విడాకుల కోసం దరఖాస్తు చేసిన అందాల తార!
on Nov 26, 2020
హాలీవుడ్ అందాల తార మేగన్ ఫాక్స్, యాక్టర్ బ్రియాన్ ఆస్టిన్ గ్రీన్ విడిపోవడం మరింత అధికారికం కాబోతోంది. తాము విడిపోయినట్లు ప్రకటించిన ఆరు నెలల తర్వాత, నవంబర్ 25న సరిచేయలేని విభేదాల కారణంగా విడాకుల కోసం లాస్ ఏంజెల్స్ కౌంటీ సుపీరియర్ కోర్టులో అర్జీ దాఖలు చేసింది. బ్లాక్‌బస్టర్ టీవీ సిరీస్ 'బెవెర్లీ హిల్స్' ద్వారా మేగన్ ఫాక్స్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.
మేగన్, బ్రియాన్లకు ముగ్గురు కొడుకులు (నోవా, బోధి, జర్నీ) ఉన్నారు. వారిని సంయుక్త సంరక్షణలో ఉంచాల్సిందిగా తన విడాకుల దరఖాస్తులో ఆమె కోర్టును అభ్యర్థించింది. దీనికి అంగీకార పత్రాన్ని బ్రియాన్ కూడా దాఖలు చేసినట్లు సమాచారం. దాదాపు పదేళ్ల వైవాహిక బంధం తర్వాత తాము విడిపోయినట్లు ఈ ఏడాది మేలో బ్రియాన్ ధ్రువీకరించాడు.
పదహారేళ్ల క్రితం మేగన్, బ్రియాన్ తొలిసారి కలుసుకున్నారు. అప్పుడు ఆమెకు 18, అతనికి 30. 2004లో 'హోప్ అండ్ ఫెయిత్' సిరీస్ షూటింగ్ సందర్భంగా సెట్స్‌పై మీట్ అయ్యారు. ఆ తర్వాత రెండేళ్లకు వాళ్ల ఎంగేజ్మెంట్ జరగగా, 2010లో పెళ్లి చేసుకున్నారు.
మేగన్ ఈ ఏడాది మార్చిలో 'మిడ్నైట్ ఇన్ ది స్విచ్గ్రాస్' అనే మూవీ షూటింగ్ ప్రారంభించి, అందులో నటిస్తోన్న మెషీన్ గన్ కెల్లీతో ప్రేమలో పడింది. 30 ఏళ్ల రాకర్ అయిన కెల్లీకి తనది లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌గా పేర్కొన్నాడు. మేలో 'బ్లడీ వాలెంటైన్' అనే స్టీమీ మ్యూజిక్ వీడియోలో ఆ ఇద్దరూ కలిసి నటించారు. అప్పట్నుంచీ ఆ ఇద్దరూ విడదీయరానంత పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. మొన్న నవంబర్ 22న జరిగిన అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్ రెడ్ కార్పెట్‌పై ఆ ఇద్దరూ జంటగా హాజరయ్యారు.
మరోవైపు బ్రియాన్ కూడా తక్కువ తినలేదు. మేగన్‌తో విడిపోయాక టీనా లూయిస్, కోర్ట్నీ స్టాడెన్ లాంటి తారలతో కలిసి కనిపిస్తున్నాడు. మొత్తానికి తామిద్దరూ చాలా భిన్నమైన వ్యక్తులుగా మేగన్, బ్రియాన్ అర్థం చేసుకున్నారు. నిజానికి డైవోర్స్‌కు అప్లై చేయడం మేగన్‌కు ఇదే తొలిసారి కాదు. 2015లోనే ఆమె అప్లై చేసింది. అయితే మూడోసారి గర్భం దాల్చడంతో, విభేదాలను పక్కనపెట్టి మళ్లీ కలిశారు. ఇప్పుడు చట్టప్రకారం విడిపోతున్నారు.
Also Read