English | Telugu

2020 ఫ‌స్టాఫ్‌ మ‌ల‌యాళం టాప్ 10 ఫిలిమ్స్‌

on Jul 7, 2020

 

2020లో అప్పుడే ఆరు నెల‌లు గ‌డిచిపోయాయి. వీటిలో తొలి మూడు నెల‌ల కాలంలోనే థియేట‌ర్ల‌లో సినిమాలు విడుద‌ల‌య్యాయి. ఇంకా చెప్పాలంటే రెండున్న‌ర కాలంలోనే వ‌చ్చాయి. త‌ర్వాత క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి నిరోధంలో భాగంగా థియేట‌ర్లు మూల‌న ప‌డ్డాయి. కానీ క‌రోనా వ్యాప్తి అడ్డూ అదుపూ లేకుండా వ్యాప్తి చెందుతూనే ఉంది. ఇవాళ ప్ర‌పంచంలోనే అత్య‌ధిక క‌రోనా కేసులున్న దేశాల్లో భార‌త్ మూడో స్థానానికి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లో ఉన్న‌ప్ప‌టి ప‌రిస్థితితో పోలిస్తే లాక్‌డౌన్ అనంత‌రం కేసులు ఇబ్బ‌డిముబ్బ‌డిగా పెరుగుతున్నాయి. థియేట‌ర్లు మూత‌ప‌డ‌టంతో సినిమాప్రియులు దిగులుప‌డ్డారు. అయితే థియేట‌ర్ల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఇప్పుడు ఓటీటీ క‌నిపిస్తోంది. పెద్ద సినిమాల‌ను ప‌క్క‌న‌పెడితే చిన్న సినిమాలు ఒక్కొక్క‌టిగా ఓటీటీలో రిలీజ‌వుతున్నాయి. మొద‌ట్లో ఓటీటీపై అంత‌గా దృష్టిపెట్ట‌ని ప్రేక్ష‌కులు ఇప్పుడు దానికి ల‌భిస్తున్న ప్ర‌చారంతో స్ట్రీమింగ్ సైట్ల‌వైపు ఆక‌ర్షితుల‌వుతున్నారు.

ఆ విష‌యం అలా ఉంచితే ద‌క్షిణాదిన మ‌ల‌యాళ సినిమాకున్న పేరు ప్ర‌ఖ్యాతులు చాలామందికి తెలిసిందే. జాతీయ స్థాయిలో ద‌క్షిణాదికి త‌ర‌చూ ప్రాతినిథ్యం వ‌హించేది మ‌ల‌యాళ సినిమాలే. స్టార్‌డ‌మ్ కంటే కంటెంట్‌ను నమ్ముకొనే అక్క‌డ సినిమాలు త‌యార‌వుతుండ‌టం దీనికి కార‌ణం. అందుకే ఇవాళ ప‌లు మ‌ల‌యాళ సినిమాల‌ను తెలుగులో రీమేక్ చేయ‌డానికి మ‌న నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ఏడాది మ‌ల‌యాళంలో థియేట‌ర్ల‌లో విడుద‌లై మంచి పేరు తెచ్చుకున్న అలాంటి ఓ ప‌ది సినిమాలను ప‌రిచ‌యం చేయ‌డం ఈ వ్యాసం ఉద్దేశం.

1. ఫోరెన్సిక్‌


ఒక సీరియ‌ల్ కిల్లింగ్ కేసును త‌న ఫోరెన్సిక్ స్కిల్స్‌తో శామ్యూల్ జాన్ ఎలా ఛేదించాడు, కిల్ల‌ర్‌ను ఎలా గుర్తించాడ‌నే కాన్సెప్ట్‌తో అన‌స్ ఖాన్‌, అఖిల్ పాల్ తీసిన ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా పరుగులెత్తుతుంది. డైరెక్ట‌ర్ల‌గా వాళ్ల‌కు ఇది ఫ‌స్ట్ ఫిల్మ్ కావ‌డం గ‌మ‌నార్హం. శామ్యూల్ జాన్‌గా టొవినో థామ‌స్‌, అత‌నికి స‌హ‌క‌రించే శిఖా దామోద‌ర్‌గా రెబా మోనికా న‌టించిన ఈ మూవీలో మ‌మ‌తా మోహ‌న్‌దాస్ ఒక కీల‌క పాత్ర‌లో ద‌ర్శ‌న‌మిస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

