సోషల్ మీడియాలో మహేశ్ మరో రికార్డ్!
on Jul 2, 2020
దేశంలోని అత్యంత అందమైన నటుల్లో సూపర్ స్టార్ మహేశ్ ఒకరనేది నిర్వివాదం. "మహేశ్ అనే పేరులోనే వైబ్రేషన్ ఉంద"నే ఇంద్రగంటి మోహనకృష్ణ 'అష్టా చమ్మా' మూవీలోని డైలాగ్ ఓ నానుడిలా మారిపోయిందనేదీ నిజం. రెండు దశాబ్దాల పైగా జర్నీలో హీరోగా అన్ని రకాల ఎత్తుపల్లాలు ఆయన చవిచూశాడు. హీరోగా ఇప్పటిదాకా చేసింది 25 సినిమాలే అయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఇటు ఇండియా, అటు ఓవర్సీస్ ఏరియాల రెండింటిలోనూ ఆయన అనేక రికార్డులను సృష్టించాడు. నిజం చెప్పాలంటే, బాలీవుడ్ సర్కిల్స్‌లో ఎక్కువమందికి తెలిసిన తెలుగు పేర్లలో, ఎక్కువ మంది గౌరవించే తెలుగు నటుల్లో మహేశ్ ముందున్నాడు.
ఇక సోషల్ మీడియా విషయానికి వస్తే, తన వ్యక్తిగత, వృత్తిపర విషయాలను తరచుగా షేర్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నాడు మహేశ్. గురువారం, ఈ సూపర్ స్టార్ ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌పై 10 మిలియన్ (ఒక కోటి) ఫాలోయర్స్‌ను క్రాస్ చేసిన మొదటి సౌత్ ఇండియన్ యాక్టర్‌గా మరో రికార్డ్ సృష్టించాడు. ట్విట్టర్లో మహేశ్‌కు సమీపంలో మరో దక్షిణాది నటుడు లేడు. హ్యాష్‌ట్యాగ్స్, స్పెషల్ పోస్టుల ద్వారా ఈ ఘనతను సోషల్ మీడియాలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పని విషయానికి వస్తే.. పరశురామ్ డైరెక్షన్లో 'సర్కారు వారి పాట' మూవీని చేసేందుకు ప్రిపేర్ అవుతున్నాడు మహేశ్.