English | Telugu

‘ఇంద్ర’ పాటల విషయంలో జరిగిన గమ్మత్తేంటంటే...

on Jul 11, 2018

 


యనమండ్ర వెంకట సుబ్రమణ్యశర్మ... ఈ పేరు ఎంతమందికి తెలుసు? అనడిగితే.. నోళ్లెల్లబెట్టడం ఖాయం. అదే ‘మణిశర్మ’ అంటే... శ్రోతల ముఖాలు విప్పారతాయ్. మణిశర్మ అందించిన స్వరాల విందు అలాంటిది మరి.  మణిశర్మ  పేరే  సాఫ్ట్గ్ గా ఉంటుంది... మనసు మాత్రం ఊర మాస్. ఆయన స్వరపరచిన పాటలే ఉదాహరణ.  1998 నుంచి ఓ ఏడెందేళ్ల పాటు మణిశర్మ మేనియాతో తెలుగు సినిమా అట్టుడికి పోయిందంటే నమ్మండి. అందరు హీరోలకూ మణిశర్మే కావాలి. అందరికీ స్వర సమన్యాయం మణిశర్మే చేయాలి. పొరపాటున ఏ ఆల్బమ్ అన్నా  బెడిసికొట్టిందా...? ఇంకేముంది? అభిమానుల నుంచి ఎక్కడలేని ప్రషర్, విమర్శలూ... ఛీత్కారాలూ.. అవమానాలూ... అబ్బబ్బ.. ఈ విషయంలో అప్పట్లో మణిశర్మ అనుభవించిన వత్తిడి మరే సంగీత దర్శకుడూ అనుభవించలేదనే చెప్పాలి.  ఆయన ప్రభ స్థాయిలో ఉండేది మరి.

వెంకటేశ్ ‘ప్రేమించుకుందాం రా’ సినిమాకు ‘నేపథ్య సంగీతం మణిశర్మ‘ అనే కార్డ్ పడింది. చాలామందికి ఆయన పేరు అప్పట్నుంచే తెలుసు. కానీ...  మణి బంధం సినిమాలతో ఈ నాటిది కాదు. ఆయన తండ్రిగారైన వై.యన్.శర్మ ప్రముఖ వయోలినిస్ట్. చాలా సినిమాలకు పనిచేశారాయన. తండ్రి నుంచి అబ్బిన సరిగమలే... ఆయనకు కూడా జీవనోపాథి అయ్యాయ్. ఆయన్ను తెలుగు సినిమా రంగంలో స్టార్ గా నిలబెట్టాయ్.  తొలి సినిమా ‘సూపర్ హీరోస్’. ఏవీయస్ దర్శకుడు. రెండో సినిమా  ఏకంగా మెగాస్టార్ ‘బావగారూ బాగున్నారా‘. ’పట్టుమని ఒక్క సరైన సినిమా చేయని ఇతగాడికి మెగాస్టార్ అవకాశం ఇవ్వడమేంటి?‘ అని అందరూ పెదవి విరిచారు. ‘ఏం చూసి ఇచ్చాడో...’ అనే చర్చలూ జరిగాయ్. తీరా సినిమా విడుదలైంది. ఆ పాటలు విన్నారు... ఇంకేముందీ... అందరూ ఏక కంఠంతో... ‘సారీ... సారీ... సారీ...’ అంటూ మణికి క్షమాపణలు చెప్పేశారు. తొలి సినిమాతోనే మణి మాయలో పడిపోయారు.

