'మిడిల్ క్లాస్ మెలోడీస్' కొండలరావుకు వెల్లువెత్తుతున్న ఆఫర్లు!
on Nov 30, 2020
కొవిడ్-19 వ్యాప్తి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో థియేటర్లు మూతపడ్డంతో సినీ ప్రియులకు టీవీ, డిజిటల్ ఫార్మట్ ఎంటర్‌టైన్‌మెంట్ వినా వేరే దారి లేకపోయింది. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకోలేదు. ఈ పరిస్థితి ఓటీటీ ప్లాట్‌ఫామ్ బాగా క్యాష్ చేసుకుంటోంది. ఏ భాషలో కావాలంటే, ఆ భాషలో లేటెస్ట్ సినిమాల నుంచి క్లాసిక్స్ దాకా అందుబాటులోకి రావడంతో సినీ ప్రియులు ఓటీటీకి అతుక్కు పోతున్నారు. ఇప్పటికే థియేటర్లలో విడుదలవకుండా, కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజవుతున్నాయి. 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య', 'కృష్ణ అండ్ హిజ్ లీల' లాంటి చిన్న సినిమాల తర్వాత సూర్య బిగ్ బడ్జెట్ ఫిల్మ్ 'ఆకాశం నీ హద్దురా' (సూరారై పొట్రు) ఓటీటీలో నేరుగా రిలీజై వీక్షకుల్ని అలరించాయి.
అదే తరహాలో గత వారం ఓటీటీలో విడుదలైన తెలుగు సినిమా 'మిడిల్ క్లాస్ మెలోడీస్' టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. నాటకీయతకు అతి తక్కువ ప్రాముఖ్యం ఇచ్చి, వాస్తవికతను నమ్ముకొని, చాలా సింపుల్‌గా తీసిన ఆ సినిమా చూసి, మధ్యతరగతి జనాలంతా దాన్ని తమ కథగానే భావించుకుంటున్నారు. హీరో రాఘవ (ఆనంద్ దేవరకొండ), హీరోయిన్ సంధ్య (వర్ష బొల్లమ్మ), హీరో తండ్రి కొండలరావు (గోపరాజు రమణ) పాత్రల్లో తమను తాము చూసుకుంటున్నారు. గుంటూరు, దాని పరిసర గ్రామాల నేపథ్యంతో యంగ్ అండ్ డెబ్యూ డైరెక్టర్ వినోద్ అనంతోజు 'మిడిల్ క్లాస్ మెలోడీస్' తీసిన విధానానికి అందరూ ముచ్చటపడుతున్నారు.
ఇక గోపరాజు రమణ అయితే రాత్రికి రాత్రి స్టార్ క్యారెక్టర్ యాక్టర్ అయిపోయారు. కొండలరావు పాత్రలో ఆయన ప్రదర్శించిన అభినయం అలాంటిది. ఒక మధ్యతరగతి కుటుంబీకునిగా ఆయన ప్రదర్శించిన హావభావ ప్రదర్శన టాలీవుడ్‌లోని అగ్ర క్యారెక్టర్ల ఆర్టిస్టులకు ఏమాత్రం తక్కువగా లేదనే పేరు తెచ్చుకున్నారు. పైపెచ్చు.. అతి సహజంగా ఆ పాత్రను పోషించారని ప్రశంసలు అందుకుంటున్నారు. ఓవైపు రంగస్థల కళాకారుడిగా రాణిస్తూనే, చాలా కాలంగా ఆయన సినిమాల్లో నటిస్తున్నారు. అయితే ఇంతదాకా సినిమాల్లో ఆయన చేసినవి చిన్నా చితకా పాత్రలే. కొండలరావు పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చూసిన దర్శకులు ఇప్పుడు తాము రాసుకొన్న పాత్రల్లో ఆయనను చూసుకుంటున్నారు. అందుకే ఆయనకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. మొత్తానికి ఒకే ఒక్క సినిమా ఆయన కెరీర్ దిశను మార్చనున్నదన్న మాట.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
