మిస్టర్ మజ్ను... సంక్రాంతికి ముందా? వెనుకా?
on Nov 8, 2018
అక్కినేని కుటుంబంలో అందరి కంటే అందగాడుగా అభిమానులు అభివర్ణించిన అఖిల్ ఇప్పటివరకూ ఆశించిన విజయాన్ని అందుకోలేదు. కథానాయకుడిగా తొలి సినిమా 'అఖిల్' అట్టర్ ప్లాప్ అయితే... రెండో సినిమా 'హలో' అటు ఇటుగా ఆడింది. అందువల్ల, మూడో సినిమా 'మిస్టర్ మజ్ను'పై అక్కినేని ఫ్యామిలీ, ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అక్కినేని ఫ్యామిలీకి అచ్చొచ్చిన జానర్ 'రొమాంటిక్ లవ్' ఫిల్మ్ కాబట్టి సినిమాపై అంచనాలు ఏర్పడుతున్నాయి. ఆల్రెడీ విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. వరుణ్ తేజ్ 'తొలిప్రేమ' విజయం తరవాత దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రమిది. దీపావళి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో జనవరిలో సినిమాను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. జనవరిలో అంటే... సంక్రాంతికి ముందు వస్తాడా? సంక్రాంతి వెనుక వస్తాడా? అనేది తెలియాలి. ఎందుకంటే... జనవరిపై చాలామంది కర్చీఫ్ వేశారు.
సంక్రాంతి బరిలో నందమూరి బాలకృష్ణ, వెంకటేష్, రామ్‌చరణ్, వరుణ్‌తేజ్ సినిమాలు వస్తున్నాయి. బాలకృష్ణ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న తండ్రి బయోపిక్ 'ఎన్టీఆర్' ఫస్ట్ పార్టును జనవరి 9న విడుదల చేస్తున్నారు. జనవరి 11న రామ్‌చరణ్ 'వినయ విధేయ రామ', 12న వెంకటేష్, వరుణ్‌తేజ్ హీరోలుగా నటిస్తున్న 'ఎఫ్2' వస్తున్నాయి. సంక్రాంతి బరిలో చాలా సినిమాలు వున్నాయి. పోటీ ఎందుకని ముందుకు వెళ్లి జనవరి మొదటి వారంలో వద్దామనుకుంటే.. డిసెంబర్ నెలాఖరులో విడుదల కానున్న మమ్ముట్టి 'యాత్ర', వరుణ్ తేజ్ 'అంతరిక్షం', నిఖిల్ 'ముద్ర', శర్వానంద్ 'పడి పడి లేచె మనసు' థియేటర్లలో వుంటాయి. 'మిస్టర్ మజ్ను'కి తక్కువ థియేటర్లు దొరుకుతాయి. మళ్ళీ సంక్రాంతి సినిమాల కోసం కొన్ని థియేటర్లు ఖాళీ చేయాల్సి వస్తుంది. సంక్రాంతికి విడుదలయ్యే ప్రతి సినిమానూ మినిమమ్ రెండు వారాలు థియేటర్లలో వుండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అందువల్ల, జనవరి నెలాఖరులో వస్తే అఖిల్ 'మిస్టర్ మజ్ను'కు థియేటర్లు దొరుకుతాయి. ఎక్కువ సినిమాలు లేకపోవడమా వలన ప్రేక్షకుల కన్ను ఈ సినిమాపై పడుతుంది. జనవరి 24న ఎన్టీఆర్ బయోపిక్ రెండో పార్టు విడుదల కానుంది. అదొక్కటే అఖిల్ సినిమాకు పోటీ అవుతుంది. సినిమాకు పాజిటివ్ బజ్ వుంది కనుక... సోలోగా వస్తే పెద్ద హిట్ అయ్యే ఛాన్స్ వుందని అభిమానులు కోరుకుంటున్నారు.