2. ట్రాన్స్‌


క‌న్యాకుమారికి చెందిన విజు ప్ర‌సాద్ అనే మోటివేష‌న‌ల్ ట్రైన‌ర్ జీవితంలోని వివిధ ద‌శ‌ల‌ను ఆస‌క్తిక‌రంగా చిత్రించిన సినిమా థ్రిల్ల‌ర్ ఈ మూవీ. అన్వ‌ర్ ర‌షీద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విజు ప్ర‌సాద్‌గా ఫహ‌ద్ ఫాజిల్ ఉన్న‌త స్థాయిలో న‌టించ‌గా, గౌత‌మ్ మీన‌న్‌, న‌జ్రియా న‌జీమ్‌, శ్రీ‌నాథ్ భాసి కీల‌క పాత్ర‌లు పోషించారు. ప్రైమ్ వీడియోలో ఈ సినిమాని తిల‌కించ‌వ‌చ్చు.

3. క‌ప్పేలా


వాయ‌నాడ్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన జెస్సీ అనే ఒక అమాయ‌క యువ‌తి ఇంట్లో పెద్ద‌వాళ్లు త‌న‌కు నిశ్చితార్థం ఏర్పాట్లు చేస్తుంటే, త‌ను మ‌న‌సిచ్చిన విష్ణు అనే ఆటోడ్రైవ‌ర్  కోసం కోళికోడ్‌కు వెళ్లి ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటుంద‌నే క‌థాంశంతో రూపొందిన రొమాంటిక్ థ్రిల్ల‌ర్ ఇది. జెస్సీగా అన్నా బెన్‌, విష్ణుగా రోష‌న్ మాథ్యూ, రాయ్ అనే మ‌రో కీల‌క పాత్ర‌లో శ్రీ‌నాథ్ భాసి న‌టించిన ఈ సినిమాకు మ‌హ‌మ్మ‌ద్ ముస్త‌ఫా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. తెలుగులో రీమేక్ కాబోతున్న ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు.

4. అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌


అయ్య‌ప్ప‌న్ అనే సీనియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌కూ, సైన్యంలో హ‌వ‌ల్దార్‌గా ప‌నిచేసి వ‌చ్చిన కోషికీ మ‌ధ్య జ‌రిగే ఈగో క్లాష్‌ల‌తో యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో అయ్య‌ప్ప‌న్‌గా బిజూ మీన‌న్‌, కోషిగా పృథ్వీరాజ్ న‌ట‌న‌ను చూసి తీరాల్సిందే. ఈ సినిమా డైరెక్ట‌ర్ స‌చి ఇటీవ‌లే హ‌ఠాత్తుగా మ‌ర‌ణించ‌డం బాధాక‌రం. ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అందుబాటులో ఉంది.

5. అంజామ్ ప‌థిరా


ఒక సీరియ‌ల్ కిల్ల‌ర్‌ను ప‌ట్టుకోడానికి పోలీసులు ప‌డే క‌ష్టాలు ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్‌లో ఉత్కంఠ‌భ‌రితంగా ఉంటాయి. హ‌త్య‌ల‌కు గుర‌య్యేది పోలీస్ ఆఫీస‌ర్లే కావ‌డం ఈ క‌థ‌లో కీల‌కాంశం. మిథున్ థామ‌స్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కుంచ‌కో బొబ‌న్ ప్ర‌ధాన పాత్ర పోషించ‌గా, జిను జోసెఫ్‌, ఉన్నిమ‌య ప్ర‌సాద్‌, శ్రీ‌నాథ్ భాసి కీల‌క పాత్ర‌లు చేశారు. స‌న్ నెక్ట్స్‌లో ఈ సినిమాని చూడొచ్చు.

6. షైలాక్‌


క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో వెట‌ర‌న్ సూప‌ర్‌స్టార్ మ‌మ్ముట్టి న‌టించిన ఈ మూవీ యాక్ష‌న్ ప్రియుల‌ను బాగా అల‌రిస్తుంది. కేర‌ళ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో బాస్‌గా పేరుపొందిన ఫైనాన్షియ‌ర్ జీవితంలో జ‌రిగే ఘ‌ట‌న‌ల స‌మాహారం ఈ యాక్ష‌న్ డ్రామాలోని ప్ర‌ధానాంశం. అజ‌య్ వాసుదేవ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలో మీనా, జ‌య‌ప్ర‌కాశ్‌, సిద్ధిక్ కీల‌క పాత్ర‌ధారులు. ప్రైమ్ వీడియోలో ఒరిజిన‌ల్ వెర్ష‌న్‌, 'ఆహా'లో తెలుగు డ‌బ్బింగ్ వెర్ష‌న్ అందుబాటులో ఉన్నాయి.

