English | Telugu

మహేశ్ నెక్స్ట్ మూవీ: 'కేజీఎఫ్' డైరెక్టర్ వర్సెస్ 'మహర్షి' డైరెక్టర్!

on Nov 14, 2019

 

మహేశ్ సినిమా 'సరిలేరు నీకెవ్వరు' ప్రమోషన్స్ ఇంకా మొదలు పెట్టనే లేదు. అయినా ఆ మూవీ క్రేజ్ అసాధారణ స్థాయిలో ఉంది. ఒక్క కర్ణాటక ఏరియా మినహా మిగతా అన్ని ఏరియాల ప్రి రిలీజ్ బిజినెస్ ఇప్పటికీ అయిపోవడం విశేషం. సంక్రాంతికి విడుదలవుతున్న తెలుగు సినిమాల్లో ప్రి రిలీజ్ బిజినెస్ విషయంలో 'సరిలేరు నీకెవ్వరు' ముందంజలో ఉంది. అంతే కాదు, హిందీ శాటిలైట్ రైట్స్ కూడా 15 కోట్ల 25 లక్షల రూపాయలకు అమ్ముడుపోయాయి. మహేశ్ సినిమాలకు సంబంధించి హిందీ రైట్స్ విషయంలో ఈ మూవీది రెండో స్థానం. మహేశ్ మునుపటి సినిమా 'మహర్షి' హిందీ రైట్స్ 20 కోట్లు పలికాయి. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ కేరళలో నడుస్తోంది.

కాగా 'సరిలేరు నీకెవ్వరు' సినిమా తర్వాత మహేశ్ ఏ డైరెక్టర్‌తో చేస్తాడనే విషయంలో భిన్న ప్రచారాలు సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. 'మహర్షి' డైరెక్టర్ వంశీ పైడిపల్లితో మరోసారి జట్టు కట్టబోతున్నడనే ప్రచారం, 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే ప్రచారం.. రెండూ జోరుగా సాగుతున్నాయి. 'మహర్షి'కి పని చేస్తున్న సందర్భంలో మహేశ్, వంశీ మధ్య స్నేహం కుదిరి, క్రమేణా బలపడుతూ వచ్చింది. వాళ్లు ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా మారిపోయారు. మహేశ్ కుమార్తె సితార, వంశీ కుమార్తె ఆద్య క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు' మూవీ స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే వంశీ చెప్పిన కథకు మహేశ్ ఇంప్రెస్ అయ్యాడనీ, వెంటనే అతడితో పనిచేయడానికి ఉత్సాహం చూపించాడనీ ప్రచారంలోకి వచ్చింది.

అలాగే ఆమధ్య రామోజీ ఫిల్మ్ సిటీలో 'కేజీఎఫ్ 2' షూటింగ్ జరుగుతున్న సమయంలో మహేశ్‌ని కలిసిన ప్రశాంత్ నీల్.. ఆయనకు ఒక యాక్షన్ డ్రామా స్క్రిప్టును వినిపించాడనీ, అది మహేశ్‌కు బాగా నచ్చిందనే విషయం బయటకు వచ్చింది. ఆ విషయం సోషల్ మీడియాలో బాగా హల్‌చల్ చేసింది. లేటెస్టుగా వినిపిస్తున్నదేమంటే.. ప్రశాంత్‌తో సినిమా చెయ్యడానికే మహేశ్ మొగ్గు చూపుతున్నాడని. వంశీ స్క్రిప్ట్ మోర్ ఎమోషనల్ కంటెంట్‌తో ఉన్నప్పటికీ, 'కేజీఎఫ్'ను ప్రశాంత్ రూపొందించిన విధానం, అతని టేకింగ్ స్కిల్స్ మహేశ్‌ను బాగా ఇంప్రెస్ చేశాయి. అలాంటి డైరెక్టర్ అయితే కొత్తగా తనను తాను ఆవిష్కరించుకొనే ఛాన్స్ కూడా ఉంటుందని మహేశ్ భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఇక్కడ ఇంకో తిరకాసు ఉంది. ప్రశాంత్ నీల్‌తో మూవీ చెయ్యడానికి ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ సైతం డిసైడ్ అయ్యాడు. ఆ ఇద్దరి కాంబినేషన్ సినిమా నిర్మించడానికి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రంగంలోకి వచ్చింది. ఆ ఇద్దరికీ అడ్వాన్సులు కూడా ఇచ్చింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్' మూవీతో వచ్చే ఏడాది జూన్ దాకా బిజీగా ఉండనున్నాడు. ముందుగా లాక్ చేసిన జూలై 30న ఆ సినిమా విడుదలైతే, ఆగస్టు నుంచి ఆయన తర్వాతి సినిమా మొదలుపెడతాడు. అయితే వివిధ కారణాల వల్ల ఆ మూవీ షూటింగ్‌లో జాప్యం జరుగుతూ వస్తుండటం వల్ల 2020 జూలైలో విడుదలయ్యే చాన్సులు చాలా తక్కువగా ఉన్నాయనే ప్రచారం నడుస్తోంది. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు నెక్స్ట్ మూవీకి అందుబాటులో ఉంటాడనే విషయంలో క్లారిటీ లేదు.

దానికి భిన్నంగా 'సరిలేరు నీకెవ్వరు' మూవీ జనవరి 12న విడుదలవడం ఖాయం కాబట్టి ఆ వెంటనే తన తదుపరి సినిమాని మొదలుపెట్టడానికి మహేశ్ రెడీగా ఉన్నట్లే. ఈలోగా 'కేజీఎఫ్ 2'ను ప్రశాంత్ పూర్తి చేయనున్నాడు. దాంతో ఆ ఇద్దరూ కలిసి పనిచెయ్యడం ఖాయమనే విషయం బలంగా వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి మహేశ్ సొంత నిర్మాణ సంస్థ ఈ మూవీని నిర్మించే అవకాశాలున్నాయి. మరి వంశీతో మహేశ్ ఆ తర్వాతైనా చేస్తాడా? అనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే.. 'ఆర్ ఆర్ ఆర్' మూవీ తర్వాత మహేశ్‌తో సినిమా చెయ్యాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. మహేశ్ సైతం ఆయనతో కలిసి వర్క్ చెయ్యడానికి ఈగర్‌గా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత రాజమౌళికే మహేశ్ ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఆ తర్వాతే వంశీ పైడిపల్లితో ఆయన సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే. టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు ఈక్వేషన్స్ మారిపోతుంటాయి కాబట్టి.. ఇప్పటికి అనేకసార్లు మహేశ్ తన ప్లాన్స్‌ని మార్చాడు కాబట్టి.. 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత ఆయన ఏ డైరెక్టర్‌తో పనిచేస్తాడనే విషయం ఒకరికి మాత్రమే కచ్చితంగా తెలుసు. ఆ ఒక్కరు.. మహేశ్!


Cinema GalleriesLatest News


Video-Gossips