మీరా జాస్మిన్ రిటర్న్స్!
on Apr 14, 2021
జాతీయ ఉత్తమనటి, దక్షిణాది ప్రేక్షకులను తన అందం, అభినయంతో అమితంగా అలరించిన మీరా జాస్మిన్ కొంత కాలం విరామంతో మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పైకి వస్తోంది. తన ఫేవరేట్ మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించే సినిమాతో ఆమె రి-ఎంట్రీ ఇస్తోంది. మంగళవారం ఈ సినిమాని సత్యన్ అంతికాడ్ స్వయంగా ప్రకటించాడు. ఆ సినిమాలో జయరామ్ ('అల.. వైకుంఠపురములో' హీరో ఫాదర్), మీరా జాస్మిన్ ప్రధాన పాత్రధారులుగా కనిపించనున్నారు. ఈ ఏడాది జూలై మధ్యలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. స్పెషల్ అప్పీరెన్స్‌ను పక్కన పెడితే ఒక ప్రధాన పాత్ర పోషించడం ఐదేళ్ల తర్వాత మీరాకు ఇదే ప్రథమం.
తెలుగులో చివరిసారిగా 2013లో వచ్చిన థ్రిల్లర్ 'మోక్ష'లో నటించిన మీరా.. ఆ తర్వాత తన మాతృభాష మలయాళంలో కొన్ని సినిమాలు చేసింది. 2016లో వచ్చిన 'పదు కల్పనకల్' ఆమె నటించిన చివరి సినిమా. 2014లో ఆమె దుబాయ్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న అనిల్ జాన్ టైటస్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత కూడా నటించడం కొనసాగించి, 2016లో తాత్కాలికంగా నటనకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు సత్యన్ అంతికాడ్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో తిరిగి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2003లో నటించిన మలయాళం సినిమా 'పాదమ్ ఒన్ను: ఒరు విలాపమ్'తో ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర అవార్డుతో పాటు నేషనల్ అవార్డును సైతం ఆమె అందుకుంది.
ఇప్పుడు సత్యన్ అంతికాడ్ డైరెక్షన్లో చేస్తున్న సినిమా తర్వాత ఆమె నటనను కొనసాగిస్తుందా, లేదా అనే విషయం ధ్రువపడలేదు. ఏదేమైనా తెలుగు దర్శకులు కూడా మీరాను దృష్టిలో పెట్టుకోవచ్చు.
Also Read