డిజాస్టర్ దిశగా 'మన్మథుడు 2'!
on Aug 14, 2019
ఫిల్మ్ ఇండస్ట్రీలోనే నెగటివ్ టాక్ ఉందనీ, బయట ఫ్యామిలీ ఆడియెన్స్ 'మన్మథుడు 2'ను బాగా ఆదరిస్తున్నారనీ అక్కినేని నాగార్జున అంటుంటే, ఆ సినిమా కలెక్షన్ ఫిగర్స్ మాత్రం వేరే స్టోరీ చెబుతున్నాయి. విడుదలైన నాలుగు రోజుల్లో ఆ మూవీ కలెక్షన్స్ అంచనాలకు చాలా దూరంగా ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. నాగార్జునను, టైటిల్ను నమ్మి సినిమాని థియేటర్లలో రిలీజ్ చేసిన బయ్యర్లు భారీగా నష్టపోవడం ఖాయమని వాళ్లంటున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో 'మన్మథుడు 2' థియేటర్ హక్కుల విలువ 16.5 కోట్ల రూపాయలని అంచనా. 4 రోజుల్లో వచ్చిన షేర్ 7 కోట్ల రూపాయల లోపే. సోమవారం బక్రీద్ సందర్భంగా సెలవు వచ్చినప్పటికీ దాన్ని మూవీ.. సొమ్ము చేసుకోలేకపోయింది. ఆదివారం కలెక్షన్లతో పోలిస్తే సోమవారం కలెక్షన్లు సగం పడిపోయాయని విశ్లేషకులు అంటున్నారు. నైజాం ఏరియాలో 7 కోట్ల రూపాయల విలువకు గాను 3 కోట్ల రూపాయల లోపే షేర్ వచ్చింది. ఆగస్ట్ 15న రెండు సినిమాలు.. 'రణరంగం', 'ఎవరు' వస్తున్నందున 'మన్మథుడు 2'కు థియేటర్లు బాగా తగ్గిపోనున్నాయి. ఇది ఆ మూవీ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపనుంది.
తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోడానికే 'మన్మథుడు 2' మూవీ చేశానీ, కాస్త ఆలస్యంగానైనా పాజిటివ్ టాక్ వచ్చి కలెక్షన్లు పెరుగుతాయనీ సినిమా రిలీజైన రెండో రోజు నాగార్జున ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ కలెక్షన్ ఫిగర్స్ నిరాశ కలిగిస్తున్నాయి. ఓవరాల్గా ఈ మూవీ 10 కోట్ల రూపాయల షేర్ అయినా కలెక్ట్ చేస్తుందో, లేదోనని బయ్యర్లు ఆందోళన చెందుతున్నారు. సినిమా ఆరంభంలో బూతు ఎక్కువగా ఉందనీ, నాగార్జునకు అలాంటి సీన్లు చేయడం అవసరమా అనీ వచ్చిన నెగటివ్ టాక్ సినిమాకు శాపంగా మారింది.