ఆ వెంటనే వచ్చింది. ‘చూడాలని  ఉంది’. త్యాగరాయక‌ృతికి ‘మెగా’ షోకునద్ది... ఆయన స్వరపరిచన ‘యమహా నగరి కలకత్తాపురి’ సాంగ్.. నేటికీ ఎవర్ గ్రీనే. వేటూరి సాహిత్యం... మణిశర్మ సంగీతం నువ్వా, నేనా అంటూ ఆ పాటలో పోటీ పడుతుంటాయంటే... అది  ఏమాత్రం అతిశయోక్తి కాదు. 1999 సంక్రాంతి... మణిశర్మ కెరీర్ లో చాలా ముఖ్యమైంది. ఎందుకంటే... ఆ ఏడాదే.. కదా ‘సమరసింహారెడ్డి’ విడుదలైంది. అదే టైమ్ లో ఆ సినిమాకు పోటీగా మెగాస్టార్ ‘స్నేహం కోసం’ విడుదలైంది. దానికి సంగీతం ఎస్.ఎ.రాజ్ కుమార్. మంచి సంగీత దర్శకుడు. మెలొడీ కింగ్. కానీ ఏం లాంభం? మణిశర్మ స్పీడ్ ముందు ‘స్నేహం కోసం’ ఆల్బమ్... తెల్లబోయింది. ఆ ఏడాది ఎక్కడ విన్నా ‘సమరసింహారెడ్డి’ పాటలే. ఓ విధంగా ఆ సినిమా విజయంలో సగం భాగం మణిశర్మదే అనాలి.
2001లో సంక్రాంతి అయితే... అచ్చంగా మణిశర్మదే. ఆ పండగకు మూడు సినిమాలు విడుదలయ్యాయ్. మెగాస్టార్ ‘మృగరాజు’, బాలయ్య ‘నరసింహనాయుడు‘, విక్టరీ వెంకటేశ్ ’దేవీపుత్రుడు‘. మూడింటికీ మణిశర్మే సంగీత దర్శకుడు.  వాటిలో బాలయ్య సంక్రాంతి విజేతగా నిలిచినా... ఆల్బమ్స్ పరంగా మూడింటికి మూడే. నిజంగా ఒక సంగీత దర్శకునికి ఇంతకు మించిన అగ్ని పరీక్ష ఏముంటుంది చెప్పండి?  తనకు తనే పోటీపడాలి. ఇలాంటి కష్టతరమైన పరిస్థితులను కూడా ఇష్టంగా నెట్టుకొచ్చాడు మణిశర్మ. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ సినిమాలంటే మణిశర్మ చలరేగి పోయేవాడు. వారిద్దరు కూడా మణిశర్మ మ్యూజిక్ అంటే... డాన్సులతో రెచ్చిపోయేవారు. నిజంగా ఆ ఏడేనిమిదేళ్లు మాస్ ప్రేక్షకులకు పండుగే  పండుగ.

అంతేకాదు... వారి తర్వాత జనరేషన్ పవన్ కి ‘ఖుషీ’తో మెమరబుల్ ఆల్బమ్ ఇచ్చాడు మణిశర్మ. ఇక మహేశ్ కైతే... అతని కెరీర్లో ఇప్పటికే చెప్పుకునేవి మణిశర్మ పాటలే. రాజకుమారుడు, టక్కరిదొంగ, వంశీ, మురారి, ఒక్కడు, అర్జున్, పోకిరి... ఇక చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా? మణిశర్మ అంటే కచ్చితంగా చెప్పుకోవలసిన సినిమా మెగాస్టార్ ‘ఇంద్ర’. ఆ సినిమా విషయంలో ఓ గమ్మత్తు జరిగింది. అదేంటంటే... ఆ సినిమా ఆల్బమ్ లో ఒక్క పాట మినహా అన్ని పాటలూ మణిశర్మవే. ఆ ఒక్క పాట ఆర్పీ పట్నాయక్ స్వరపరిచాడు. ఆ పాటే... ‘అయ్యో.. అయ్యో... అయ్యయ్యయ్యో.. అయ్యయ్యో... చలగాలీ చంపిసిందయ్యో...‘ అప్పట్లో... పెద్ద హీరోలకు మణిశర్మ అద్భుతమైన స్వరాలిస్తుంటే... చిన్న సినిమాలతో ఆర్పీ చలరేగిపోయేవాడు.

అలాంటి సమయంలో... కావాలనే... మెగా ఆల్బమ్ లో ఓ పాట స్వరపరిచే అవకాశం  ఇచ్చారు ఆ సినిమా దర్శకుడు బి.గోపాల్. ఆ టైమ్ లో శ్రోతలంతా ఆర్పీ పాటపై నిజంగా ప్రత్యేక శ్రద్ధ చూపారు. నిజంగా కూడా ఆ పాటను చక్కగా స్వరపరిచాడు ఆర్పీ. కానీ... ఏం లాభం... చివరకు ప్రజా తీర్పులో.... ఆ ఆల్బమ్ లో ఆర్పీ పాటకు చివరి స్థానమే దక్కింది. ’ఇంద్ర‘తో మణిశర్మ సంగీత సునామీనే సృష్టించాడు. ఆ సునామీ దెబ్బకు ఆర్పీ పాట తేలిపోయిందని చెప్పక తప్పదు. ‘ఇంద్ర’లో మణిశర్మ స్వరాలన్నీ...  అద్భుతాలే. ఈ రోజు మణిశర్మ పుట్టిన రోజు.  ప్రస్తుతం ఆయన నిదానించిన మాట నిజం. రోజులన్నీ ఒకేలా ఉండవు కదా. ఏది ఏమైనా... మళ్లీ ఈ స్వరమాంత్రికునికి పూర్వవైభవం రావాలని ఆశిస్తోంది... అభిలషిస్తోందీ తెలుగువన్.

హ్యాపీ బర్త్ డే మణిశర్మగారూ...


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here