7. వ‌ర‌ణే అవ‌శ్య‌ముండ్‌


నీనా, నికిత అనే త‌ల్లీకూతుళ్ల జీవితంలోకి ఒక రిటైర్డ్ ఆర్మీమేన్ మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్‌, బిపీష్ అనే యువ‌కుడు వ‌చ్చిన‌ప్పుడు ఎలాంటి ప‌రిణామాలు ఏర్ప‌డ్డాయ‌నేది ఈ ఫ్యామిలీ డ్రామాలోని ప్ర‌ధానాంశం. నీనా, నికిత పాత్ర‌ల్లో శోభ‌న‌, క‌ల్యాణీ ప్రియ‌ద‌ర్శ‌న్‌.. ఉన్నికృష్ణ‌న్‌, బిపీష్ పాత్ర‌ల్లో సురేశ్ గోపి, దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించిన ఈ ఎంట‌ర్‌టైన‌ర్‌ను అనూప్ స‌త్య‌న్ డైరెక్ట్ చేశాడు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాని తిల‌కించ‌వ‌చ్చు.

8. బిగ్ బ్ర‌ద‌ర్‌


ఒక బాల‌నేర‌స్థుల గృహానికి వెళ్లి, అనుకోని ప‌రిస్థితుల్లో ఒక హ‌త్య చేయాల్సి వ‌చ్చిన స‌చ్చిదానంద‌న్ అనే వ్య‌క్తి క‌థ ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన అత‌ను త‌న కుటుంబం ఎదుర్కొన్న దుర‌వ‌స్థ చూసి షాక్ తిని, అందుకు కార‌ణ‌మైన ఒక ప‌వ‌ర్‌ఫుల్ డ్ర‌గ్ మాఫియాపై ఎలా యుద్ధం చేశాడ‌నేది ఆస‌క్తిక‌రం. సిద్ధిక్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో స‌చ్చిదానంద‌న్‌గా సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ న‌ట విన్యాసాల‌ను మ‌నం ఆస్వాదించ‌వ‌చ్చు. మాఫియా డాన్‌గా బాలీవుడ్ యాక్ట‌ర్ అర్బాజ్ ఖాన్ న‌టించిన ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

9. అన్వేష‌ణ‌మ్‌


త‌న కుటుంబానికి ఏదో ప్ర‌మాదం జ‌రిగింద‌ని విన్న అర‌వింద్ ప‌రుగుప‌రుగున హాస్పిట‌ల్‌కు వెళ్తే, అత‌డికి ఎలాంటి షాకింగ్ విష‌యాలు తెలిశాయి, ఆ త‌ర్వాత అత‌డు దేనికోసం అన్వేష‌ణ సాగించాడ‌నే కాన్సెప్ట్‌తో ఉత్కంఠ‌భ‌రితంగా సాగే మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ఈ సినిమా. అర‌వింద్‌గా జ‌య‌సూర్య న‌టించిన ఈ మూవీకి ప్ర‌సోబ్ విజ‌య‌న్ ద‌ర్శ‌కుడు. ప్రైమ్ వీడియోలో ఈ సినిమాని చూడొచ్చు.

10. గౌత‌మంటే రాధ‌మ్‌


కుటుంబంలో తొలిసారిగా కారుకొన్న గౌత‌మ్‌ అనే యువ‌కుడు డ్రైవింగ్ లైసెన్స్ పొంద‌డం కోసం ప‌డే క‌ష్టాలు ఈ సినిమా ఇతివృత్తం. ఆద్యంతం ఆహ్లాద‌భ‌రితంగా న‌డిచే ఈ కామెడీ మూవీలో గౌత‌మ్‌గా నీర‌జ్ మాధ‌వ్ అల‌రించ‌గా, క‌ల్యాణి అనే హీరోయిన్ రోల్‌ను పుణ్య ఎలిజిబెత్ చేసింది. బాసిల్ జోసెఫ్‌, ఆనంద్ మీన‌న్ సంయుక్తంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.