మహేశ్ పిలుపు: నా బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉండండి!
on Aug 7, 2020
ఆగస్ట్ 9 మహేశ్ బర్త్‌డే కావడంతో ఆ రోజు కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకునే విధంగా ఈసారి సెలబ్రేట్ చేసుకోవద్దని వాళ్లను మహేశ్ కోరాడు. ప్రతిసారీ ఆయన బర్త్‌డేకి ఫ్యాన్స్ కేకులు కట్‌చేసి చారిటీ ప్రోగ్రామ్స్ చేయడం అలవాటుగా చేసుకున్నారు. కానీ ఇప్పుడు వాటికి దూరంగా ఇంట్లోనే క్షేమంగా ఉండమని సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశాడు మహేశ్. సాధారణంగా ఇంగ్లీష్‌లోనే తన అభిప్రాయాలను షేర్ చేసుకొనే ఆయన, తెలుగులోనూ ఓ నోట్‌ను ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశాడు.
"ప్రియమైన అభిమానులకు, మీరందరూ నాకు తోడుగా ఉండడం నా అదృష్టం. నా పుట్టినరోజు, ఒక ప్రత్యేకమైన రోజుగా గుర్తుండాలని మీరు చేస్తున్న మంచి పనులకు చాలా సంతోషంగా ఉంది. అందుకు మీ అందరినీ అభినందిస్తున్నాను. ప్రస్తుతం కరోనాతో మనమందరం చేస్తున్న ఈ యుద్ధంలో సురక్షితంగా ఉండడం అనేది అన్నిటికంటే ముఖ్యం. నా పుట్టినరోజున అభిమానులందరూ సామూహిక వేడుకలకు దూరంగా ఉండి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రేమతో మీ మహేశ్‌బాబు" అని ఆ నోట్లో తెలిపాడు మహేశ్. సంతకం మాత్రం తెలుగులో కాకుండా ఇంగ్లీష్‌లోనే పెట్టాడు.
ప్రతి ఏటా మహేశ్ పుట్టినరోజును అభిమానులు బైక్ ర్యాలీలు, రక్తదానాలు, కేక్ కటింగ్‌లు ద్వారా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. తెలుగు రాష్ట్రాల్లోని ఫ్యాన్స్ అసోసియేషన్స్ అన్నీ ఆ రోజు కలుసుకుంటాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి అంతకంతకూ వ్యాప్తి చెందుతుండటం, దాని ప్రభావం తగ్గకపోగా తీవ్రమవుతుండటంతో వాళ్లను ఇళ్లకే పరిమితం కావాలంటూ సామూహిక వేడుకలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చాడు.
అయితే ఫ్యాన్స్‌ని డిజప్పాయింట్ చేయకుండా ఆ రోజు సర్కారు వారి పాట టైటిల్ ట్రాక్‌ను రిలీజ్ చేయడానికి ఆయన ప్లాన్ చేస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆ పనిలో నిరంతరం శ్రమిస్తున్నాడు.