English | Telugu

ఆ కళ్లు ఆమెవేనా?

on Oct 17, 2017

అవి కళ్లా...? లేక కలువలా...? కాముడినే కదిలించే.. శృంగార రసగుళికలా?... అదేదో సినిమాలో చెప్పినట్టు.. ఆ కళ్లు చూస్తేనే కవిత్వం తన్నుకొచ్చేస్తుంది. ఇంత అందమైన కళ్లు ఎవరివి అయ్యుంటాయ్?

కాటుక దిద్దిన కళ్లు.. వాటి మధ్య.. బారు బొట్టు... అవి ఆమె కళ్లేనా? లేక.. ఆమెలాంటి మరో వ్యక్తి కళ్లా? ఇంతకీ ఎవరామె? ఆమెలాంటి మరో వ్యక్తి ఎవరు? 

‘ఆమె’ వెండితెర సామ్రాజ్ఙి. తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో కొలువైన అధిష్టాన దేవత. అభినయానికి ఆకారాన్నద్ది ఆ బ్రహ్మ తయారు చేసిన వెండితెర బొమ్మ. ఆమే... ‘మహానటి’ సావిత్రి. 

సావిత్రి లాంటి నటి మళ్లీ పుడుతుందా? అనంటే సమాధానం మౌనమే. తర్వాత వచ్చిన కథానాయికలందరికీ ఓ బెంచ్ మార్క్ సెట్ చేసిన సూపర్ స్టార్ సావిత్రి. తెలుగు ప్రేక్షకులకు సావిత్రిపై అభిమానం ఏ స్థాయిలో ఉందంటే... తర్వాత వచ్చిన ప్రతి కథానాయికలో సావిత్రినే చూసేంత. 

వాణిశ్రీ బాగా చేసిందనుకోండి... ‘అబ్బా సావిత్రిని గుర్తు చేసిందిరా!’..
జయసుధ బాగా నటించిందనుకోండి.. ‘అబ్బా... సావిత్రి అంత గొప్పగా చేసిందిరా!’.. 
విజయశాంతి అద్భుతంగా నటించిందనుకోండి.. ‘అబ్బో సావిత్రినే తలపించిందిగా!’.. 
‘సౌందర్య కనిపించిందంటే చాలు... ‘అబ్బా సావిత్రిని గుర్తు చేస్తుందయ్యా ఈ అమ్మాయ్. ఆ కట్టూ ఆ బొట్టూ’..
 

అంటే... బాగా నటించడం అంటే.. సావిత్రిలా నటించడం అని జనాలు ఫిక్స్ అయిపోయారు. అందంగా సంప్రదాయబద్ధంగా కనిపించడం అంటే.. సావిత్రిలా కనిపించడం అని ప్రేక్షకులు నిర్ణయించేశారు. అది సావిత్రి అంటే.

మరి ఇక్కడున్న కళ్లు సావిత్రివా? లేక ఆమెలాంటి మరో వ్యక్తివా? అసలు ఈ మరో వ్యక్తి ఎవరా! అనుకుంటున్నారా? నిజానికి ఆమెలాంటి అదృష్టవంతురాలు మరొకరు ఉండరేమో! ఎందుకంటే... పైన మనం చెప్పుకున్న కథానాయికలందరిలో జనాలు సావిత్రిని చూశారు. కానీ... ఈ అమ్మాయి.. మనకు సాక్షాత్ సావిత్రిగానే కనిపించబోతోంది. ఆ అమ్మాయి ఎవరో అర్థమయ్యే ఉంటుంది కదూ. ఎస్... కీర్తి సురేశ్. ఆ కళ్లు ఆమెవే. 

సావిత్రివి చారడేసి కళ్లు. ఆ కళ్లతో పలకని భావోద్వేగం ఉండదు. కానీ కీర్తి సురేశ్ కళ్లు.. కాస్త చిన్నవి. కానీ.. సావిత్రిని తలపిస్తున్నాయ్. ఈ విషయంలో కీర్తి కొంతవరకూ విజయం సాధించినట్లే. కళ్లు.. ఆ బారు బొట్టు.. ఆ బ్లాక్ అండ్ వైట్ లుక్... సావిత్రిని గుర్తు చేస్తున్నాయ్. నిజంగా ఈ లుక్ లో చెప్పినట్లు... ‘ఆకాశ వీధిలో ఉన్న ఆ అందాల జాబిలి..’అయిన సావిత్రి.... కీర్తి సురేశ్ లో కనిపిస్తుంది. కంగ్రాట్స్ కీర్తి. లుక్ తో జనాల మనసులు గెలిచేశావ్. మరి అభినయంలో ఆ మహానటిని కాస్తయినా గుర్తు చేస్తావని ఆశిస్తున్నాం. ఈ రోజు ఈ అందాల భరిణ పుట్టిన రోజు. అందుకే... ‘మహానటి’లో కీర్తి ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు చిత్ర యూనిట్. అదిరిపోయింది కదూ. హ్యాపీ బర్త్ డే కీర్తి.. ఆల్ ది బెస్ట్!

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here