English | Telugu

మిస్ మ్యాచ్ మూవీ రివ్యూ

on Dec 6, 2019


నటీనటులు: ఉదయ్ శంకర్, ఐశ్వర్యా రాజేష్, సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి, శరణ్య
కథ: భూపతి రాజా
మాటలు: రాజేంద్రకుమార్, మధు 
సినిమాటోగ్రఫీ: గణేష్ చంద్ర
సంగీతం: గిఫ్టన్ ఇలియాస్ 
దర్శకత్వం: ఎన్.వి. నిర్మల్ కుమార్
నిర్మాతలు: జి. శ్రీరామ్ రాజు, కె. భరత్ రామ్  
విడుదల తేదీ: 06 డిసెంబర్ 2019

పవన్ కల్యాణ్ 'తొలిప్రేమ'లో 'ఈ మనసే...' పాటను రీమేడ్ చేశామనే విషయాన్ని ప్రచారంలో 'మిస్ మ్యాచ్' టీమ్ హైలైట్ చేస్తూ వచ్చింది. దీనికి తోడు త్రివిక్రమ్ ఒక పాటను విడుదల చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తెలంగాణ మంత్రి హరీష్ రావ్, విక్టరీ వెంకటేష్ వచ్చారు. ప్రచారంలో ప్రముఖులు సహాయ పడడంతో 'మిస్ మ్యాచ్' గురించి ప్రేక్షకులకు బాగానే తెలిసింది. మరి, సినిమా ఎలా ఉంది?

కథ: సిద్ధార్థ్ అలియాస్ సిద్ధూ (ఉదయ్ శంకర్) ఓ జీనియస్. ఏదైనా ఒక్కసారి చూస్తే గుర్తుపెట్టుకోగలడు. పదో తరగతిలో ఉండగా... ఈ విద్య కారణంగా అతడికి గిన్నిస్ బుక్ రికార్డ్ కూడా వస్తుంది. ఐఐటీలో చదివిన అతడు, వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే కంపెనీ పెడతాడు. హీరోయిన్ విషయానికి వస్తే... కుస్తీని ప్రాణంగా ప్రేమించే గోవిందరాజు (ప్రదీప్ రావత్) కుమార్తె కనక మహాలక్ష్మి అలియాస్ మహా (ఐశ్వర్యా రాజేష్). 2019 యూత్ సమ్మిట్ లో ఇద్దరూ కలుస్తారు. సిద్ధూకి మహా ప్రపోజ్ చేస్తుంది. 'మన ఇద్దరికీ మ్యాచ్ కాదు' అని మొదట మహా ప్రేమకు నో చెప్పిన సిద్ధూ, తర్వాత ప్రేమలో పడతాడు. ఇద్దరూ ఇంట్లో ప్రేమ విషయం చెబుతారు. ఒక రోజు ఇరు కుటుంబాలు ఒక దేవాలయ ప్రాంగణంలో కలుస్తారు. కుస్తీని కించపరిచిన కారణంగా సిద్ధూ మావయ్యను గోవిందరాజు చేయి చేసుకుంటాడు. దాంతో వాళ్ళు సంబంధం వద్దనుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ సిద్ధూ, మహా ఎలా కలిశారు? తమ గ్రామంలో పంట పొలాల నాశనానికి కారణమవుతున్న సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ధర్నాకు దిగిన గోవిందరాజును పోలీసులు అరెస్ట్ చేస్తే.. సిద్ధూ ఎలా సహాయం చేశాడు? అంతర్జాతీయ కుస్తీ (రెజ్లింగ్) పోటీల్లో మహా విజయం సాధించేలా సిద్ధూ ఏం చేశాడు? చివరకు, ఇద్దరి ప్రేమ ఏమైంది? అనేది మిగతా సినిమా.  

విశ్లేషణ: 
కుటుంబంలో పెద్దలు పంతాలు, పట్టింపులు, ఇగోలకు పోవడంతో ప్రేమికులు విడిపోవడం, మళ్ళీ కలవడం కాన్సెప్ట్‌తో తెలుగు తెరపై చాలా సినిమాలు వచ్చాయి. తెలిసిన కథను కొత్తగా, ఆసక్తికరంగా చెప్తే ఎక్కడ  ప్రేక్షకులైనా చూస్తారని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. అయితే... ఈ సినిమాలో కొత్తదనం కోసం వెతకడం సముద్రంలో మంచినీటి కోసం వెతికినట్టు ఉంటుంది. కుస్తీ నేపథ్యంలో కథానాయిక పాత్రను కొంచెం రఫ్ అండ్ టఫ్ గా తీరిదిద్దారంతే. పోనీ తెలిసిన కథ, సన్నివేశాలను ఆసక్తికరంగా తీశారా అంటే అదీ లేదు. ఉత్కంఠ కలిగించాల్సిన కుస్తీ పోటీ సన్నివేశాలు నీరసంగా సాగుతాయి. ఫస్టాఫ్ అయితే మరీ చప్పగా, విసుగు పుట్టిస్తూ సాగుతుంది. సెకండాఫ్ లో ఐశ్వర్యా రాజేష్ నటన వల్ల తండ్రీకూతుళ్ళ మధ్య భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అసలు, హీరో హీరోయిన్లు ప్రేమలో ఎలా పడ్డారో అర్థం కాదు.  

