ఫస్ట్ సినిమాలో ఫస్ట్ షాట్... ఐదారుసార్లు అలాగే చేశా: మెహరీన్
on Feb 22, 2020
తెలుగులో మెహరీన్ తొలి సినిమా 'కృష్ణగాడి వీరప్రేమగాథ'. కథానాయికగా ఆమె తొలి సినిమా కూడా అదే. అంతకు ముందు ఒక సోప్ యాడ్, బ్యూటీ ప్రోడక్ట్ యాడ్స్ ఏవో చేశారు. దర్శకుడు హను రాఘవపూడికి 'కృష్ణగాడి వీరప్రేమగాథ' రెండో సినిమా. అంతకుముందు ఆయన 'అందాల రాక్షసి' తీశారు. ఎవరో కోఆర్డినేటర్ ద్వారా మెహరీన్ ఫొటోలు చూసి కృష్ణగాడి ప్రేయసి మహాలక్ష్మి పాత్రకు సెలెక్ట్ చేశారు. అంతకు ముందు ఆమెకు యాడ్స్ లో నటించిన అనుభవం ఉన్నప్పటికీ ఫస్ట్ సినిమాలో ఫస్ట్ షాట్ చేయడానికి ఐదారు టేక్స్ తీసుకున్నారు. ఇంతకీ, 'కృష్ణగాడి వీరప్రేమగాథ'లో మెహరీన్ నటించిన ఫస్ట్ సీన్ ఏదో తెలుసా? దేవుడికి దణ్ణం పెడుతూ శ్లోకం చెప్పే సీన్!
షూటింగ్ చేసినప్పటి సంగతులను మెహరీన్ గుర్తు చేసుకుంటూ "యాడ్ షూటింగ్ చేయడం, సినిమా షూటింగ్ చేయడం డిఫరెంట్ ఎక్స్ ప్రీరియన్స్. 'కృష్ణగాడి వీరప్రేమగాథ' షూటింగ్ ఫస్ట్ డే నేను చాలా నెర్వస్ గా ఉన్నాను.కెమెరా రోలింగ్, యాక్షన్ అని డైరెక్టర్ చెప్పగానే కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. ఆ బ్లాంక్ అయ్యేదాన్ని. ఆ కన్ఫ్యూజన్లో బ్లాంక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చేదాన్ని. ఐదారుసార్లు అలాగే చేశా. దాంతో డైరెక్టర్ హను రాఘవపూడి కెమెరా ఎప్పుడూ రోలింగ్ లో ఉంచి సీన్ కంప్లీట్ చేశారు" అని చెప్పుకొచ్చారు. ఆ సినిమా తర్వాత మెహరీన్ తెలుగులో చాలా సినిమాలు చేశారు.