుడూ అనుకోలేదని, ఎప్పటికైనా గొప్ప డ్యాన్సర్ అవ్వాలని అనుకోలేదని చెప్పింది. పని చేస్తున్నా, డబ్బులు వస్తున్నాయ్ అంతే.. మరో ఆలోచన తనకు ఉండేది కాదట. 17 ఏళ్ల వయసులోనే `మున్నాభాయ్ ఎంబీబీఎస్` చిత్రంతో డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించానని తెలిపింది.
బాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్, డైరెక్టర్ రెమో డిసౌజా తన గురువని చెప్పే ముమైత్ ఇంట్లో ఆర్థిక సమస్యల కారణంగా ఓ టీవీ డ్యాన్స్ షోలో పాల్గొందట. ముందు ఈ విషయం చెబితే అమ్మ కొడుతుందని భావించిన ముమైత్ "టీవీలో కనిపిస్తాం. పైగా డబ్బులిస్తారు" అని ఒప్పించడంతో ఈ ఒక్కసారికి మాత్రమే ఇంకెప్పుడూ వెళ్లొద్దని ఓకే చెప్పిందట అమ్మ. ఆ డ్యాన్స్ షోలో ముమైత్ అందుకున్న తొలి పారితోషికం అక్షరాలా 750 రూపాయలు! ఆ మొత్తాన్ని కూడా తిరిగి అమ్మకే ఇచ్చేసిందట ముమైత్.