సినిమా రైటర్ థాట్స్ ఎలా ఉంటాయో చూపించే 'మాయ' షార్ట్ ఫిల్మ్ రివ్యూ
on Jun 12, 2021
తారాగణం: అశోక్ సెల్వన్, ప్రియా ఆనంద్
సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి
మ్యూజిక్: రాన్ ఎథన్ యోహన్
రచన, కూర్పు, దర్శకత్వం: అని ఐ.వి. శశి
బ్యానర్: ఆండ్రాగ ఎంటర్టైన్మెంట్
ప్లాట్‌ఫామ్: యూట్యూబ్
ఈ ఏడాది ఫిబ్రవరిలో జీప్లెక్స్‌లో నేరుగా రిలీజైన 'నిన్నిలా నిన్నిలా' అనే రొమాంటిక్ కామెడీతో ఆకట్టుకున్నాడు డైరెక్టర్ అని ఐ.వి. శశి. అతనికి అది ఫస్ట్ ఫిల్మ్. అశోక్ సెల్వన్, రీతువర్మ, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఆ సినిమాలో లవ్, రిలేషన్‌షిప్స్‌ను కుకింగ్, ఫుడ్ ద్వారా అతను చూపించిన విధానం కొత్తగా ఉండి అలరించింది. ఇప్పుడతను ఓ షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించి, యూట్యూబ్ ద్వారా వదిలాడు. తొమ్మిదిన్నర నిమిషాల నిడివి కలిగిన ఆ తమిళ షార్ట్ ఫిల్మ్ 'మాయ'. 'నిన్నిలా నిన్నిలా' మూవీలో హీరోగా నటించిన అశోక్ సెల్వన్ ఈ షార్ట్ ఫిల్మ్‌లోనూ నటించాడు. ఇందులో ఉన్నవి రెండే పాత్రలు. మరో పాత్రను, అదీ టైటిల్ రోల్‌ను ప్రియా ఆనంద్ పోషించింది.
విమర్శకుల ప్రశంసలు పొందిన అశోక్ అనే ఒక డైరెక్టర్ తన నెక్ట్స్ ఫిల్మ్‌కు కథ రాయడానికి ఉపక్రమించడంతో ఈ ఫిల్మ్ మొదలవుతుంది. 'బెస్ట్ కమర్షియల్ ఫాంటసీ' స్క్రిప్ట్ రాయాలనేది అతడి ఉద్దేశం. ముందుగానే హీరోయిన్ క్యారెక్టర్ పేరు 'మాయ' అని ఫిక్సవుతాడు. మాయ ఏం చేస్తుంటుంది, ఆమె లవ్ స్టోరీ ఎక్కడ మొదలవుతుంది అనేది రాయడంలో అశోక్ కన్ఫ్యూజ్ అవుతుంటాడు.
ఒక రచయిత తలలో ఏదైనా కథ రాయాలనుకున్నప్పుడు ఎన్ని రకాల ఆలోచనలు మెదులుతుంటాయో ఈ చిన్న చిత్రం ద్వారా తెలియజేయడానికి ప్రయత్నించాడు డైరెక్టర్ అని. అశోక్ తలలోని ఆలోచనలే డైలాగ్స్‌గా మనకు వినిపిస్తుంటాయి. తన కథలోని హీరోయిన్ క్యారెక్టర్‌కు ఇన్స్పిరేషన్ అతడి భార్య మాయ (ప్రియా ఆనంద్). అతడున్న రూమ్‌లోనే కాస్త అవతల టేబుల్ దగ్గర ఆమె కూర్చొని ఉంటుంది. తమ లవ్ స్టోరీని రకరకాల నేపథ్యాల్లో ఊహించుకుంటాడు అశోక్. ఒకసారి బాక్సర్‌గా, ఇంకోసారి చెఫ్‌గా ఆమెను ఊహించుకుంటాడు. కానీ ఏదీ అతడికి శాటిస్ఫ్యాక్షన్ ఇవ్వదు.
ఫిల్మ్ చివరకు వచ్చేసరికి అతను మాయ కోసం చూస్తాడు. అక్కడ ఆమె ఉండదు. అప్పుడు మనకు అర్థమవుతుంది.. మాయ పాత్ర నిజం కాదనీ, అశోక్ ఊహల్లోని పాత్ర అనీ. అదివరకు అతను 'అంబ' అనే సక్సెస్ఫుల్ ఫిల్మ్‌కు స్క్రిప్టు రాసి ఉంటాడు. దానికంటే బెటర్ కమర్షియల్ ఫిల్మ్‌కు కథ రాయాలనేది అతడి సంకల్పం. రైటర్ ఊహలు ఎలా ఉంటాయో రియలిస్టిగ్గా ఈ చిన్న చిత్రంతో ప్రతిభావంతంగా ప్రదర్శించాడు డైరెక్టర్ అని శశి. రచనతో ఎడిటింగ్ కూడా అతడే చేశాడు. దివాకర్ మణి ఛాయాగ్రహణం, రాన్ ఎథన్ యోహన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఎస్సెట్స్.