English | Telugu

మహేశ్ స్ట్రాటజీ.. 'కేజీఎఫ్' డైరెక్టర్‌తో డీల్ కుదిరినట్లే!

on Sep 10, 2019

 

కన్నడ సినిమా 'కె.జి.ఎఫ్'తో దేశవ్యాప్తంగా సినీ ప్రియుల దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అందులో హీరోగా చేసిన యశ్ సరికొత్త సూపర్‌స్టార్‌గా అవతరించాడు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ టాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌తో సినిమా చెయ్యాలనే తన కలను నిజం చేసుకొనే దిశగా అడుగులు వేస్తున్నాడు. అవును. ఆదివారం అతను హైదరాబాద్‌లో ఉన్నాడు. 'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్‌లో బిజీగా ఉన్న మహేశ్‌ను కలిశాడు. అతని కోసం రాసుకున్న స్టోరీ ఐడియా చెప్పాడు. విన్న వెంటనే మహేశ్‌కు ఆ లైన్ నచ్చేసింది. దాని ఫుల్ స్క్రిప్ట్ వినిపించాల్సిందిగా మహేశ్ కోరాడు. సరేనంటూ ఆనందంతో ప్రశాంత్ వెళ్లాడు.. ఇదీ ఇప్పుడు ఫిలింనగర్‌లో హాట్ హాట్‌గా వినిపిస్తోన్న న్యూస్. ఆన్‌లైన్‌లోనూ ఇది వైరల్‌గా మారింది.

మహేశ్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఇది నిజమే. 'సరిలేరు నీకెవ్వరు' మూవీ తర్వాత ప్రశాంత్ నీల్‌తో పని చెయ్యాలని మహేశ్ కొంత కాలం క్రితమే డిసైడ్ అయ్యాడు. 'కేజీఎఫ్' మూవీని ప్రశాంత్ రూపొందించిన తీరు అతనికి విపరీతంగా నచ్చింది. ఆ మూవీలో యశ్ చేసిన రాకీ కేరెక్టర్‌ను ప్రశాంత్ మలిచిన విధానం, ఆ కేరెక్టర్‌కు మదర్ సెంటిమెంట్‌ను జోడించిన విధానం, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌ను చూపించిన తీరు, అక్కడి సన్నివేశాలు, ఓవరాల్‌గా సినిమాని పరుగులు పెట్టించిన గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే మహేశ్‌కు మైండ్ బ్లోయింగ్ అనిపించాయి. హీరోయిజాన్ని ప్రశాంత్ ఎలివేట్ చేసిన పద్ధతి చూసి, తన బాడీ లాంగ్వేజ్‌కు ప్రశాంత్ డైరెక్షన్ కరెక్టుగా మ్యాచ్ అవుతుందని మహేశ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రశాంత్‌కు కబురు పంపించినట్లు సమాచారం. మహేశ్‌ను దృష్టిలో పెట్టుకొని హీరో కేరెక్టరైజేషన్ ప్రధానంగా నడిచే యాక్షన్ డ్రామాను ప్రశాంత్ సిద్ధం చేసుకున్నాడనీ, అదే ఒక లైన్‌గా మహేశ్‌కు వినిపించాడనీ చెప్పుకుంటున్నారు.

నిజానికి 'మహర్షి' మూవీ తర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో చెయ్యాల్సిన మహేశ్, ఆ ప్రాజెక్టును కేన్సిల్ చేసుకొని, అనిల్ రావిపూడితో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వరుసగా రెండు సీరియస్ సబ్జెక్టులు.. 'భరత్ అనే నేను', 'మహర్షి' చేసినందున.. వెంటనే అదే తరహా సీరియస్ సబ్జెక్ట్ చెయ్యడం కరెక్ట్ కాదనుకొనే అతను సుకుమార్‌కు 'నో' చెప్పాడనేది ఇన్‌సైడర్స్ చెబుతున్న మాట. ఇప్పుడు అదే సబ్జెక్టును అల్లు అర్జున్ ఓకే చెప్పడం వేరే సంగతి. కెరీర్ స్ట్రాటజీలో భాగంగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో హిలేరియస్ ఎంటర్‌టైనర్ అయిన 'సరిలేరు నీకెవ్వరు'ను చేస్తున్నాడు మహేశ్. ఇందులో మహేశ్, రాజేంద్రప్రసాద్ మధ్య వచ్చే సీన్లు ఆడియెన్స్‌ను బాగా నవ్విస్తాయనేది అథెంటిక్ రిపోర్ట్.

ప్రస్తుతం యశ్‌తో 'కేజీఎఫ్ చాప్టర్ 2' చేస్తున్నాడు ప్రశాంత్. ప్రస్తుతం దాని షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతోంది. ఆ సినిమా 2020 వేసవిలోగా రిలీజవనున్నది. మరోవైపు 'సరిలేరు నీకెవ్వరు' సంక్రాంతికి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత యాక్షన్ డ్రామా చెయ్యాలని మహేశ్ భావిస్తున్నాడు. అందులో భాగంగానే ప్రశాంత్ నీల్ కథను విన్నాడు. అన్నీ కుదిరితే అతని డైరెక్షన్‌లోనే తన నెక్స్ట్ మూవీని మహేశ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అతి త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్‌డేట్స్‌తో మళ్లీ కలుద్దాం.


Cinema GalleriesLatest News


Video-Gossips