తమిళ దర్శకుడు కాబట్టి ఎటువంటి డైలాగులు రాసినా చెల్లుతుందనట్టు మాటల రచయితలు ఇద్దరూ పేజీలకు పేజీలు డైలాగులు రాశారు. సినిమాలో హీరో పేరును ప్రేక్షకులు మర్చిపోతారనుకున్నారేమో... మాటకు ముందు సిద్ధూ, మాట తర్వాత సిద్ధూ అంటూ లెక్కకు మించి ఆ పేరును వాడారు. దర్శకుడిది తమిళనాడు కావడంతో సినిమాలో తమిళ వాసన ఎక్కువ కొట్టింది. తెలుగు నేటివిటీ మిస్ అయ్యింది. ఇది లవ్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆ? థ్రిల్లర్ సినిమానా? అని డౌట్ వచ్చేలా కొన్ని సన్నివేశాల్లో అనవసరమైన షాట్స్ చూపించారు. ఉదాహరణకు... ఇంటర్వెల్ కి ముందు టెంపుల్ సీన్ లో జనాల హడావిడి చూపిస్తూ ఏదో జరుగుతున్న బిల్డప్ ఇచ్చారు. పాత్రలకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకోవడంలో దర్శకుడు, రచయితలు ఫెయిల్ అయ్యారు. హీరోయిన్ తండ్రిగా ప్రదీప్ రావత్ గానీ, హీరో స్నేహితులుగా నటించిన ఇద్దరు గానీ, విలన్ గానీ ఎవరూ సెట్ కాలేదు. పాటల్లో గుర్తు పెట్టుకునేంతగా ఏమీ లేవు. నేపథ్య సంగీతంలో హిట్ ఫిల్మ్స్ బీజియమ్స్ గుర్తుకు వస్తాయి. పవన్ కల్యాణ్ 'తొలిప్రేమ'లో 'ఈ మనసే...' పాటను ఏమంత గొప్పగా తీయలేదు. నిజాయతీగా చెప్పాలంటే చెడగొట్టారు. యాక్షన్ సీన్స్ లో ఛేజింగ్ బాగా తీశారు. 

ప్లస్ పాయింట్స్:
ఐశ్వర్యా రాజేష్
తండ్రీకూతుళ్ల మధ్య కొన్ని భావోద్వేగాలు

మైనస్ పాయింట్స్:
ఉదయ్ శంకర్
ప్రదీప్ రావత్
రొటీన్ స్టోరీ
మాటలు, దర్శకత్వం
పాటలు, నేపథ్య సంగీతం

నటీనటుల అభినయం: 
ఉదయ్ శంకర్ హీరో మెటీరియల్ అనిపించుకోవాలంటే యాక్టింగ్‌లో ట్రైనింగ్ తీసుకోవాలి. ఎక్స్‌ప్రెషన్స్ మీద ఇంకా వర్క్ చేయాలి. ఐశ్వర్యా రాజేష్ మంచి నటి. కొన్ని సన్నివేశాల్లో తానేంటో చూపంచింది. క్యారెక్టరైజేషన్ వల్ల కొన్ని సన్నివేశాల్లో ఓవర్ ది బోర్డ్ వెళ్లి నటించింది. సినిమాకు ఆమె ప్లస్ పాయింట్. పలు సినిమాల్లో ప్రతినాయకుడిగా, 'నేను శైలజ'లో హాస్యనటుడిగా చూసిన ప్రదీప్ రావత్, హీరోయిన్ తండ్రిగా పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపిస్తుంటే జీర్ణించుకోవడం కష్టమే. ప్రదీప్ రావత్ గెటప్ బాగోలేదు. ఆయన నటన అంతకంటే బాగోలేదు. హీరో తండ్రిగా సంజయ్ స్వరూప్ రొటీన్ క్యారెక్టర్ చేశారు.  

తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:
'మిస్ మ్యాచ్'... ఈకాలంలో ప్రేక్షకుల అభిరుచికి ఇటువంటి కథలు మిస్ మ్యాచ్ అవుతాయి. అసలు, కథలో కొన్ని కీలక పాత్రలకు ఎంపిక చేసుకున్న నటీనటులు మిస్ మ్యాచ్ అయ్యారు. ఒక్క ఐశ్వర్యా రాజేష్ తప్ప. ఏదో ఒక థియేటర్‌కు వెళ్లి రెండున్నర గంటలు కాలక్షేపం చేయాలనుకునే ప్రేక్షకులు ఈ సినిమాకు వెళ్లవచ్చు. కుటుంబ అనుబంధాలు, మంచి ప్రేమకథ ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు.

రేటింగ్: 1.25/5
 


Cinema GalleriesLatest News


Video-Gossips